విధాత: ఈటల రాజేందర్ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ సెషన్ మొత్తం ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయడం గర్హనీయం. గతంలో ఉద్యమ సమయంలో ఇంతకంటే ఎక్కువగా చేసిన ఉదంతాలున్నాయని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు ఇది టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమని అని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. కేంద్రం తీసుకురానున్న విద్యుత్ బిల్లుపై శాసనసభలో చర్చ జరగడం శుభపరిణామమే. అయితే ప్రతిపక్ష సభ్యులు లేకుండా చర్చ జరగడం మంచిది కాదనే అభిప్రాయం ఉన్నది.
మన సభ హుందాగా ఉండాలని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి చిన్న విషయాలను పెద్దగా చేసి సభలో సభ్యులను బైటికి పంపడం సరికాదంటున్నారు. సహజంగానే స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహిరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. వాటికి ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలి.
అంతేగాని ఇలా సభ్యలను సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే, ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈటల విషయంలో అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తున్నది. శాసనసభా వ్యవహారాల మంత్రి ఆయన సభలో ఉండాలి.. చర్చలో పాల్గొనాలి అంటూనే చర్యలకు దిగడం ఏమిటి అని నిలదీస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇంత దుర్మార్గంగా ఏనాడూ వ్యహరించలేదంటున్నారు. ఒక విపక్ష సభ్యుడిని సస్పెండ్ చేస్తే మిగతా ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీని ప్రశ్నించక పోవడాన్ని ఈ సందర్భంగా తప్పు పడుతున్నారు.