KCR | బుద్ధిలో లోపాలు దిద్దుకోలేదు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. ఓటరు మనోగతం మౌనంగా ఈవీఎం పెట్టెల్లో కూర్చుంది. కేసీఆర్, జగన్ల భవితవ్యం జూన్ 4న తేలిపోనుంది. అయితే ఓడిపోతే జగన్కు పెద్దగా వచ్చిన ఇబ్బందేం లేదు. తనకు ఇంకా చాలా వయసు, సమయం ఉన్నాయి. ఈ రెండూ లేనిదల్లా అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్కే.

  • Publish Date - May 15, 2024 / 06:30 AM IST

(విధాత ప్రత్యేకం) వినదగునెవ్వరుచెప్పినా.. అనే పద్యం చాలాసార్లు కేసీఆర్​(KCR) నోటివెంట వినడం జరిగింది. కానీ, అసలు వినడమే తెలియనప్పుడు, అంతా నాకు తెలుసు అనుకున్నప్పుడే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. పరవాలేదు… ఓటమే విజయానికి తొలిమెట్టు అనుకున్నవారు, దాన్ని నమ్మి, ఓటమి  చెప్పిన పాఠాలను నేర్చుకుని, లోపాలను సరిదిద్దుకుని తిరిగి పోరాటానికి సిద్ధమవడమే యోధుడి లక్షణం. ఒకప్పుడు తెలంగాణ యోధుడిగా కీర్తి గడించిన కేసీఆర్​ అసెంబ్లీ ఎన్నికల ఓటమిని చాలా సౌకర్యవంతంగా ప్రజలకే అంటగట్టారు. తను ఎప్పటి సుబుద్ధినే, ప్రజలే మూర్ఖులు, అత్యాశాపరులు అనే వాదనకు త్రికరణశుద్ధిగా కట్టుబడిఉన్నారు. యోధుడి లక్షణానికి ఉద్దేశ్యపూర్వకంగా దూరమయ్యారు. కానీ ఆయన దూరమైంది వీరుడి గుణాలకు కాదు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆశయాలకు. నిజానికి ఇది టీఆరెస్​ బీఆరెస్​గా మారినప్పుడే జరిగింది. ప్రజలు కూడా మానసికంగా దూరం జరిగింది అప్పటినుండే. తెలంగాణకు సంబంధించి ఇక సాధించాల్సింది ఏమీ లేదన్న భావన నుండే బీఆరెస్​ పుట్టింది. అయితే అది భావన కాదు.. అహంభావన.

రెండు పక్షాల మధ్య యుద్ధం జరిగినప్పుడు మామూలుగా ఏదో ఒక పక్షం విజయం సాధిస్తుంది. విజయం సాధించినవారికి ఎటువంటి కారణాలూ అక్కర్లేదు. కానీ ఓడిపోయినవారికి కారణాలు కావాలి. ఎందువల్ల ఓడిపోయామనే అంతర్మథనం ఉండాలి. సాధారణంగా ఓటమికి రెండు కారణాలు. ఒకటి మనం బలహీనంగా ఉండటం. రెండోది అవతలివాడు మనకన్నా బలవంతుడవటం. మనం బలహీనపడడానికి కారణాలు..అప్రతిహత విజయాలు పెంచిన అహంభావమా, వ్యూహాలలో లోపాలా? దళపతుల సమన్వయలోపమా? ఆర్థిక, సైనిక వనరుల కొరతా?.. అసెంబ్లీ యుద్ధంలో బీఆర్​ఎస్​ ఓటమికి ఆఖరుది తప్ప అన్నీ కారణాలే. ఇక్కడో విచిత్రమైన కారణం కూడా ఉంది. మన అహంకారమే అవతలివాడి బలమవ్వడం. చరిత్రలో గొప్పగొప్ప రాజుల ఓటమికి పైవే కారణాలు. అయితే కొంతమంది గుణపాఠాలు నేర్చుకుని తిరిగి అధికారం చేపట్టగలిగారు. కానీ, కేసీఆర్​ బుద్ధిలో లోపాలు దిద్దుకోలేదు. అవి లోక్​సభ ఎన్నికల దాకా విస్తరించాయి. తదనుగుణంగానే ఫలితాలు రాబోతున్నాయి. దీనికి పెద్ద సెఫాలజిస్టులేం అవసరం లేదు. చరిత్రే చెబుతోంది. మనకు నచ్చే విషయాలే చెప్పి సంతోషపెట్టేవాడు విదూషకుడవుతాడు గానీ, విమర్శకుడు కాలేడు. అలాంటి విదూషకులే ఇప్పుడు ఆయన చుట్టూఉన్నారు. విమర్శకులను కేసీఆర్​ ఎప్పుడో విసిరేసారు.

ఈ లోక్​సభ ఎన్నికల విషయానికొస్తే, ఒక విచిత్రమైన సర్వే బయటికొచ్చింది. చేసింది కిరణ్​, సి–ప్యాక్​, పిఠాపురం అని తెలిసింది. ఆయన ఒపీనియన్​ పోల్​ ప్రకారం, 17 సీట్లలో బీఆరెస్​కు 15, కాంగ్రెస్​కు 1, మజ్లిస్​కు 1 ఇచ్చాడు. నిన్న ఎనికల అనంతరం ఇచ్చిన ఎగ్జిట్​ పోల్​ సర్వే(Exit Poll Survey)లో 25వేల సాంపిళ్లలో బీఆరెస్​కు 14617(58.47%), కాంగ్రెస్​కు 4115(16.46%), బీజేపీకి 6042(24.17%), ఇతరులకు 141(0.34%), నోటాకు (85(0.34%) పంచారు. ఈ లెక్కన బీఆరెఎస్​కు 12 సీట్లు వస్తాయట. ఇదీ ఆయన లెక్క. శాసనసభ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ప్రకారం బిఆర్​ఎస్​కు 41, కాంగ్రెస్​కు 65 వస్తాయని చెప్పాడట. ఫలితం అలాగే వచ్చింది కాబట్టి, ఇప్పుడు కూడా నాది ఖచ్చితమైన ఫలితమే, ఒక్క సీటు తగ్గినా నన్ను అడగండి అని వారి చాలెంజ్​. ఇది వాట్సప్​లో ఒక మిత్రుడికి వచ్చిన సర్వే సందేశం. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ 156 అసెంబ్లీ సీట్లు, 19 ఎంపీ సీట్లు గెలవబోతోందని కూడా సెలవిచ్చారు. ఈ 12నే బీఆరెస్​ అధినేతలు 12 నుంచి 14 అని అన్ని సభల్లో ఊదరగొట్టారు. వారికి అకస్మాత్తుగా సి‌‌–ప్యాక్​ (C–PAC)కిరణ్​ హీరో అయిపోయినట్లు తెలిసింది. ఇదిగో… ఇలాంటివారినే విదూషకులంటారు. వీరి మాటలను నమ్మే కేసీఆర్​ ఎన్​డీటీవీఇంటర్వ్యూ(NDTV Interview)లో, ప్రాంతీయపార్టీలే రాజ్యమేలబోతున్నాయని, మేం వారి( ఎన్​డీఏ, ఇండియా బ్లాక్​)కి మద్దతివ్వడం కాదు. వారే మాకు మద్దతివ్వాల్సివస్తుందని సంచలన ప్రకటన చేసారు.

ఆవు పొలంలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా..అన్నట్లు, కేటీఆర్​(KTR) కూడా తండ్రి తగ్గ తనయుడేనని అనిపించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన మాటలు చాలాసార్లు ఇబ్బంది కలిగించాయి. రాజధాని(Hyderabad)  ప్రచారాన్ని భుజానికెత్తుకున్న కేటీఆర్​, ఆంధ్రులను(Andhra Settlers) ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో తెలంగాణను అవమానించారు. ఆంధ్రులు విద్యావంతులు, మేధావులు కాబట్టే, అసెంబ్లీలో మమ్మల్ని గెలిపించారని ఆయన నిస్సిగ్గుగా ప్రకటించారు. నిజమే.. మీరు చేసిన సాయానికి వారామాత్రం కృతజ్ఞతగా ఉండకతప్పదు. ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్​, గచ్చిబౌలి, కూకట్​పల్లి, రాయదుర్గంలో ఉన్నరోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు హైదరాబాద్, సికింద్రాబాద్​లలో ఎక్కడున్నాయి? ఉన్న ఎల్​బీ నగర్​ కూడా వారి రాజ్యమే కదా. పాపం.. ఖర్మకాలి, రెండు రాష్ట్రాలలో ఒకేరోజు ఎన్నికలు జరగడం కేటీఆర్​ కొంపముంచింది. సెటిలర్లందరూ తుర్రుమంటూ ఆంధ్రాకు వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు ఎలాగూ ఓటేయడానికి బయటకే రారు. సరిపోయింది. ఉన్నంతలో హరీశ్​రావు(T. Harish Rao) ఒక్కరే స్థిరమైన రాజకీయ నాయకుడిలా ప్రవర్తించారు. ఆయన ప్రచారమంతా పాత మెదక్​ జిల్లా వరకే సాగినప్పటికీ చాలా హుందాగా నడిచింది.

సరిగ్గా ఇక్కడే ఒక దారుణం జరుగబోతోంది. బిఆరెస్​కు​ తగ్గిన ఓట్లన్నీ బీజేపీకి పడి, అది ఏ విధంగానైనా అధికారంలోకి వస్తే, ఇక మనం చూసుకోవడానికి భారతదేశం మిగలదు. ఇంకో విచిత్రమైన దేశంగా మారుతుంది. అక్కడ మోదీ(Narendra Modi)నే సర్వాధికారి. అయన స్వంత ఆటోక్రసీ(Autocracy)నే అమలవుతుంది. దీన్నే కొల్లేటరల్​ డ్యామేజీ(Collateral Damage) అంటారు. విచిత్రంగా చదువుకున్నవారు, మేధావులు కూడా ఈ మతమౌఢ్యంలో పడి కొట్టుకుపోవడం భరింపరానిదిగా ఉంది. ఎలక్షన్​ కమీషన్​ ఆఫ్​ ఇండియా(ECI)లో ఉన్న ముగ్గురూ తోలుబొమ్మలే. సిబిఐ(CBI), ఈడీ(ED)లు బీజేపీ పాదసేవలో తరిస్తున్నాయి. మరి ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని సొంత రాష్ట్రాలకు తరలిస్తే, మరి దక్షిణాది ప్రత్యేకదేశం కావాలని అడగటంలో తప్పేముంది? ఇటువంటి ఘర్షణలు ఇంకా ముందుముందు ఎన్ని జరుగనున్నాయో.

అయితే ఇక్కడింకొక సమస్య కూడా ఉంది. ఈమధ్య వెలువడిన సమాచారం ప్రకారం దేశంలో ముస్లిం జనాభా 43 శాతానికి పైగా(Muslim population raised) పెరిగితే, హిందువులు 8 శాతం(Hindu population decreased) తగ్గారు. ఇదిలాగే కొనసాగితే 2047 నాటికి ముస్లింలు మెజారిటీ అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలోని 8 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. ఇదంతా సజావుగా ఉంటే పరవాలేదు కానీ, మత మౌఢ్యం పెచ్చుమీరి తీవ్రవాదంగా మారుతున్న ఈ రోజుల్లో  భారతదేశం లౌకికదేశం(Secullar Country)గా చెప్పుకోవడానికి మాత్రమే మిగిలితే పెను ప్రమాదం తప్పకపోవచ్చు.

 

Latest News