Site icon vidhaatha

కార్గిల్ యుద్ధం వెనుక పశువుల కాపరి.. భారత విజయంలో కీలకపాత్ర !!

విధాత:సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున దాయాదీ పాకిస్తాన్‌పై భారత్ అఖండ విజయాన్ని సాధించింది.. దొడ్డిదారిన కళ్లుగప్పి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్‌కు గుణపాఠం చెప్పిన రోజు..వందల మంది సైనికుల ప్రాణత్యాగాలకు ఫలితం ఆ విజయం.. దీనినే ” విజయ్ దివస్‌ ” గా దేశప్రజలు ప్రతి ఏడాది జరుపుకుంటారు. భారత యుద్ధ వ్యూహాలలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కార్గిల్ యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు.

   ఆకాశాన్ని తాకే కొండలపై నరాలు కొరికేసే చలిలో తమ సత్తా ఏంటో  పాకిస్థాన్ ముష్కరులకు చాటి చెప్పింది. సాధారణంగా  చలికాలంలో సైన్యం తమ తమ పోస్టులను  వదిలి వెచ్చగా ఉండే ప్రాంతాలకు తరలి వెళ్తాయి. భారత సైన్యం ఎప్పటిలాగానే తమ బంకర్లు ఖాళీ చేసి వేరే చోటికి తరలివెళ్లాయి. వ్యూహాం ప్రకారం పాకిస్తాన్‌ అదను చూసి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.

   కార్గిల్ ప్రాంతం రక్షణపరంగా భారత్‌కు అత్యంత కీలకమైనది..దీనిని కైవసం చేసుకుంటే లడఖ్‌ను కైవసం చేసుకుని..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ను తమ వశం చేసుకోవాలన్నది పాక్ పన్నాగం.. కార్గిల్ ప్రాంతం వైపుగా ఉన్న పాక్ సేనలకు భారత సైనికులు సులభంగా కనిపిస్తారు..దీనితో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టమైన పని.. భారత్ ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు కాబట్టి.. భారతసైన్యం పలచబడి.. పాకిస్తాన్‌కు అనుకూలంగా మారుతుందని దాయాదీ దేశం పన్నాగం.

    దీనిలో భాగంగా తమ సైన్యం చేత కార్గిల్‌ను అక్రమించింది. ఆ ప్రాంతం పాక్ సైన్యం చేతుల్లోకి వెళ్ళిందన్న విషయం భారత సైన్యానికి కానీ,భారత ప్రభుత్వానికి కానీ తెలియదు. అయితే మే నెలలో కానీ విషయం మనకు తెలియలేదు..గస్తికి వెళ్లిన రెండు బృందాలు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ సౌరవ్ కాలియా నేతృత్వంలో మరో బృందాన్ని పంపారు.కానీ వారు కూడా తిరిగిరాలేదు.అనుమానం వచ్చిన భారత సైన్యం భారీ బలగాలతో కార్గిల్ సెక్టార్‌కు వెళ్లింది..

  ఆ ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి సైన్యానికి ఎదురయ్యాడు.. ఎవరు నువ్వు..? ఇక్కడ ఏం పని అని జవాన్లు ప్రశ్నించగా.. తాను ఒక పశువుల కాపరినని..తన గేదె తప్పిపోవడంతో వెతుక్కుంటూ అక్కడికి వెళ్లానని... అక్కడ కొందరు ఆయుధాలతో ఉన్న వ్యక్తులు తన గేదెను చంపి తిన్నారు అని చెప్పాడు..అంతేకాకుండా మన భారత సైనికులు దాదాపు 50 నుంచి 60 మంది మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయని చెప్పాడు.

   అక్కడ ఎంత మంది ఉన్నారు..ఎన్ని బంకర్లు ఉన్నాయని పూసగుచ్చి చెప్పాడు..అతడు ఇచ్చిన సమాచారంతోనే భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని కార్గిల్‌వైపుగా వెళ్లే రహదార్లను మూసివేసి పాక్‌సైన్యానికి,ముష్కరులకు ఏం వెళ్లకుండా చేసినట్లు నిరోధించగలిగారు.. నాటి ప్రధాని వాజ్‌పేయ్ రక్షణ నిపుణలతో చర్చించి పాక్‌కు ధీటైన వ్యూహాన్ని అమలు చేశారు.నేలపై ఉన్న సైన్యానికి,వాయుసేన పూర్తి అండగా నిలివగా.. భోఫోర్స్ ఫిరాంగుల గర్జనకు పాక్ హడలిపోయింది.

   అలా సుమారు రెండు నెలల పాటు భారత సైన్యం మొక్కవోని దీక్షతో శత్రుసైన్యాన్ని మట్టికరిపించి.. కార్గిల్‌లో తిరిగి మువ్వన్నెల జెండా ఎగురవేసింది. ఈ యుద్ధంలో 537 మంది జవాన్లు అమరులవ్వగా.. 1363 మంది క్షతగాత్రులయ్యారు. ప్రపంచ చరిత్రలో కార్గిల్ యుద్ధం ప్రత్యేకమైనది.ఇది పూర్తిగా పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధం.వేల అడుగుల ఎత్తులో పర్వత శ్రేణులలో  మన జవాన్ల మాదిరిగా యుద్ధం చేయడం అమెరికా,రష్యా లాంటి అగ్రరాజ్యాల సైనికులకు కూడా సాధ్యం కాదని స్పష్టమైంది.

   తర్వాతి కాలంలో పర్వత ప్రాంత యుద్ధం గురించి మన సైన్యం అమెరికా సైనికులకు శిక్షణ సైతం ఇచ్చారు.ఇదే సమయంలో పాక్ తన తప్పు తెలుసుకుని యుద్ధం నుంచి తప్పుకుని ఉండకపోతే..ఆ దేశం నామరూపాలు లేకుండా పోయేదని ఇటీవల కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి..

   ఒకానొక దశలో పాక్‌పై వైమానిక దాడితో పాటు అణుదాడికి ప్రధాని వాజ్‌పేయ్ ఒకానొక దశలో సిద్ధపడ్డారని అయితే చివరి నిమిషంలో దాయాది మనసు మార్చుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని కొందరు రక్షణరంగ నిపుణులు అంటూ ఉంటారు.ఏదేమైనా మన సైనిక పాటవానికి, యుద్ధ వ్యూహాలకు మచ్చు తునక కార్గిల్ యుద్ధం.ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని దురక్రామణ నుంచి కాపాడిన సైనికులదే ఈ విజయం... 
Exit mobile version