ఆగస్టులో ఉద్యోగ నోటిఫికేషన్లు! 6000 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు,త్వరలో ప్రిలిమ్స్‌ తుది కీ

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నదా? కొత్త నోటిఫికేషన్లకు ఆగస్టులో ముహూర్తం ఖరారు కానున్నదా? అంటే ఔననే సమాధానం వస్తున్నది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తయి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది

  • Publish Date - July 1, 2024 / 03:59 AM IST

(విధాత ప్రత్యేకం)
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నదా? కొత్త నోటిఫికేషన్లకు ఆగస్టులో ముహూర్తం ఖరారు కానున్నదా? అంటే ఔననే సమాధానం వస్తున్నది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తయి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పూర్తయ్యింది. ప్రిలిమ్స్‌కు ప్రాథమిక కీ కూడా విడుదల చేసిన సర్వీస్‌ కమిషన్‌, తుది కీతో పాటు వారం లోగా మెయిన్స్‌కు అర్హత సాధించిన ఫలితాలు వెల్లడించనున్నట్టు సమాచారం. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే ప్రకటించింది. గ్రూప్‌ 2 పరీక్షను ఆగస్టులో నిర్వహించనున్నది. ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దైన డీఈవో లాంటి పరీక్షలు జరుగుతున్నాయి. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ పరీక్షలు పూర్తయ్యాయి. గురుకులాలకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయి పోస్టింగ్‌ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఆ ప్రక్రియను జూన్‌ నెలాఖరున లేదా జులై మొదటి వారం వరకు పూర్తి చేయనున్నది. ఇలా ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీలోప్రక్రియలో వివిధ దశల్లో ఆగిన వాటిపై ఫోకస్‌ పెట్టింది. వాటిని ముందుగా పూర్తి చేసి తుది ఫలితాలు ప్రకటించాక కొత్త నోటిఫికేషన్ల విడుదలతో పాటు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని చూస్తున్నదని సమాచారం.

జాబ్‌ కాలెండర్‌ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి

జాబ్‌ క్యాలెండర్‌తో పాటు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ల తరఫున బీఆర్‌ఎస్‌ కీలక నేతలైన కేటీఆర్‌, హరీశ్‌రావు కొన్ని రోజులుగా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. బీఆర్‌ఎస్‌ రుణమాఫీ, రైతు భరోసా అంశాలతో పాటు ఉద్యోగాల అంశాన్ని ముందు పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నది. రుణమాఫీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు సీఎం ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసాకు సంబంధించి అసెంబ్లీ చర్చించిన తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇక ముఖ్యమైన మరో అంశం ఉద్యోగాల భర్తీ. దీనిపై కూడా నిరుద్యోగులకు హామీ ఇచ్చిన మేరకు జాబ్‌ క్యాలెండర్‌, నోటిఫికేషన్లను విడుదల చేసి బీఆర్‌ఎస్‌ చెక్‌ పెట్టాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తున్నదని సమాచారం.

త్వరలోనే జాబ్‌ కాలెండర్‌పై స్పష్టత?

ఈ నేపథ్యంలోనే వానకాలం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాటికి జాబ్‌ క్యాలెండర్‌తో పాటు కొత్త నోటిఫికేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నదని తెలుస్తున్నది. అలాగే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి సీఎం ఇటీవలే సమీక్ష నిర్వహించారు. ప్రతీ దీనికి సంబంధించి ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. ప్రభుత్వం ఒకేచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో 20 ఎకరాల చొప్పున స్థలాన్ని సేకరించింది. ఈ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌తో పాటు గురుకులాలలో కొత్తగా 4000 పోస్టుల వరకు గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే మొన్న నియామపత్రాలు అందుకున్న అభ్యర్థుల్లో ఒకటికి మించి ఉద్యోగాలు సంపాదించారు. అలా బ్యాక్‌లాగ్‌ మిగిలే పోస్టులు 2000పైగానే ఉంటాయని సమాచారం. వీటన్నింటికి కలిపి 6000 పోస్టులతో ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నది.

Latest News