Site icon vidhaatha

Revanth Reddy | రేవంత్‌రెడ్డిపై.. కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి? కార‌ణాలివే!

(విధాత ప్ర‌త్యేకం)

Revanth Reddy | ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయవ‌ర్గాల స‌మాచారం. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన రేవంత్‌రెడ్డి, ప్రజాపాల‌న అందిస్తామ‌ని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. అత్యంత వేగంగా ఆ ప్ర‌తిష్ఠ‌ను కోల్పోతున్నార‌ని అధిష్ఠాన‌ పెద్ద‌లు భావిస్తున్న‌ట్టు ఆ వ‌ర్గాలు తెలిపాయి. రైతులు, విద్యార్థులు, పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కేంద్రంగా త‌మ ఎజెండాను రూపొందించిన కాంగ్రెస్.. ఆ ఎజెండాను అమ‌లు చేయ‌డంలోనూ, ఆ ఇమేజ్‌ను కాపాడుకోవ‌డంలోనూ విఫ‌ల‌మ‌వుతున్న‌ట్టు అధిష్ఠానం పెద్ద‌లు అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు ఆ వ‌ర్గాలు భావిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు, చ‌ర్య‌లు.. చ‌తికిల‌బ‌డ్డ బీఆరెస్‌కు, అవ‌కాశంకోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఊపిరిపోస్తున్నాయ‌న్న ఆందోళ‌న అధిష్ఠానంలో వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్టు వ‌ర్గాలు తెలిపాయి.

కూల్చివేత‌లు.. పార్టీ వైఖ‌రి కాదే!

హైడ్రా కూల్చివేత‌లు, హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీ భూముల వేలం, మూసీ సుంద‌రీక‌ర‌ణ‌, ఫార్మా కంపెనీల‌కోసం, ఫ్యూచ‌ర్ సిటీకోసం భూముల సేక‌ర‌ణ వంటి చ‌ర్య‌లు కాంగ్రెస్ ఎజెండాకు విరుద్ధంగా బ‌ల‌ప్ర‌యోగంతో అమ‌లు చేస్తున్నార‌ని, ఇది పార్టీ ఓటు బ్యాంకును తీవ్రంగా దెబ్బ‌తీస్తున్న‌ద‌ని అధిష్ఠానం క‌ల‌వ‌రం చెందుతున్న‌ద‌ని ఆ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. సామాన్యుల‌కు అండ‌గా ఉండ‌టం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, విద్యార్థులు, యువ‌కుల‌తో పాటు రైతుల‌తో మిత్ర‌పూర్వ‌క వైఖ‌రి కాంగ్రెస్ ప్ర‌ధానంగా ప్ర‌చారం చేస్తూ వ‌చ్చిన విధానాలు. రేవంత్ రెడ్డి ఈ మౌలిక విధానాల‌ను దెబ్బ‌తీస్తున్నార‌ని,హెచ్‌సీయూ భూముల వేలం వ్య‌వ‌హారం పార్టీని బాగా బ‌ద్నాం చేసింద‌ని కొంత‌మంది రాష్ట్ర‌ కాంగ్రెస్ నాయ‌కులు, మేధావులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లార‌ని తెలిసింది.

హామీల అమ‌లులో విఫ‌లం.. పైగా కొత్త స‌మ‌స్య‌లు

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం విఫ‌లం కావ‌డంతోపాటు కొత్త స‌మ‌స్య‌లు కొనితెచ్చి కాంగ్రెస్ పునాదుల‌ను బాగా దెబ్బ‌తీస్తున్న‌ద‌ని ప‌లువురు అధిష్ఠానానికి నివేదించిన‌ట్టు కాంగ్రెస్ అనుకూల మేధావి, విశ్లేష‌కుడు ఒక‌రు చెప్పారు. “కేసీఆర్ ఇస్తున్న పెన్ష‌న్లు, రైతుబంధు, క‌ల్యాణ ల‌క్ష్మీల కంటే ఎక్కువ మొత్తాల‌ను ఇస్తామ‌ని హామీ ఇచ్చాము. రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పాము. అవిగాక కొత్త ప‌థ‌కాలు చాలా చెప్పాము. అవేవీ పూర్తిగా అమలు కాలేదు. ప‌ద‌హారు మాసాలు కావ‌స్తున్నా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయాము. ఆ అసంతృప్తి ప్ర‌జ‌ల్లో ప్ర‌బ‌లుతున్న‌ది. కాంగ్రెస్ ఇంత‌కాలం వ్య‌తిరేకిస్తున్న బుల్డోజ‌ర్ విధానాల‌ను రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇంకా చెడ్డ‌పేరు తెచ్చింది” ఆయ‌న తెలిపారు.

అవ‌న్నీ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీశాయి!

“హైడ్రా చ‌ర్య‌లు ప‌ట్ట‌ణ పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో, రియ‌ల్డ‌ర్ల‌లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తించాయి. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌, ఫ్యూచ‌ర్ సిటీ పేరిట‌ జ‌రుగుతున్న భూసేక‌ర‌ణ‌, మూసీ సుంద‌రీక‌ర‌ణ వంటి చ‌ర్య‌లు ప్ర‌జాపాల‌న ఇమేజ్‌ను బాగా దెబ్బ‌తీశాయి. హెచ్‌సీయూ భూముల వేలం వివాదం ఢిల్లీని బ‌లంగా తాకింది. విద్యార్థులు వీధిపోరాటాల‌కు దిగ‌డం రాహుల్‌గాంధీని బాగా క‌ల‌చివేసింది” అని ఆయ‌న వివ‌రించారు. అయితే కాంగ్రెస్ తొంద‌ర‌ప‌డ‌బోద‌ని, రేవంత్‌రెడ్డికి దిద్దుబాటుకు త‌గినంత స‌మ‌యం ఇస్తుంద‌ని కాంగ్రెస్ ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డిని ఇప్పుడు మ‌ళ్లీ పార్టీ ఎజెండాలోకి మ‌ళ్లించే చ‌ర్య‌లు అధిష్ఠానం ద‌గ్గ‌రుండి తీసుకుంటుంద‌ని ఆ వ‌ర్గాలు తెలిపాయి.

యాక్ష‌న్‌లోకి మీనాక్షి

కాంగ్రెస్ అధిష్ఠానం ప్ర‌తినిధి మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఆ దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించార‌ని, బాధిత వ‌ర్గాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి వారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కాంగ్రెస్‌లోని ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల క‌థ‌నం. కాంగ్రెస్ ఇచ్చిన కొన్ని హామీల‌న‌యినా పూర్తి సంతృప్త స్థాయిలో అమ‌లు చేయించేందుకు అధిష్ఠానం ఒత్తిడి చేస్తుంద‌ని ఆ వ‌ర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్ప‌టికీ పార్టీకి ప్ర‌ధాన చోద‌క‌శ‌క్తి రేవంత్‌రెడ్డేన‌ని, ఆయ‌న‌తోనే స‌త్ఫ‌లితాలు సాధించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని అధిష్ఠానం భావిస్తున్న‌ద‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డిని కాద‌ని మ‌రో నాయ‌కుడిని ఎంచుకునే స్థితిలో ఇప్పుడు పార్టీ లేద‌ని కూడా అధిష్ఠానం అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు ఆ వ‌ర్గాల క‌థ‌నం.

Exit mobile version