నెలాఖరులో హస్తిన పర్యటన
కీలక ప్రతిపక్ష నేతలతో భేటీ
భాజపాకు వ్యతిరేకంగా పావులు
విధాత,దిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినాయకురాలు మమతా బెనర్జీ ఈ నెలాఖరులో దిల్లీ పర్యటన చేయనుండటం జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మమత ఈనెల 25న దిల్లీకి బయల్దేరనున్నట్లు సంబంధిత వర్గాలు చెబు తున్నాయి. ఆమె 4 రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండగా.. అదే సమయంలో మమత దిల్లీ పర్యటన చేయనుండటం ప్రాధాన్యతను సంతరించుకోవడంతో పాటు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలూ మొదలయ్యాయి.
పర్యటనలో భాగంగా ఆమె అప్పటికి దిల్లీలో ఉన్న పలువురు కీలక ప్రతిపక్ష నేతలతో భేటీ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌ల అధినేతలు శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లతో ఆమె చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ సాధించిన విజయానికి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ప్రశంసలందుకుంటున్న మమత జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో భాజపాయేతర పార్టీల సహకారంతో అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.
ప్రధానంగా కొవిడ్ కట్టడిలో వైఫల్యం, ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ విజయం కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. భాజపాను సమష్టిగా ఎదుర్కొనే వ్యూహంపై ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. గత నెలలో శరద్ పవార్‌తోనూ ప్రశాంత్ కిశోర్ 3 సార్లు భేటీ అయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపాకు వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్‌ను రూపుదిద్దాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మమత దిల్లీ పర్యటన రాజకీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.