50 ఏళ్లలో కమ్యూనిస్టు ప్రభుత్వాల్లేని తొలి సందర్భం

2026 కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఓటమి.. వామపక్ష చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వాస్తవానికి దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక రాష్ట్రంలో మొట్టమొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఏర్పడింది నాటి కేరళ.. నేటి కేరళంలోనే. యాదృచ్ఛికం ఏమిటంటే.. ఇప్పుడు అదే కేరళను వామపక్షాలు కోల్పోవడం. 1977 తర్వాత దేశ రాజకీయ చిత్రపటంలో కమ్యూనిస్టు పాలిత రాష్ట్రం లేని మొదటి సందర్భం ఇదే.

మే 4, 2026న విడుదలైన కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. యూడీఎఫ్‌ ఘన విజయాన్ని సూచిస్తున్నాయి. మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని కాంగ్రెస్‌ మిత్రపక్షాలు దాటేసినట్టు వార్తలు వస్తున్నాయి. పైన చూస్తే ఒక ప్రభుత్వం పోయి, మరో ప్రభుత్వం అధికారంలోకి రావడంగానే కనిపిస్తుంది. కానీ.. దీనిలో ఒక కఠిన వాస్తవం కూడా దాగి ఉన్నది. పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ నిష్క్రమణ.. 1977 తర్వాత దేశంలో కమ్యూనిస్టు లేదా వామపక్ష ప్రభుత్వం లేని రాజకీయ చిత్రపటాన్ని మిగిల్చి వెళుతున్నది.

వాస్తవానికి కమ్యూనిస్టులు దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. 1964లో సీపీఐ నుంచి సీపీఐ(ఎం) విడిపోయిన తర్వాత కూడా ఎన్నికల రాజకీయాలకు మించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రత్యామ్నాయ ఆలోచనావేదికగా ఒక బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. తర్వాతి కాలంలో సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్ష పార్టీల ప్రభావం, ప్రాభవం తగ్గిపోయినా.. ఇప్పటికీ కార్మిక హక్కుల పరిరక్షణకు గొంతై నిలుస్తున్నాయి.

వాస్తవానికి పరిపాలనలో కమ్యూనిస్టుల పనితనం అప్పటికే బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో వెల్లడైంది. ఒక సమయంలో దేశానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం సీపీఎంకు లభించింది. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీకి మెజార్టీకి దక్కలేదు. ఆ సమయంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌.. ప్రధాన మంత్రి పదవికి బెంగాల్‌ ముఖ్యమంత్రి, సీపీఎం ప్రముఖ నాయకుడు జ్యోతిబసు పేరు ప్రతిపాదించింది. అయితే.. బహుళ పార్టీ వ్యవస్థలో మార్క్సిస్టు ప్రణాళికలు అమలు చేయలేమంటూ నాటి పొలిట్‌బ్యూరో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే.. ఒక సందర్భంలో దీనిని చారిత్రక తప్పిదంగా జ్యోతిబసు అభివర్ణించారు. అంతకు ముందు వీకే సింగ్‌ ప్రభుత్వ ఏర్పాటులో ఒక్కో ఎంపీని లెక్కపెట్టి మరీ అప్పటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ కీలక పాత్ర పోషించారు.

2004 తర్వాత కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతూ వచ్చింది. 2004 ఎన్నికల్లో సీపీఎంకు 43 సీట్లు ఉన్నాయి. సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు మరో పదహారు స్థానాలను కలిగి ఉన్నాయి. అమెరికాతో పౌర అణు ఇంధన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించాయి. అప్పటి నుంచి క్రమక్రమంగా వామపక్షాల బలం తగ్గుతూ వస్తున్నది.

మరోసారి వామపక్షాలు పాలించిన కేరళ, పశ్చిమబెంగాల్‌, త్రిపుర విషయానికి వస్తే.. కేరళ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామికంగా కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పర్చిన రాష్ట్రం. ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ముఖ్యమంత్రిగా 1957లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కొలువుదీరింది. అంటే.. సరిగ్గా స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లకు. అయితే.. అక్కడ ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతూ వచ్చింది. ఆ ట్రెండ్‌ను 2021 ఎన్నికల్లో విజయన్‌ ప్రభుత్వం బ్రేక్‌ చేసి, మరోసారి ఎన్నికైంది. నిజానికి కేరళలో అదొక రికార్డు.

పశ్చిమబెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం 1976 నుంచి 2011 వరకూ.. ఏకబిగిన 34 ఏళ్లు పరిపాలించింది. ఇందులో జ్యోతిబసు 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే.. ప్రపంచంలోనే ప్రజాస్వామికంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం అనే రికార్డును బెంగాల్‌ నెలకొల్పింది.

త్రిపుర కమ్యూనిస్టులకు కూడా ఘనమైన చరిత్రే ఉంది. 1993 నుంచి 2018 వరకూ వరుసగా 25 ఏళ్లపాటు లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీహార్‌, తమిళనాడు, కశ్మీర్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో వామపక్షాలు కొన్ని సీట్లు గెలుస్తూ వచ్చాయి.

భవిష్యత్తేంటి?

గతమెంతో ఘన కీర్తి కలిగి ఉన్న వామపక్షాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. 1977 తర్వాత మొదటిసారిగా దేశంలో ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం అంటూ లేకుండా పోయింది. ఇక్కడ మరో విశ్వాసం.. కేరళ సంప్రదాయాన్ని అనుసరించి మరుసటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే చాన్స్‌ ఉంది. కానీ బెంగాల్‌లో 2011లో దెబ్బ పడిన తర్వాత మళ్లీ అక్కడ వామపక్షం కోలుకోలేకపో యింది. త్రిపురలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. స్థానికంగా అనేక రాష్ట్రాల్లో, కార్మిక సంఘాల్లో, ప్రజాసంఘాల్లో, మేధోవర్గంలో ఎంతో కొంత ప్రభావం చూపగలిగే స్థితిలో వామపక్షాలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం.

బూర్జువా పార్టీలు, వ్యక్తి స్థాపించిన పార్టీలు ఘన విజయాలు సాధిస్తున్న క్రమంలో అదే స్థాయిలో వామపక్షాలు ఎందుకు నిలబడలేకపోతున్నాయన్న ప్రశ్న ప్రగతిశీల శక్తుల్లో ఎప్పటి నుంచో ఉన్నది. ప్రజలకు కమ్యూనిస్టులు మంచోళ్లే. కానీ.. ఓటు వేయడానికి మాత్రం అక్కరకు రానివాళ్లుగా తయారయ్యరు. వాస్తవానికి ఇప్పటి రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయనేది జగమెరిగిన సత్యం. నోటు పంచితే కానీ ఓటు పడని పరిస్థితులు చుట్టుముట్టేసి ఉన్నాయి. కులమతాలు ఓటింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. పోల్‌మేనేజ్‌మెంట్‌ చేసుకోవడానికి పెద్ద సైన్యమే అవసరం అవుతోంది. దాని పోషణ అనేది ఒక పెద్ద బాధ్యతగా మారుతున్నది. ఎన్నికల ఖర్చులు, పార్టీ నిర్వహణ ఖర్చులకు కేవలం సాధారణ ప్రజల విరాళాలపైనే కమ్యూనిస్టులు ఆధారపడతారు. బడా కార్పొరేట్‌ కంపెనీలు పంపిన విరాళాలను తిరస్కరించిన ఘనత కమ్యూనిస్టులది. కమ్యూనిస్టులను పక్కన పెడితే.. ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు విశేషాధికారాలను వ్యతిరేకిస్తూ కఠోర నిరాహార దీక్ష చేసి, మణిపూర్‌ ఉక్కు మహిళగా దేశంలోనే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇరోమ్‌ చాను.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు వచ్చిన ఓట్లు కేవలం 90. ఆమే కాదు.. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎన్నికల్లో నిలబడినా.. గెలుస్తారనే నమ్మకంలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయనడం అతిశయోక్తి కాదేమో. ఇటువంటి విషమ రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు ఉన్నాయి. బూర్జువా పార్టీలకు కార్పొరేట్‌ ఫండింగ్‌.. అదికూడా అధికారికంగా సాగుతున్నది. ఈ సమయంలో అటువంటి పార్టీలను ఢీకొనడం వామపక్షాలకు అసాధ్యంగా మారిపోతున్నది. ఈ పరిస్థితులు వామపక్షాలకు అనేక పరిమితులు విధిస్తున్నాయి. ఉద్యమాలు పెద్ద ఎత్తున సాగిన ప్రాంతాల్లో ప్రజా మద్దతుతోనే ఇప్పటి వరకూ వామపక్షాలు విజయాలు సాధిస్తూ వచ్చాయి. కేరళం కూడా అలాంటిదే. అయితే.. ఇప్పుడో బ్రేక్‌. బహుశా మరో ఐదేళ్ల తర్వాత కేరళంలో మళ్లీ ఎర్రజెండా ఎగురుతుందేమో!

Latest News