విధాత : పశు పక్ష్యాదులను మనుషులు ఎంత మచ్చిక చేసుకున్నప్పటికి మనుషుల మాదిరిగా మాట్లాడటం మాత్రం అసాధ్యమే. అయితే ఇందుకు చిలుకలను మినహాయింపుగా చెబుతుంటారు. అక్కడక్కడ మనుషుల సావాసం..తర్ఫీదుతో కొన్ని చిలుకలు ముద్దుముద్దుగా మాట్లాడే ఘటనలు అరుదుగా చూసి ఉంటారు. అందుకే చిలక పలకులు అనే మాట కూడా జనబాహుళ్యంలో వాడుతుంటారు. అయితే అనూహ్యంగా ఓ కాకి కూడా ఇప్పుడు మనిషి మాదిరగా మాట్లాడుతున్న ఘటన వైరల్ గా మారింది. కాకి కావ్ కావ్ అంటుందని మనకు తెలిసిందే..అయితే మహారాష్ట్రలో ఓ కాకి మనుషుల మాదిరిగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
మనుషులను పేరుతో పిలుస్తుంది..
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఓ మాట్లాడే కాకి మనుషుల్లాగే మాట్లాడగలదు. వారు మాట్లాడుకునే హిందీ భాషలో ‘పాపా’, ‘కాకా’, ‘దీదీ’ అని పిలవడంతోపాటు ‘క్యా కర్ రహే హో?’ ( ఏం చేస్తున్నారు? వంటి మాటలు మాట్లాడుతుంది. మనిషి లాగా దగ్గడం వంటి పనులను ఆ కాకి చేస్తోంది. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తోంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వయసున్న ఈ కాకి గత కొన్ని నెలలుగా మనుషులు చెప్పే పదాలు మాట్లాడటం ప్రారంభించింది. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తోంది. కుటుంబంలోని ఎవరినైనా పిలిస్తే, ఈ కాకి కూడా అదే పేరుతో పిలుస్తుంది. కొత్తవారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారిని ఈ కాకి ఏం పని అని అడుగుతుంది. మాట్లాడే కాకిని చూడటానికి సమీప గ్రామాల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు రావడం విశేషం.
గాయపడిన స్థితిలో
పాల్ఘర్‌లోని వాడా తహశీల్‌లోని గార్గావ్ గ్రామంలో నివసించే మాంగల్య ముక్నే కొంతకాలం క్రితం ఒక చెట్టు కింద గాయపడిన స్థితిలో పడి ఉన్న కాకిని చూసి ఇంటికి తీసుకొచ్చాడు. గాయాలతో ఉన్న ఆ కాకికి చికిత్స చేసి…తమ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నాడు. ముక్నే కుటుంబంలోని పిల్లలు కాకికి ప్రేమగా ఆహారం పెట్టడం ప్రారంభించారు. క్రమంగా కాకి వారితో కలిసిపోయి భుజాలపై కూర్చుని ఆడుకోవడం ప్రారంభించింది. మంగల్య ముక్నే కుమార్తె టైలరింగ్ చేస్తుంటే ఆమెతో పాటు కాలక్షేపం చేయడం వంటివి చేస్తోంది. ఇంట్లోని కుక్కలు, కోళ్లు కూడా ఆ కాకిని స్నేహితుడిగా భావిస్తున్నాయి.
కుటుంబంలో భాగమైన కాకి
మాట్లాడే కాకి ఇప్పుడు తమ కుటుంబంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ముక్నే కుటుంబ సభ్యులు తనుజా ముక్నే, మాంగల్య ముక్నే చెబుతున్నారు. తమతో మాట్లాడటమే కాకుండా ఇంటిని కూడా కాపాడుతుందని ముక్నే కుటుంబం చెబుతోంది. దానికి ఆహారం తినిపించి పెంచామని, ఇప్పుడు అది మరెక్కడికీ వెళ్లదని, ఎప్పుడూ తమతోనే ఉంటుందని వారు అంటున్నారు. రోజంతా అది చుట్టుపక్కల అడవులలోని ఇతర కాకులతో కలిసి ఎగురుతుందని..కానీ సాయంత్రం అది మా ఇంటికి తిరిగి వస్తుందని వెల్లడించారు. తాము దానికి ఏమీ నేర్పించలేదని, తమను చూసి అదే అన్నీ నేర్చుకుందని తెలిపారు. అయితే కాకి మాట్లాడుతున్న ఘటనపై బయాలజిస్టులు స్పందిస్తూ కొన్ని రకాల పక్షులు పదే పదే అవి వినే పదాలను తిరిగి పలకడం వంటివి చేస్తాయని, ఇతర రకాల శబ్ధాలను కూడా అనుకరిస్తాయని తెలిపారు.