- ఫేక్ ఫొటోలపై గచ్చిబౌలి స్టేషన్లో కేసు
- చర్యలు తప్పవన్న మంత్రి దుద్దిళ్ల
- గతంలో కరీంనగర్ కలెక్టర్‌గా స్మిత
- అప్పట్లో ఆమెకు స్పెషల్ ప్రొటెక్షన్
- నాటి మంత్రి దుద్దిళ్ల ముందే హడావిడి
- ఆయన నొచ్చుకున్నట్టు అప్పట్లో వార్తలు
- ఇప్పుడు ఆ ఎఫెక్ట్ స్మితపై ఉంటుందా?
Smita Sabharwal | (విధాత ప్రత్యేకం): గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగి.. ఈ ప్రభుత్వంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్న స్మితా సబర్మాల్.. ట్రబుల్‌లో చిక్కుకున్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఆమెపై కేసు పెట్టడం ఒకెత్తియతే.. ఆమెపై కఠినంగానే చర్యలు ఉంటాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పడం మరో ఎత్తు. ఈ భూముల విషయంలో ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారం పక్షం కారాలూ మిరియాలూ నూరుతున్న విషయం తెలిసిందే. వీటిపై కఠినంగా ప్రభుత్వం ఉందనేందుకు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు నిదర్శనంగా కనిపిస్తున్నది. నాంపల్లి గాంధీ భవన్ లో బుధవారం మంత్రి శ్రీధర్ బాబు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రతినిధి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చిన అంశంపై మంత్రి అభిప్రాయాన్ని కోరారు. ఆ అధికారి పేరు ప్రస్తావించకుండా స్పందించిన మంత్రి ‘ఆమె చేసి పోస్టుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం’ అని స్పష్టం చేశారు. నకిలీ వీడియోలు, పోస్టులు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టు లు సోషల్ మీడియాలో పెట్టి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు మొదట వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేశారని, తర్వాత తీసేశారని గుర్తు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా బహిరంగ సభలో కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అలా మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి కుట్రలు చేస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వంపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి గద్దె దింపుతామని బీఆర్ఎస్ బెదిరిస్తోందన్నారు. తమకు ప్రజలపై నమ్మకం ఉందని, బీఆర్ఎస్ పెద్దలు కూలకొడితే తమ ప్రభుత్వం కూలిపోదని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశం తోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పై ఈడీ చార్జీ షీట్ ఫైల్ చేసిందన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఒక్క రూపాయి కూడా చేతులు మారలేదన్నారు. గాంధీ కుటుంబం ఆగర్భ శ్రీమంతులని, వాళ్లకు మనీ లాండరింగ్ చేయాల్సిన ఖర్మ పట్టలేదన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు తీసుకువచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ భూముల విషయంలో సుప్రీంకోర్టు అడిగే ప్రశ్నలకు మా ప్రభుత్వం సమాధానం చెపుతుందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములని సుప్రీంకోర్టు చెప్పిందని, న్యాయస్థానాల ఆదేశాలు పాటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయని, అది సాధ్యం కాదని స్పష్టంచేశారు. ‘ఏ బుక్కులో రాస్తే ఏముంది? వాళ్ళు మళ్లీ అధికారంలోకి వస్తే కదా రివెంజ్ తీసుకోవడానికి!’ అని ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలను పోలీసులు, అధికారులు వేధిస్తున్నారని, వారి పేర్లను పింక్ బుక్ లో రాసుకుంటున్నామని ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి పై విధంగా బదులిచ్చారు.
స్మిత హడావుడిపై అప్పట్లో నొచ్చుకున్న శ్రీధర్‌బాబు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా నుంచి డీ శ్రీధర్ బాబు మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి.. శ్రీధర్ బాబు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 2010 నుంచి 2014 వరకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను కొందరు ప్రస్తావిస్తున్నారు. 2011 ఏప్రిల్ నెలలో స్మితా సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె జిల్లా కలెక్టరుగా ఉన్న సమయంలో అప్పటి ఎస్పీ ఆమెకు ప్రత్యేక భద్రతా సిబ్బందిని కేటాయించారు. ఆమె భద్రతా సిబ్బంది హడావుడితో శ్రీధర్ బాబు కొంత నొచ్చుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దుద్దిళ్ల.. జిల్లా ఎస్పీతో మాట్లాడి.. ‘మంత్రి నేనా, ఆమెనా?’ అని అడిగి మందలించారనే ప్రచారం జిల్లాలో జరిగింది. సిబ్బందిని తగ్గించడంతో, ఆమె మళ్లీ సిఫారసు చేయించుకుని మళ్లీ సిబ్బందిని పెంచుకున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు స్మిత కార్యదర్శిగా పనిచేస్తూ మంత్రులకు మించి ప్రొటోకాల్ అనుభవించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో హెలికాఫ్టర్ వినియోగించడం, జిల్లాలకు వెళ్లిన సందర్భంలో మంత్రులే పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలకడం మామూలైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్మిత.. పలు సందర్భాల్లో కీలక ట్వీట్స్ చేశారు. గుజరాత్ గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను రేప్ చేసి, జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రేపిస్టులను విడుదల చేయడంపై తనకు నమ్మకం కలగడం లేదంటూ వరుసగా ట్వీట్స్ చేశారు. ఒక మహిళగా, సివిల్ సర్వెంట్ గా తాను ఈ వార్త చూసి ఆందోళన చెందానని అందులో పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్ అయినా తనకు మాట్లాడే హక్కు ఉందంటూ ఆమె పేర్కొనడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేందుకు మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు. 120 దేశాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. ఈ అందాల పోటీలను నిర్వహించే టూరిజం శాఖకు ఆమె ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తుంటం, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.