- అన్నిపార్టీల నేతలతో నాకు సత్సంబంధాలు
- దత్తన్న అజాత శత్రువు.. పేదల మనిషి..
- అందరినీ సమానంగా చూసే నాయకుడు
- అందుకే పుస్తకావిష్కరణ సభకు వచ్చాను
- హైదరాబాద్ జనం దత్తన్న, పీజేఆర్‌ను మర్చిపోరు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- ‘ప్రజలకథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ
CM Revanth Reddy | హరియాణా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో బీజేపీలో పనిచేసిన సందర్భాన్ని ప్రస్తావించారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దత్తాత్రేయ అజాత శత్రువని ప్రశంసించారు. ఆయనకు పేద, ధనిక అనే తేడాలు ఉండవని పేర్కొన్నారు. నిరుపేదల ఇంట్లో జరిగే కార్యక్రమాలకు సైతం వెళ్తుంటారని గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రజలకు పీజేఆర్, దత్తాత్రేయ ఎన్నో సేవలు చేశారని.. వారిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు. పేదల మనిషి అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి తాను ఈ సభకు వచ్చానని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో బండారు దత్తాత్రేయ ఆత్మకథ.. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని దాచి పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాన స్కూల్ విద్య బీజేపీలో, కాలేజీ విద్య టీడీపీలో పూర్తయ్యిందని, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చెప్పానని తెలిపారు. దత్తాత్రేయ ఆయన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎదురుదెబ్బలు తిన్నారని పేర్కొన్నారు. ‘గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్ వరకు ఎదిగారని ప్రశంసించారు.
ఆ కుటుంబాలతో మంచి అనుబంధం
తనకు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుకోనని చెప్పారు. తాను మంత్రివర్గ విస్తరణతో ఎంతో బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. దత్తాత్రేయ నుంచి యువ రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలన్నారు. రాజకీయాలంటే శత్రుత్వం పెంచుకోవడం.. కక్ష సాధించుకోవడం కాదని.. అందరు కలిసి ఉండి ప్రజలకు మేలు చేయడమేనన్నారు. దత్తన్న నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంతో పేరుందని చెప్పారు. బీజేపీలో జాతీయ స్థాయిలో వాజపేయి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో.. తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో దత్తన్న అంత మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.