Palakurthy Water War | విధాత ప్రత్యేక ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అగ్గిరాజుకున్న పాలకుర్తి నియోజకవర్గంలో మరోసారి రాజకీయ మంటలు రగిలాయి. నిత్యం రెండు పార్టీల మధ్య ఉప్పూ, నిప్పుగా రాజకీయం సాగుతున్నది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు, తాజా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త పీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి మరింత విషమించింది. తాజాగా దేవాదుల నీటితో రాజకీయ నిప్పును రగిలించే కార్యక్రమాన్ని ఇరువర్గాలు చేపట్టాయి. దేవాదుల నుంచి నీటి విడుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల నాయకుల మధ్య రాజకీయ రగడ ప్రారంభమైంది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎర్రబెల్లి మధ్య దేవాదుల నీటి పంచాయితీ రగులుతున్నది. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. అధికారులతో చర్చించి నీరిచ్చేందుకు ఎమ్మెల్యే యత్నిస్తుండగా, కాంగ్రెస్ వైఫల్యంగా పేర్కొంటూ బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి పాదయాత్ర చేపట్టారు. ఎర్రబెల్లిది దిగజారుడుతనమని ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రెండు పక్షాల నాయకులు రైతులకు నీరందించాలని కోరడం కొసమెరుపు.
నిన్న అధికారులతో ఎమ్మెల్యే చర్చ
పాలకుర్తి నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా దేవాదుల నీటిని అందించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలోకి నీళ్ళొచ్చే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు. ఇంకా నీటి విడుదల ప్రారంభం కాకముందే ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే యశస్విని అదేశాల మేరకు అధికారులు కార్యంగంలోకి దిగారో లేదో.. ఈ సమస్యపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి యాత్ర చేస్తూ రైతులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేవాదుల నీటిని పాలకుర్తి నియోజకవర్గానికి తరలించడం జాప్యమైందంటున్నారు. ఈ అంశం పై ముందుగానే స్పందించి ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఈ లోపే బీఆర్ఎస్ రంగప్రవేశం చేసి రైతులను రెచ్చగొట్టడమంటే ఎర్రబెల్లిది ఫక్తు రాజకీయమేనని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నీళ్ళొస్తే తమ క్రెడిట్‌గా చెప్పుకొనేందుకు, నీళ్ళు విడుదల కాకపోతే కాంగ్రెస్ వైఫల్యంగా చిత్రీకరించేందుకు రాజకీయ వ్యూహంతో కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.
ఎర్రబెల్లి పాదయాత్ర
పాలకుర్తి నియోజకవర్గంలో దేవాదుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రబెల్లి శుక్రవారం పాలకుర్తి మండలం మాదాపురం దంతాలతండా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ నీటి విడుదలలో, రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని, లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి హెచ్చరించారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ళు
గత ఎన్నికల నాటి నుంచి నేటి వరకు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తమ పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కోల్పోయిన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత, పార్టీలోని అసమ్మతి, పనుల్లో వైఫల్యాలను తమకు అనుకూలంగా వినియోగించుకునేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతున్నది. నియోజకవర్గంలో అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే యశశ్విని ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో నెలకొనే అసంతృప్తిని సొమ్ముచేసుకునేందుకు బీఆర్ఎస్ గోతికాడి నక్కలాకాచుక్కొని కూచుందని విమర్శిస్తున్నారు. మరో వైపు అత్తా కోడళ్ళు అందరినీ కలుపుకొని పోవడంలో నిర్లక్ష్యం ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని బీఆర్ఎస్ వినియోగించుకుంటోంది. ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షపార్టీగా ప్రజాపక్షం నిలుస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు సమర్ధించుకుంటున్నారు. అందులో భాగంగానే రైతుల సమస్యలపై పాదయాత్ర చేపట్టినట్టు వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మాటలతో పాలకుర్తిలో రాజకీయాలు నిత్యం నిప్పుల కుంపటిపై నడకగా సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
AK-203 | 800 మీటర్ల రేంజ్ – నిమిషానికి 700 బుల్లెట్లు : భారత్ కా ‘షేర్’
ఏపీ, తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
Eagle Bird| పులి పిల్లను ఎగరేసుకపోబోయి..పులినోట చిక్కిన గద్ద
Diabetic Patients | బీ అలర్ట్.. షుగర్ పేషెంట్లు బంగాళాదుంప తినొచ్చా..?