Adharva / Trending News / Viral News / 05-08-2025
Virtual Receptionist | నేటి రోజుల్లో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పాలంటే… మనుషుల స్థానాన్ని క్రమంగా యంత్రాలు భర్తీ చేస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. దీన్నే మరింత స్పష్టంగా చూపిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని మియామీ రాష్ట్రంలోని ఓ హోటల్‌లో ఓ అతిథి చెక్‌ఇన్ చేయడానికి వెళ్లినప్పుడు ఎదురైన దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముందున్న కౌంటర్ ఖాళీగా ఉండటమే కాదు… ముందున్న స్క్రీన్‌పై ఓ యువకుడు ప్రత్యక్షమయ్యాడు – అది కూడా భారతీయ మూలాలున్న యువకుడు.
ఈ వీడియోను పీట్ లాంగ్స్ (Pete Langs) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘‘Miami Virtual Check-in in Hotels’’ అనే శీర్షికతో షేర్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 1.74 లక్షల వ్యూస్ వచ్చిన ఈ క్లిప్‌లో, ఓ వ్యక్తి స్క్రీన్ ద్వారా అతిథిని స్వాగతిస్తూ, చెక్‌ఇన్ విధానాన్ని వర్చువల్‌గా నిర్వర్తించడం కనబడుతోంది. అతని తర్వాత ఒక AI వాయిస్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినిపిస్తూ, అతిథికి హోటల్ నిబంధనలు, ఇతర వివరాలు తెలుపుతుంది.
ఇది భవిష్యత్తా? లేక ఉద్యోగాలపై ముప్పా?
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరికి ఇది కొత్తగా, ఆకట్టుకునేలా అనిపించగా… మరికొందరికి మాత్రం మానవ వనరుల ఖర్చును తగ్గించే సాంకేతికతగా కనిపించి ఆందోళన కలిగించింది. “ఇలాంటివి మనుషుల ఉద్యోగాలను క్రమంగా నాశనం చేస్తాయి. బహిష్కరించాలి!” అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరొకరు “ఎవరెక్కడో కూర్చొని స్క్రీన్ మీద రిసెప్షన్ చేయించడం ఏమిటి? చెత్తగా ఉంది!” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. అయితే అదే సమయంలో మరికొందరికి ఇది సాంకేతిక పరిజ్ఞానంలో ముందడుగు, ఇబ్బందులు లేని చెక్‌ఇన్ విధానం అని అనిపించింది. “వావ్, ఎంత సులభంగా చెక్‌ఇన్ చేస్తారు! ఇది బాగుంది” అని అభినందించారు. “నేనూ ఆ హోటల్‌కి వెళ్లాను, సెటప్ బాగా ఉంది” అని మరొకరు పేర్కొన్నారు.
వీడియో చూడండి.
ఇది కొత్త కాదు… కానీ ఈసారి స్పష్టత ఎక్కువ
వర్చువల్ రిసెప్షనిస్ట్ సిస్టమ్‌ను అమెరికా, యూరోప్ దేశాల్లో కొన్ని హోటల్స్ ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించాయి. గతేడాది ఢిల్లీలోని ఓ కంపెనీ కూడా అలాంటి సేవల్ని ట్రయల్ రన్ చేసింది. కానీ ఇప్పుడు వైరల్ అయిన ఈ వీడియోలో భారతీయ యువకుడు పాల్గొనడంతో, భారతీయుల దృష్టిలో ఇది ఆసక్తికర అంశంగా మారింది.
భవిష్యత్తులో ఇదే విధానమా?
ఈ తరహా వర్చువల్ సర్వీసులు, రోబోట్ హెల్ప్‌డెస్క్‌లు, AI వాయిస్ అసిస్టెంట్లు త్వరలోనే హోటల్, రెస్టారెంట్, బ్యాంకింగ్ రంగాల్లో విస్తృతంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో మానవీయ స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ” టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా, మానవ సంబంధం అనేది కీలకం” అని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అషికాకు బర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువ
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పవన్ కల్యాణ్ షూటింగ్ పార్ట్ పూర్తి
Northern King Cobra| ఎంత ధైర్యముంటే అంత భారీ కింగ్ కోబ్రాను పట్టాలి?
Greenfield Highway Route Map | హైదరాబాద్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే 277 కిలోమీటర్ల మార్గం ఇదే?