- హైకమాండ్ వద్ద రేవంత్‌కు తగ్గిన పలుకుబడి!
- ఢిల్లీలో దొరకని అపాయింట్‌మెంట్లు
- సీఎంలను కట్టడిచేసే అలవాటు మానుకోని కాంగ్రెస్ అధిష్ఠానం!
- వలసలకూ ఫిర్యాదులతోనే బ్రేక్!
- రేవంత్‌రెడ్డి మనసులో ఏముంది?
- రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు
Congress Internal Fight | ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో సొంత బలంతో అధికారంలో ఉంటే.. అందులో పెద్ద రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ మాత్రమే. ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ గణనీయంగా పడిపోతున్నది. అధికార బీజేపీ వ్యూహాలకు తగినట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం తగిన ప్రతివ్యూహాలు రచించడం లేదనే చర్చలు ఉన్నాయి. ఇండియా కూటమిగా బీజేపీయేతర ప్రధాన పక్షాలు జట్టు కట్టినా.. తన ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న రీతిలో వ్యవహరించడంతోనే ఇండియా కూటమి ఆశించిన ఫలితాలను సాధించలేక పోయిందనే వాదనలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఉన్న రాష్ట్రాలను సైతం తన చర్యలతోనే ఇబ్బందుల్లోకి నెడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అది అంతిమంగా దీర్ఘకాలంలో బీజేపీకి మేలు చేస్తుందన్న అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
సమన్వయం ఏది?
దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయంలో కీలక భూమిక పోషించిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించాల్సింది పోయి.. ఫిర్యాదులకు పెద్ద పీట వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దాదాపు అష్టదిగ్బంధం ఎదుర్కొంటున్నారని అంటున్నారు. గత ఆరు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. ఢిల్లీ పార్టీ పెద్దల వద్ద ఆయన పరపతి పెరగాల్సింది పోయి.. దిగజారుతూ వస్తున్నదని పేర్కొంటున్నారు. అధికారాలకు కత్తెర వేసి.. ముఖ్యమంత్రి సీటుకు పరిమితం చేశారని ఆయన సన్నిహిత వర్గాలు వాపోతున్నాయి. ముఖ్యమంత్రులు తమ తాబేదార్లు, తాము చెప్పినట్లు వినాలనే విధంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. సీఎంగా అధికారాలు ఇవ్వకుండా, అదే సమయంలో పార్టీ వదిలి పోకుండా హైకమాండ్ వ్యవహరిస్తున్నదని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
సీఎంలను మార్చే సంప్రదాయం
సాధారణంగా కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రులను తరచూ మార్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉన్నది. పార్టీ అధిష్ఠానం ముందు తలవంచుకుని ఉంటేనే.. కుర్చీ పదిలంగా ఉంటుందని, లేని పక్షంలో అవసరమైతే ఏడాదికో ముఖ్యమంత్రి మారిన సందర్భాలు ఉమ్మడి ఏపీలో కూడా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిని కట్టడి చేయగలిగామనే సంబురమేమోగానీ.. దాని ఫలితంగా రాష్ట్రంలో పార్టీ పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయనేది గుర్తించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పేరుకుపోయిన మూస విధానాల నుంచి బయటపడి.. జనం బాటలో నడవాలనే సోయి కొరవడుతున్నదని పేర్కొంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వైఖరిలో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదనేందుకు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర పాలన ఉదాహరణగా నిలుస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణలో అమలు చేసేందుకు ఢిల్లీలోని కొందరు ముఖ్య నాయకులు అడ్డుపుల్ల వేశారని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంలో రేవంత్‌రెడ్డిని ముందుకు కదల్లేని స్థితిని కల్పించారని అంటున్నారు. కానీ.. ఆయన మొత్తానికి ఎస్సీ వర్గీకరణ చేశారు. పార్టీ ముఖ్యనాయకుల్లో కొందరి వైఖరి వల్లే ఈ తీవ్ర జాప్యం జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల భూ సేకరణ గొడవల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన పాత్ర ఉన్నట్లు నిరూపితం అయినా, ఆ స్థాయిలో తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. లగచర్ల భూ సేకరణలో రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినా ఆ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తిప్పికొట్టలేకపోయారని ఆ సమయంలో కార్యకర్తలు చర్చించుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫార్ములా ఈ కార్ రేసు విచారణ విషయాల్లో కేటీఆర్.. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నా.. కీలక మంత్రులు ఎవరూ నోరు మెదకపోవడంపైనా తీవ్ర స్థాయిలోనే చర్చలు జరుగుతున్నాయి. అధిష్ఠానం వద్ద రేవంత్‌కు పలుకుబడి తగ్గిపోయిందనే ఉద్దేశంతోనే మంత్రులు, కీలక నేతలు సీఎంపై ఘాటు విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.1 లక్ష కోట్ల ప్రజాధానం నేలపాలైందని, అక్రమాలపై విచారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యుడీషీయల్ కమిషన్ వేయడం సరైన నిర్ణయం అనే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు డాక్యుమెంట్లు బయటపెట్టి మద్ధతు పలకడం ఒక ఊరటగా చెప్పొచ్చు.
ఎమ్మెల్యేల వలసలకూ బ్రేక్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. భారీ చేరికలపై తొలుత అధిష్ఠానం సమ్మతించిందని లీకులు వచ్చినా.. ఆ తర్వాత బ్రేకులు పడ్డాయి. బీఆర్ఎస్ ఖాళీ అయితే రేవంత్ బలం పెరుగుతుందని, అధిష్ఠానం మాట వినరని కొందరు ఢిల్లీకి ఫిర్యాదులు చేయడమే ఈ బ్రేకులకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్న ప్రకారం జరిగితే కనీసం పదిహేను నుంచి పాతిక మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేవారని, బీఆరెస్ ఆ మేరకు బలహీనపడేదని అంటున్నారు. అధిష్ఠానం నిర్లక్ష్యం కారణంగానే ఇది సాధ్యం కాలేదని జోరుగా చర్చ సాగుతున్నది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. మంత్రివర్గ విస్తరణలో సైతం ఆయన గుంభనంగా కనిపించారు. అదే రోజు జరిగిన సభలో తన బీజేపీ, టీడీపీ నేపథ్యాలను గుర్తు చేసుకోవడం గమనార్హం. ఇది యథాలాపంగా చెప్పిన మాటలా? లేక తన భావి కార్యాచరణకు సంకేతాలా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Congress | కట్టు తెగుతున్న.. కాంగ్రెస్ క్రమశిక్షణ! గర్జిస్తున్న అసమ్మతి గళాలు
Infighting in government | రేవంత్ రెడ్డికి మంత్రుల మద్దతు ఏది? బీఆరెస్ విమర్శలకు కౌంటర్ ఏది?
CM Revanth Reddy | నా స్కూలు బీజేపీ.. కాలేజీ టీడీపీ.. రాహుల్ దగ్గర కొలువు! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు