విధాత, హైదరాబాద్ :
పాతబస్తీకి మణిహరంగా చారిత్రక చెరువు బమృక్‌నుద్దౌలా నిలుస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆక్రమణలతో ఆనవాళ్లను కోల్పోయిన ఈ చెరువు హైడ్రా పునరుద్ధరణతో పూర్వ వైభవాన్ని సంతరించుకుందన్నారు. తుదిమెరుగులు దిద్దుకుంటూ మరో 15 రోజుల్లో ప్రారంభానికి సిద్ధమౌతున్న బమృక్‌నుద్దౌలా చెరువును హైడ్రా కమిషనర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చుట్టూ బండ్ తో పాటు.. ఇన్‌లెట్లు, ఔట్ లెట్ల నిర్మాణాన్ని తనిఖీ చేశారు. చెరువుకు మూడు వైపులా నిర్మిస్తున్న ప్రవేశ మార్గాలను పరిశీలించారు.
స్థానికంగా ఉన్నవారు సులభంగా చెరువు చెంతకు చేరేలా చూడాలని సూచించారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉందని.. దానిని పునరావృతం చేసేలా.. చుట్టూ ఔషధగుణాలున్న మొక్కలతో పాటు.. చల్లటి నీడనిచ్చే చెట్లను నాటాలన్నారు. అన్ని వయసుల వారూ సులభంగా నడిచేలా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని, చెరువు చుట్టూ లైటింగ్ ఉండేలా చూడాలన్నారు. పిల్లల కోసం ప్లే ఏరియాలు, వృద్ధుల కోసం సీటింగ్ జోన్లు, ఓపెన్ జిమ్‌లు, పచ్చికబైళ్లు, పార్కులు వంటి సౌకర్యాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇస్లామిక్ సంప్రదాయాలు ఉట్టిపడేలా..
ఇక్కడ ప్రజలు వచ్చి కూర్చునేందుకు వీలుగా నిర్మిస్తున్న గుమ్మటాల(గజబోలు)తో పాటు.. ప్రవేశ గేట్లు ఇస్లామిక్ సంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి చేయాలని రంగనాథ్ సూచించారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంపదగా భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ క్రమంలోనే చెరువు ఆక్రమణలను గత ఏడాది ఆగస్టు నెలలో తొలగించినట్టు చెప్పారు. 4.12 ఎకరాలుగా మిగిలిపోయిన ఈ చెరువు ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో 18 ఎకరాల మేర విస్తరించడమైదన్నారు.
స్థానికుల హర్షం..
1770లో హైదరాబాదు మూడవ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్‌ఉద్‌దౌలా నిర్మించిన బమృక్నుద్దౌలా చెరువు. ఈ చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి ఔషధ గుణాలతో వచ్చిన ఊట నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అంతే కాదు.. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని.. అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లే వారని కొంతమంది పేర్కొంటున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబర పడుతున్నారు. పాతబస్తీలో ఇలాంటి అభివృద్ధి చాలా అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని హైడ్రా ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసిందని కొనియాడారు. చారిత్రక చెరువు పునరుద్ధరణతో పాతబస్తీకి కొత్త వెలుగులు అందిస్తున్నారని కొనియాడారు.
Also Read –Sanchar Saathi App | మొబైల్‌లో సంచార్ సాథీ డిఫాల్ట్ యాప్.. యూజర్ల అన్ని కమ్యూనికేషన్లు ప్రభుత్వం చేతిలో?
Tamil Nadu palm tree initiative|దేశంలో సగం తాటిచెట్లు…తమిళనాడులోనే!
Inspiring | సంకల్పానికి ప్రతీక.. డాక్టర్ నుంచి మేజర్‌గా ఎదిగిన తొలి మహిళ కథ తెలుసా?
