GHMC Elections | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనున్నది. అయితే.. ఎన్నికలు మాత్రం ఆలోపే నిర్వహించే అవకాశం లేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల నగర పరిధిని విస్తరిస్తూ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా మూడు వందల డివిజన్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 300 డివిజన్లు కలుపుకొని మెగా కార్పొరేషన్ ఉంటుందా? లేక దాన్ని మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా విభజించి, గ్రేటర్ బెంగళూరు అథార్టీ తరహాలో ఏర్పాటు చేస్తారా? అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. బెంగళూరులో ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో చీఫ్ కమిషనర్‌ను నియమించి గ్రేటర్ బెంగళూరు అథార్టీని ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోనూ అనుసరించి, ఒక్కో కార్పొరేషన్‌కు విడిగా ఒక్కో కమిషనర్‌ను నియమిస్తారనే చర్చలూ ఉన్నాయి. ఈ పాలనాపరమైన వ్యవస్థను ఒక కొలిక్కి తెచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే సమయంలో జీహెచ్‌ఎంసీకి సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆగస్టులోపే హైదరాబాద్ కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయి నూతన పాలక మండలి వస్తుందని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు.
మూడు లేదా నాలుగు కార్పొరేషన్లు
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో విలీనం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 27 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను విలీనం చేసి 300 డివిజన్లుగా ఖరారు చేసి ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. దీంతో పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2050 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగింది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 6 జోనల్ కార్యాలయాలు ఉండగా వాటిని 12కు, 30 సర్కిల్ కార్యాలయాలు ఉండగా వాటిని 60 కు పెంచిన విషయం తెలిసిందే. మొత్తం జనాభా ఒక కోటి ముప్పై లక్షల వరకు ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. డివిజన్ల పరిధి నిర్ణయం, పేర్ల మార్పు, ఇతర అంశాలపై సుమారు 3వేల వరకు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు అందాయి. వీటిని పరిశీలించేందుకు జోనల్ కార్యాలయాల వారీగా ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. తెలంగాణ హైకోర్టు కూడా డివిజన్ల పై అభ్యంతరాలు స్వీకరించేందుకు రెండు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో, గడువులోపే వాటిని పరిష్కరించి వారాంతంలోపే 300 డివిజన్లపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
బెంగళూరులో ఐదు కార్పొరేషన్లు
ప్రస్తుతం బెంగళూరు మహానగరంలో బృహత్ బెంగళూరు మహనగర పాలికే స్థానంలో గ్రేటర్ బెంగళూర్ అథారిటీని (జీబీఏ)ను ఏర్పాటు చేశారు. దాని పరిధిలో ఐదు మునిసిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్‌లో 63 డివిజన్లు, నార్త్ సిటీ కార్పొరేషన్‌లో 72, సౌత్ సిటీ కార్పొరేషన్‌లో 72, ఈస్ట్ సిటీ కార్పొరేషన్‌లో 50, వెస్ట్ సిటీ కార్పొరేషన్‌లో 111 డివిజన్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు కార్పొరేషన్లలో 368 డివిజన్లు ఉండగా, పరిధి 275 చదరపు మైళ్ళు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చైర్‌పర్సన్‌గా, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. జీబీఏ చీఫ్ కమిషనర్ గా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ ఎం.మహేశ్వర్ రావు నియమితులయ్యారు. జీబీఏ పరిధిలోకి వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలైన 75 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఖరారు చేశారు. చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు కేవలం సిటీ డెవలప్ మెంట్ కోసం మాస్టర్ ప్లాన్లు తయారు చేయించడం, ప్రణాళికలు రూపొందించడం, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతలు నిర్వర్తిస్తారు. కార్పొరేషన్లకు నియమించిన కమిషనర్ల చేత చీఫ్ కమిషనర్ పని చేయించనున్నారు.
ఫిబ్రవరిలో ముసాయిదా!
డివిజన్లు ఖరారు అయిన తరువాత ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కార్పొరేషన్లుగా పునర్వవస్థీకరించే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. అలా వీలు కాని పరిస్థితుల్లో నాలుగు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు కావచ్చంటున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ (జీబీఏ)కి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మునిసిపల్ వ్యవహారాల మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని అధికకారవర్గాలు చెబుతున్నాయి. జనాభా లెక్కలు, కుల గణన జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆఘమేఘాల మీద డివిజన్లను పునర్విభజన చేశారు. ఒకసారి జనాభా లెక్కలు ప్రారంభం అయిన తరువాత వార్డుల పునర్విభజన, కొత్తగా ఏర్పాటు చేయడం, పరిధులు నిర్ణయించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడం సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నెలాఖరు కల్లా అవసరమైన ప్రక్రియను మొత్తం పూర్తి చేసి, న్యాయపరంగా చిక్కులు రాకుండా చర్యలు తీసుకోనున్నారు. రానున్న ఫిబ్రవరిలో ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిన తరువాత కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు పై ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తుది నోటిఫికేషన్, గెజిట్ జారీ చేసిన తరువాత హైదరాబాద్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు లోపు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
Read Also |
Bengaluru Cyber Crime : బెంగళూరు లో ప్రతిరోజు రూ.5.45 కోట్ల డిజిటల్ మోసం
AP Paperless Governance : ఆంధ్రప్రదేశ్ లో జనవరి 15నుంచి ఈ పాలన
Silver | ఇక వెండే బంగారం.. ఇప్పుడు కొంటే 2026లో ధనవంతులు అవ్వడం ఖాయమే!
