విధాత: తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ బెనర్జీ సమీప బంధువు మనేకా గంభీర్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అడ్డుకున్నారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.
బ్యాంకాక్ వెళ్లడానికి మనేకా గంభీర్ శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈడీ గతంలోనే ఆమెపై లుకవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమెకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. సమాచారాన్ని ఈడీకి చేర వేయగా వారు వెంటనే అక్కడకు చేరుకొని ప్రయాణించడానికి అనుమతి లేదని తెలిపారు.
సోమవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అక్కడే నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె తిరిగి తన నివాసానికి వెళ్లిపోయారు. ఈ కేసులో మనేకా గంభీర్‌ను ఈడీ ఇప్పటి వరకు విచారించలేదు.
గతంలో సీబీఐ విచారణకు మాత్రం ఆమె హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని గతంలో అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. దీనిపై ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తనను స్థానిక ఈడీ కార్యాలయంలోనే విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన కోర్టు ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది.