Vijay | దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
తొలి ఫలితాల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూరు నియోజకవర్గంలో ఆయన తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉండగా, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ కూడా కొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. డీఎంకే ఆధిక్యంతో ఆ పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు ప్రారంభమయ్యాయి.
విషాదం..
అయితే ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య కృష్ణగిరిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కి వీరాభిమాని అయిన కే. మహేంద్రన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్నికల్లో విజయ్ ఓడిపోతాడన్న వదంతులు వినిపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటన ఓట్ల లెక్కింపు ప్రారంభానికి కొద్దిసేపటి ముందే జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న మహేంద్రన్‌ను గుర్తించిన స్థానికులు వెంటనే అతన్ని కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
విజయ్ ఓడిపోతాడన్న భయంతో..
ఈ ఘటనపై కృష్ణగిరి టౌన్ పోలీస్ అధికారులు స్పందిస్తూ, విజయ్ ఓడిపోతాడన్న భావనతోనే అతను ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఎన్నికల ఉత్కంఠ మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారికంగా ఫలితాలు వచ్చే వరకు శాంతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
