Bizarre Wedding | ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో జరిగిన ఒక విచిత్ర వివాహం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన కంటే 50 ఏళ్లు చిన్నదైన యువతిని 74 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. అది కూడా సాదాసీదాగా కాదు ఏకంగా ఒక కోటి 50 లక్షల రూపాయలను ఎదురు కట్నంగా చెల్లించి వధువును వివాహమాడడం చర్చనీయాంశంగా మారింది.దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి…
తూర్పు జావాలోని పాసిటాన్ రీజెన్సీలో అక్టోబర్ 1న తర్మన్ (74) అనే వృద్ధుడు, షెలా అరికా (24) అనే యువతిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా వరుడు, వధువుకు మూడు బిలియన్ ఇండోనేషియా రూపాయలు అందించినట్లు బహిరంగంగా ప్రకటించాడు. మొదట్లో వధువుకు ఒక బిలియన్ రూపాయలు (సుమారు రూ.50 లక్షలు) చెల్లిస్తానని చెప్పారు. కానీ, పెళ్లి వేడుకలో దాన్ని హఠాత్తుగా మూడు బిలియన్లకు పెంచాడు. వరుడు మూడు బిలియన్ల రూపాయల చెక్కును అందించగానే అతిథులు ఉప్పొంగిపోయి చప్పట్లు కొట్టారు. ఈ పెళ్లిలో అతిథుల నుంచి బహుమతులు స్వీకరించే బదులు, నిర్వాహకులు ప్రతి ఒక్కరికీ నగదును పంపిణీ చేశారు.
కానీ, వరుడు పెళ్లి ఖర్చులు చెల్లించకుండా ఉడాయించాడని నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది. తమ సర్వీస్ ఫీజులు చెల్లించకుండా కొత్త జంట వెళ్లిపోయిందని, వెంటనే తమతో సంబంధాలు తెంచుకున్నారని ఆ వివాహ ఫోటోగ్రఫీ సంస్థ బహిరంగంగా ఆరోపించింది. వధువు తరపు బంధువు ఒకరు లైవ్ స్ట్రీమ్‌లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని కుటుంబం, పొరుగువారు పదేపదే హెచ్చరించినా, ఆమె ఈ వివాదంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, విమర్శలు పెరగడంతో, వరుడు తర్మన్ స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు. పెళ్లి కూతురికి ఎదురుకట్నం ఇవ్వడం నిజమేనని స్పష్టం చేశారు. తాను పెళ్లి తర్వాత పారిపోయాడనే పుకార్లను ఆయన తీవ్రంగా ఖండించారు. “నేను నా భార్యను వదిలిపెట్టలేదు, మేము ఇంకా కలిసే ఉన్నాము,” అని ఆయన స్పష్టం చేశారు. వధువు కుటుంబం కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ, “అది తప్పుడు వార్త. వారు కేవలం హనీమూన్‌కు వెళ్లారు” అని వివరణ ఇచ్చింది. మరోవైపు, చెల్లించని సర్వీస్ ఫీజుల గురించి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.