Operation Sindoor | పాకిస్తాన్‌కు ఏ దేశమైన మద్దతు ఇచ్చిందంటే అది ఉగ్రవాదాన్ని ఆమోదించడమేనని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. పహల్గామ్ దాడులు, అనంతరం ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతు వంటి అంశాలపై ప్రపంచ దేశాలకు భారత వైఖరిని చాటి చెప్పేందుకు ప్రస్తుతం భారత దౌత్య బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో హిల్లరీ క్లింటన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఇచ్చే మద్దతును ప్రస్తావించిన మాటలను గుర్తు చేశారు. ప్రాంతీయ అస్థిరత్వంలో తన పాత్ర ఏమీ లేదంటూనే హక్కానీ నెట్‌వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలను ఇస్లామాబాద్ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో 2011లో హిల్లరీ క్లింటన్ కీలక పద బంధం ప్రయోగించారు. అది.. ‘పెరట్లో పాములు పెంచడం’.
జనతాదళ్ (యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం.. కొరియా, ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ చైర్‌పర్సన్ యున్ హో-జంగ్‌ను కలుసుకున్నది. దక్షిణ కొరియాకు చెందిన పలువురు మేధావులతోనూ సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ బెనర్జీ.. పాకిస్తాన్‌పై సునిశిత వ్యాఖ్యలు చేశారు. ‘పెరట్లో పాములు పెంచుతూ తమ పొరుగువారినే అవి కాటు వేయాలని ఎవరూ అనుకోరు. ఒకసారి పాము చెలరేగిపోయిదంటే.. ఎవరినైనా సరే అది కాటు వేసి తీరుతుంది. పాము ఎప్పటికీ పామే’ అని అన్నారు.
పెరట్లో పాములు పెంచడం అనే పద ప్రయోగాన్ని 2011లో హిల్లరీ క్లింటన్ చేశారు. పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్ మిలిటరీ ప్రాంతంలో అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు సర్జికల్ స్ట్రైక్‌లో మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పాకిస్తాన్ అధికారులతో మాట్లాడిన హిల్లరీ క్లింటన్.. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతుపై విమర్శలు చేస్తూ.. ‘మీరు మీ పెరట్లో పాములు పెంచుకుంటూ అవి పొరుగువారినే కాటు వేయాలని అనుకోకూడదు’ అని అన్నారు. అదే విషయాన్ని మరోసారి అభిషేక్ బెనర్జీ ప్రస్తావించారు. ‘పాకిస్తాన్ ఉగ్రవాదులను కాపాడుతూ, వారికి ఆశ్రయం ఇస్తున్నది. 9/11 (న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సహా పలు ప్రాంతాలపై దాడి) దాడుల నుంచి 26/11 (ముంబై మారణహోమం) వరకూ.. యురి నుంచి పహల్గామ్ వరకూ.. జరిగిన ఉగ్రవాద దాడులన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అన్ని వేళ్లూ పాకిస్తాన్‌వైపే చూపిస్తున్నాయి’ అని ఆయన చెప్పారు. పహల్గామ్ రాక్షస కాండ తర్వాత భారత దేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి రెండు వారాలు ఆగిందని అభిషేక్ అన్నారు. ఆపరేషన్‌లో కూడా పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకుని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. ‘అదీ ఇండియా అంటే.. దృఢ సంకల్పం, అదే సమయంలో గౌరవనీయమైన చర్య’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు.. పాకిస్తాన్‌లో రాచ మర్యాదలు! ఆరుగురు గన్ మెన్స్
Controlled Alcohol Sales : 73 ఏళ్ల తర్వాత అక్కడ మద్యపానంపై నిషేధం ఎత్తివేత! కానీ.. దానిపై మాత్రం లేదు!