హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విధాత):
Gajularamaram Land Grabbing | కొన్ని దశాబ్ధాలుగా ఈ భూమి ఖరీజ్ ఖాతాలో ఉంది. ప్రభుత్వానికి చెందిన భూములు కావడంతో రాజకీయ నాయకులకు దీనిపై కన్నుపడింది. తమ అనుచరులు, రెవెన్యూ అధికారులతో ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. అదే సర్వే నంబర్ తో బై నంబర్లు వేసి కొంత భూమిని నాయకులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇది గత బీఆరెస్ పాలనలో జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 నవంబర్‌లో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం గమనార్హం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే పాస్ పుస్తకాలు జారీ అయ్యాయంటున్నారు. ఆ వెంటనే నాలా కింద దరఖాస్తు చేయగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేశారంటే పలుకుబడి ఏ స్థాయిలో నడుస్తుందో ఊహించుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. దీంతో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు పరాధీనం అయ్యాయి. ఇందులో వందల కోట్లు చేతులు మారినట్టు చర్చించుకుంటున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఈ లోపే కొందరు హైకోర్టులో కేసులు వేయడం, స్థానికుల నుంచి వందలాది ఫిర్యాదులు అందడంతో హుటాహుటిన హైడ్రా రంగంలోకి దిగి నిరుపేదలపై ప్రతాపం చూపించింది. కానీ స్థానిక ఎమ్మెల్యే ఆధీనంలోనివిగా చెబుతున్న భూముల్లో వెలిసిన నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయకపోవడం గమనార్హం. కేవలం ప్రహరీ గోడలను కూల్చివేశారని స్థానికులు అంటున్నారు. పైగా వేల కోట్ల భూములను కబ్జా నుంచి కాపాడామని హైడ్రా ప్రచారం చేసుకుంటున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 307లో వంద ఏళ్ల నుంచి 441.32 ఎకరాలు ఖరీజ్ ఖాతా భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం ధర రూ.75వేలు పలుకుతున్నదని సమాచారం. అత్యంత ఖరీదు అయిన ప్రాంతంగా పేరొందిన ప్రగతి నగర్‌ను ఆనుకుని ఈ భూములు ఉన్నాయి. ఇనామ్ చట్టం రద్ధు అమలులోకి వచ్చిన తరువాత 1955 జూలై నుంచి ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు అని రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఈ సర్వే నంబర్‌లో బై వన్ పేరుతో సబ్ డివిజన్ చేయగా, ఈ భూమిలో పేదల నివాసాలు వచ్చాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టోన్ క్రషర్లకు లీజుకు ఇచ్చిన భూముల పై స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రజా పద్ధుల కమిటీ చైర్మన్ అరికెపూడి గాంధీ కన్ను పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సర్వే నంబర్ 307లోని 441 ఎకరాల్లో 122 ఎకరాలు ప్రైవేటు భూములు అని ఆక్రమణదారులు వాదిస్తున్నారు. ఆ 122 ఎకరాల్లో నిర్మాణాలు వచ్చాయి. స్థానిక రాజకీయ నాయకులు ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారుల అండదండలతో భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించి బాగానే సొమ్ము చేసుకున్నారు. కానీ కొనుగోలు చేసిన వాళ్లు హైడ్రా బుల్డోజర్లను చూసి లబోదిబోమంటున్నారు. ఈ భూములను విక్రయించిన వాళ్లలో ఎమ్మెల్యే అనుచరులే ఎక్కువగా ఉన్నారని, వారంతా ముఠాగా ఏర్పడి ఈ దందా చేశారని అక్కడి స్థానికులు బహిరంగంగా ఆరోపించడం గమనార్హం. ఇవి పోగా మిగిలిన 318 ఎకరాల భూమిని 22ఏ కింద ప్రకటించి నిషేధిత జాబితాలో చేర్చారు. ఇందులో కూడా అక్రమ నిర్మాణాలు వచ్చాయి.
ప్రైవేటుగా పేర్కొంటున్న 122 ఎకరాల నుంచే 12 ఎకరాలు కొనుగోలు చేశామని ఎమ్మెల్యే గాంధీ కుటుంబ సభ్యులు అధికారుల ముందు వాదిస్తున్నారు. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుని, అనుచరులతో మరో 30 ఎకరాలు కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం 42 ఎకరాలు పాత తేదీలతో దస్తావేజులు తయారు చేయించి ఆ తరువాత వాటిపై నోటరీ చేయించుకున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్ 18 నుంచి 2023 జూన్ 16 వరకు కుటుంబ సభ్యుల పేరిట కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో 12 ఎకరాలు తన 8 మంది కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. అప్పటి తహశీల్దార్ సంజీవ రావు, సర్వే నంబర్ 307/ఏ తో అరికెపూడి శ్యామలదేవికి రెండు ఎకరాలు, 307/ఏ/2 సర్వే నంబర్‌తో అరికెపూడి నందితకి రెండు ఎకరాలు, 307/ఏ/4 అరికెపూడి ప్రవీణ్ కుమార్ పేరిట రెండు ఎకరాలు, 307/ఏ/5 అరికెపూడి స్వర్ణకుమారి పేరిట 12 గుంటలు, 307/ఏ/1 అరికెపూడి కోటేశ్వర రావుకు 1.20 ఎకరాలు, 307/ఏ/3 అరికెపూడి రాజేంద్రప్రసాద్ కు 8 గుంటలు, 307/ఏ/6 దండమూడి సామ్రాజ్యం 1 ఎకరంతో పాటు 307/ఏ/6 సర్వే నంబర్‌లో ఒక ఎకరం చొప్పున రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తరువాత ఈ 12 ఎకరాల యజమానుల వివరాలు ధరణి, భూ భారతి వెబ్ పోర్టల్‌లో నమోదు అయ్యాయి. అయితే భూమి మొత్తం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు లీజుకు ఇచ్చిన భూమి అని స్థానికులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే గాంధీ భూములుగా చెబుతున్న వాటి చుట్టూ బ్లూ షీట్లు ఏర్పాటు చేశారు. దాని లోపల చిన్న గుడి కట్టారు, సెక్యురిటీ వాళ్లు ఉండేందుకు గదులు నిర్మించారు. అనధికారిక లే అవుట్ వేయడమే కాకుండా రోడ్లు వేసి ఇరువైపులా చెట్లు కూడా పెంచారు. ఈ లే అవుట్ లో కరెంట్ స్థంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి. ఇప్పటికీ టిప్పర్ల ద్వారా మట్టిని తవ్వేసి అక్రమంగా విక్రయిస్తున్నా గనుల శాఖ గాని స్థానిక రవాణా అధికారులు, రెవెన్యూ అధికారులు ఆపే ప్రయత్నం చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేఅవుట్‌తోపాటు 33 అంతస్తుల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో దరఖాస్తు కూడా ఇచ్చారు. ఈ విషయం తెలిసి కొందరు హైకోర్టుకు వెళ్లడంతో జీహెచ్ఎంసీ అనుమతులు ఆగిపోయాయి.
సర్వే నంబర్ 307లో 441 ఎకరాలు సీలింగ్ భూములున్నాయని బీఆర్ఎస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 12 ఎకరాలు జాహెదా బేగం, షేక్ ఇమామ్ లు, ఇషాన్ అమీన్ నుంచి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు తయారు చేయించారని హైకోర్టుకు తెలిపారు. వారి భూమిని కొన్నట్లు చూపుతూ మోసానికి తెరతీశారని, ఈ ముగ్గురి పేరిట గుంట భూమి కూడా అక్కడ లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు జడ్జీ.. స్థానిక తహశీల్దార్ కు ఫిర్యాదు చేయాలని, చర్యలు తీసుకోనట్లయితే మళ్లీ పిటిషన్ వేయాలని ఆదేశించి, కేసు కొట్టివేశారు.
గాజుల రామారంలో ఆదివారం 260 నిర్మాణాలు కూల్చివేశామని, త్వరలో మరో 640 నిర్మాణాలను కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ 640 నిర్మాణాల్లో ప్రజలు నివాసం ఉంటున్నారని కూల్చివేతలు చేపట్టలేదన్నారు. తాము కూల్చిన వాటిల్లో పేదలు లేరని, రౌడీ షీటర్లు, గుండాలు నివాసం ఉంటున్నారన్నారు. ఈ కబ్జాల్లో స్థానిక ఎమ్మెల్యే గాంధీ కుటుంబం ఉందా? అనే ప్రశ్నకు ఆయన చెప్పలేమన్నారు. ఎవరెవరు ఎంత భూమి కబ్జా చేశారు? వారి వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరనే దానిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రూ.100 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
Land Grabbers Rampalli Village | ఎన్ఆర్ఐ మహిళకు చెందిన భూమి.. దర్జాగా కబ్జా! మంత్రి అండతోనే?