Telangana Corruption | యథా రాజా తథా అధికారి! వాటాలు, శాతాలు కోస్తున్న అమాత్యులు! అధికారులు లక్షల్లోనైనా మింగరా?

తాజాగా విద్యుత్‌ ఏడీఈ ఇరుగు అంబేద్కర్‌ నివాసాల్లో ఏసీబీ తనిఖీల సందర్భంగా 150 కోట్ల అక్రమార్జన వెలుగు చూడటం రాష్ట్ర ప్రజలను నిర్ఘాంత పరుస్తున్నది. ప్రభుత్వంలోనే మంత్రులు కమీషన్లు తీసుకుంటుంటే.. అధికారులు కూడా అదే బాట పట్టారన్న చర్చలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

  • Publish Date - September 18, 2025 / 04:00 AM IST
Hyderabad ACB Raids

హైదరాబాద్, సెప్టెంబర్‌ 18 (విధాత):

Telangana Corruption | తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏ స్థాయిలో సాగుతున్నదో ఒక్కో ఉదంతం చాటి చెబుతున్నది. తాజాగా విద్యుత్‌ ఏడీఈ అంబేద్కర్‌ వద్ద 150 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు తేల్చారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం లేకపోవడంతోనే అవినీతి యథేచ్ఛగా సాగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఈ మధ్య కొందరు ప్రభుత్వ అధికారులు అక్రమంగా కూడబెట్టిన స్థిర, చరాస్తుల జాబితాను చూస్తే మతిపోతున్నది. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) చేస్తున్న తనిఖీల్లో వందల కోట్ల నగదు, డిపాజిట్లు బయటపడుతున్నాయి. అధికారులు బరితెగించి, ఎవరినీ ఖాతర్ చేయకుండా చేస్తున్న అవినీతిపై ఈ మధ్య ఎక్కువగా చర్చించుకుంటన్నారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో బుధవారం ఉదయం వాకింగ్‌లో నలుగురు కలిసిన చోటల్లా ఇదే విషయమై చర్చించుకోవడం కన్పించింది. వారి మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందంటే… ‘తెలంగాణలో అధికారులు ఇట్టా తయారయ్యారేందబ్బా? కోట్లకు కోట్లేనా?’ అని సీనియర్ సిటిజన్ ఒకరు లేవనెత్తారు. ‘యథా రాజా తథా అధికారి’ అని మరొకరు వెంటనే స్పందించారు. ‘మంత్రులే వాటాలు, శాతాలు చొప్పున కోస్తుంటే… అధికారులు మాత్రం లక్షల్లో, కోట్లలో కోయరా?’ అని అన్నారు. ‘మరిదేంది? దీనిని ప్రజా పాలన అంటరా?’ అని ఇంకొకరు అన్నారు. వీరందరిదీ విన్న ఒకాయన… ‘ఇద్దరో ముగ్గురో తింటే నియంతృత్వం అవుతుంది. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు ఇలా వేలాది మంది తింటే ప్రజాపాలన కాదా?’ అని ముక్తాయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గుంపులుగా చేరిన చోట ప్రభుత్వ అధికారుల అంతులేని అవినీతి, వెలుగులోకి వస్తున్న కోట్ల కొద్దీ నగదు కట్టలపై మాట్లాడుకుంటున్నారు.

ఏసీబీ దూకుడుతో వందల కోట్లు వెలుగులోకి

అవినీతిపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో తెలంగాణ ఏసీబీ గడచిన ఏడాదిగా దూకుడు పెంచింది. ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారంటే ఏ స్థాయిలో అవినీతి సాగుతున్నదో అర్థమవుతున్నది. రెవెన్యూ, పోలీసు, మునిసిపల్, ఇరిగేషన్, రవాణా, విద్యుత్ శాఖల్లో అవినీతి మేత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల వ్యవధిలో 179 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇరవై మంది వరకు మహిళా ఉద్యోగులు ఉండటం విశేషం. గతేడాది హెచ్ఎండీఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివ బాల‌కృష్ణ‌ నివాసం, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించగా 214 ఎకరాల భూమి, 29 ఫ్లాట్లు, విలాసవంతమైన వస్తువులతో సహా రూ.250 కోట్లు ఆస్తులున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ నికేష్ కుమార్ వద్ద రూ.300 కోట్ల విలువైన ఆస్తులు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఇతనికి మొయినాబాద్ లో రూ.80 కోట్ల విలువ చేసే ఫామ్ హౌసులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా అరెస్టు అయిన నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ లు సీ మురళీధర్ రావు, భూక్యా హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్ ల వద్దే సుమారు రూ.1,000 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్థారణకు వచ్చారు. హరిరామ్ భార్య అనిత అదే శాఖలో సీఈ (అడ్మిన్) గా పనిచేశారు. నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్ లో రూ.5 కోట్లు నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌లో మునిసిపల్ సూపరింటెండెంట్ ఇంట్లో రూ.2.93 కోట్ల నగదు పట్టుబడింది. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగించేందుకు ఒక వ్యక్తి నుంచి రూ.8 లక్షలు తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తీసుకున్నట్లు మదన్ వాంగ్మూలం ఇవ్వడంతో కార్యాలయంతో పాటు ఇంట్లో సోదాలు చేశారు. తాజాగా నార్సింగ్ మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మణి హారిక ఎల్ఆర్ఎస్ మంజూరు కోసం రూ.10 లక్షలు మాట్లాడుకుని, అడ్వాన్స్ గా రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడింది. గత రెండు సంవత్సరాలుగా ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లినప్పుడు నోట్ల కట్టలను లెక్కించేందుకు తమ వెంట యంత్రాలు తీసుకువెళ్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇదీ ఏడీఈ అంబేద్కర్ విశ్వరూపం

తల్లితండ్రులు తమ కుమారుడు భవిష్యత్తులో పెరిగి పెద్ద అయ్యి ప్రయోజకుడు కావాలని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును ఆయనకు పెట్టారు. రాజ్యాంగ నిర్మాత పేరుకు, ఆ పేరు పెట్టిన తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేలా తయారయ్యాడా అధికారి. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆదాయానికి మించి ఆస్తులతో దొరికిపోయారు. ఆయనే ఇరుగు అంబేద్కర్. హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఈయన స్వస్థలం. తెలంగాణ ఏసీబీ అధికారులు పక్కా సమాచారం, ఆధారాలతో మంగళవారం తెల్లవారు జామునే హైదరాబాద్‌తోపాటు మిర్యాలగూడ, మెదక్ జిల్లాల్లో ఆయన బంధువులు, బినామీల ఇళ్లల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించగా కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు వెలుగు చూశాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో బినామీ సతీష్ ఇంట్లో రూ.2.18 కోట్లు, ఆయన బ్యాంకులో రూ.77.5 కోట్లు నిల్వ లభించింది. షేర్లలో రూ.36 లక్షలు పెట్టుబడులు పెట్టారు. ఈయన అస్తుల విలువ బహరంగ మార్కెట్ లో రూ.150 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ ఒక అంచనాకు వచ్చింది.

ఖమ్మం నుంచి ఉద్యోగపర్వం

1998 లో ఏపీఎస్ఈబీ లో చేరి తొలిసారి ఖమ్మం జిల్లాలో ఉద్యోగ విధులు ప్రారంభించారు. సంస్కరణలో భాగంగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం లు) రావడంతో అప్పటి వరకు చేసిన సర్వీసు వదిలేసి, హైదరాబాద్ డిస్కం లో చేరారు. ఏడీఈ గా పదోన్నతి పొందిన తరువాత వసూళ్లు మొదలుపెట్టారని సంస్థలోని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఫోకల్ ప్రాంతాలు అయిన పటాన్ చెరు, కేపీహెచ్.బీ, గచ్చిబౌలిలో ఏడీఈ గా చేశారు. ఫోకల్ లో మూడేళ్లకు మించి చేయకూడదు. కానీ ఇబ్రహీంబాగ్ లో చాలా కాలంగా పనిచేస్తుండటం గమనార్హ. డిస్కంల పరిధిలో మూడేళ్లు ఫోకల్ (ఆదాయం వచ్చేవి), ఆ తరువాత మరో మూడేళ్లు నాన్ ఫోకల్ (ఆదాయం లేనివి)లో ఇంజినీర్లను వేస్తుంటారు. వట్టినాగులపల్లిలో జై భారత్ వెంచర్ కు కోర్టు కేసు పరిష్కారం అయ్యే వరకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వవద్దని అసలు యజమానులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా 2022 లో పలువురికి కనెక్షన్లు ఇచ్చారు. దీని పై ప్రజావాణిలో ఫిర్యాదులు రాగా ఉన్నతాధికారులు విచారించి హెచ్చరించినా ఏమత్రం చెవికెక్కించుకోలేదంటారు. బినామీలతో పనులు చేయించి కోట్లు వేనకేసుకున్నారని డిపార్ట్ మెంట్ లో చర్చ జరుగుతున్నది. తన మనుషులను కాదని వేరే వారికి పని అప్పచెబితే అంబేద్కర్ ముప్పుతిప్పలు పెడతాడనే వాదన ఉంది.

ప్రభుత్వ పెద్ద సిఫారసుతో 3 రోజుల్లో అదే పోస్టుకు

అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏడీఈ ఇరుగు అంబేద్కర్ ను ఇబ్రహీంబాగ్ నుంచి తెలంగాణ సచివాలయం పక్కన ఉన్న టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ప్రభుత్వ పెద్ద ఒత్తిడితో మూడు రోజుల్లోనే తిరిగి ఇబ్రహీంబాగ్ కు వచ్చారు. మళ్లీ ఎలా వెనక్కి వచ్చారంటూ అప్పట్లో విద్యుత్ ఉద్యోగులు చర్చించుకున్నారు. ప్రభుత్వ పెద్దతో పాటు ఆయన భార్య ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, అందుకే మళ్లీ అదే పోస్టుకు దర్జాగా వచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ పెద్దకు శాతాలు తీసుకుని పనులు చేస్తారనే పేరు సచివాలయంలో మార్మోగుతున్నది. ఈయన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేసిన తరువాత టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి చర్యలు తీసుకోలేదని సమాచారం. ఆ తరువాత ధైర్యం చేసి తీసుకున్నా ప్రభుత్వ పెద్ద జోక్యం చేసుకోవడంతో తన ఉత్తర్వులు నిలిపివేశారని ఉద్యోగులు అంటున్నారు.