Fake E-Challans | ట్రాఫిక్​ నకిలీ ఈ–చలాన్​ ఎస్​ఎమ్మెస్​లు : లింక్​ క్లిక్​ చేయకండి

నకిలీ ఈ-చలాన్ మెసేజ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ పేరుతో SMS ద్వారా ఫేక్ లింకులు పంపి బ్యాంక్, కార్డుల వివరాలు దోచుకునే మోసాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అసలు-నకిలీ ఎలా గుర్తించాలి? ఏ URLలు జాగ్రత్తగా చూడాలి? ప్రజలు మోసపోకుండా ఉండేందుకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నకిలీ ట్రాఫిక్ చలాన్ స్కామ్ SMS — సాధారణ 10 అంకెల నంబర్ నుంచి వచ్చిన సందేశం, స్పీడింగ్ రికార్డ్ అయ్యిందంటూ ఫేక్ లింక్‌ (cutt.ly) పంపిన ఫోటో.

Indians Hit by Fake Traffic Challan Messages: Here’s How Scammers Trap You

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

ముంబైకి చెందిన హాస్యనటుడు శ్రీధర్,  ఈ-ఛలాన్ మోసగాళ్ల ఉచ్చులో పడబోయిన ఘటన పెద్ద సోషల్​ మీడియాలో చర్చనీయాంశమైంది. మోర్ట్‌ (MoRTH) అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే ఓ నకిలీ పోర్టల్‌ను సిద్ధం చేసి, ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు.

శ్రీధర్ తన ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్‌లో షేర్ చేసిన స్క్రీన్‌షాట్స్‌లో, స్పీడింగ్ చలాన్ పేరుతో ఓ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తోంది. విచిత్రమేమిటంటే—ఈ సందేశం సాధారణ 10 అంకెల ఫోన్ నంబర్‌ నుంచి వచ్చింది. మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేస్తే ‘echallan.pasvahan.icu’ అనే URL కనిపించిందని, అది ‘echallan.parivahan.gov.in’లా నకిలీగా డిజైన్ చేశారని చెప్పారు.
అంతేకాదు, ‘parivahan’ అనే పదాన్ని కూడా ‘pasvahan’గా తప్పుగా టైప్ చేసి పోర్టల్‌ను తయారు చేయడం మోసగాళ్ల ధైర్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫేక్ సైట్‌లో కార్డు వివరాలు అడిగే స్థాయికి వెళ్లడంతో, అనుమానం వచ్చి వెంటనే గూగుల్‌లో చెక్ చేయడంతో మోసం బయటపడిందని తెలిపారు.

సోషల్ మీడియాలో చర్చజాగ్రత్తలు తప్పనిసరి

ఈ ఘటనను శ్రీధర్ బయటపెట్టడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఇప్పటికే దేశం మొత్తం మీద ఈ మెసేజ్​లు వ్యాపించాయని,  పలువురు తమకు ఇలాంటి సందేశాలు తరచుగా వస్తాయని, చాలామంది తెలియక మోసపోతున్నారని కామెంట్ చేశారు. హైదరాబాద్​లో కూడా చాలామందికి ఇలాంటి మెసేజ్​లు వచ్చినట్లు తెలిసింది.

ప్రభుత్వ మెసేజ్​లు నెంబర్లనుండి రావు

నిజానికి, ప్రభుత్వ విభాగాలు సాధారణ నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపవని, నిజమైన చలాన్‌లో ఎల్లప్పుడూ వాహనం ఫోటోలు ఉంటాయని గుర్తుచేశారు. మరికొందరు తమకూ ఇలాంటి స్కామ్‌లతో డబ్బు నష్టపోయిన సందర్భాలు ఎదురయ్యాయని వెల్లడించారు. అధికారులు సరైన వెబ్​సైట్​లను సరిచూసుకోవాలని హెచ్చరించారు.

నకిలీ వెబ్‌సైట్ల ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం తీసుకునే ప్రయత్నాలు ఇటీవ‌ల విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సందేశాలు వచ్చిన ప్రతిసారీ అధికారిక ‘.gov.in’ డొమైన్‌లో ఉన్న వెబ్‌సైట్లలోనే పరిశీలించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పోలీస్​ సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా దీనిపై దృష్టి సారించాయి.

Latest News