ప్రచారంలో ప్రధాని ఫ్రస్టేషన్?.. విపక్షాలపై తీవ్ర ఆరోపణలు

రెండు పర్యాయాలు దేశానికి ప్రధానిగా, దశాబ్దకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

  • Publish Date - May 20, 2024 / 09:31 AM IST

రాజకీయమా? అసహనమా?
అధికారం కోసం వ్యూహమా?
ప్రధాని తీరుపై విపక్షాల ఆగ్రహం
ఈ సారి మోదీ సర్కారు పతనం

విధాత ప్రత్యేక ప్రతినిధి: రెండు పర్యాయాలు దేశానికి ప్రధానిగా, దశాబ్దకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తన హోదా, స్థాయి విస్మరించి ఎన్నికల ప్రచారంలో మాట జారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడవ సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఏ స్థాయి విమర్శలకైన సిద్ధపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచే మోదీ వ్యూహాత్మకంగా విపక్షాలను తూలనాడుతున్నారని కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ముందుగా ఏదో నాలిక తడుబడుతున్నట్లు భావించగా రానురాను ప్రధాని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆరోపణ, విమర్శ చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారనే మండిపడుతున్నారు. స్థానికంగా విపక్షాలను చులకన చేస్తూ ఒక్క బీజేపీ, తమ పాలన మాత్రమే దేశ ప్రజలకు శరణ్యమనే స్థాయిలో తీవ్ర విమర్శలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ప్రణాళిక బద్ధంగా ప్రారంభించిన ప్రచారంగా భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పరుష పదజాలాన్ని, ఆరోపణల తీవ్రత పెంచుతూ బీజేపీ మాత్రమే శ్రీరామ రక్ష అనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. దీనికి తగిన స్థాయిలో హోంమంత్రి అమిత్ షా సైతం జతగూడినట్లు భావిస్తున్నారు.

ఆత్మరక్షణా? అసహనమా?

ప్రధాని, హోం మంత్రి విపక్షాలపై రాష్ట్రానికో తరహాలో చేస్తున్న విమర్శలు ఆత్మరక్షణతో కూడినవా? లేక దేశంలో బీజేపీకి నెలకొన్న ప్రతికూల పరిస్థితి నుంచి ఏర్పడిన అసహనమా? అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ప్రజా సమస్యలు, పదేండ్లు అధికారంలో ఉండి తామేమి చేశామో మాటమాత్రంగా మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయడం బలహీనతగా చెబుతున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం సాగిస్తూ రాజకీయ చర్చ, దేశ సమస్యలు, తమ పదేండ్ల పాలనపై ప్రజల్లో చర్చ సాగకుండా విద్వేషపూరిత, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన అంశాలు లేవనెత్తుతున్నారనే చర్చసాగుతోంది. ఇందులో ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్, ఇతర కూటమి భాగస్వామ్యపక్షాలను టార్గెట్ చేస్తున్నారు.

మావోయిస్టుల మెనిఫెస్టో

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోను ఉద్దేశించి ఇదంతా మావోయిస్టు అనుకూలంగా, అర్బన్ నక్సలైట్ల ప్రణాళికను తలపిస్తుందని మోదీ, అమిత్ షా విమర్శించారు. బీజేపీ ప్రకటించిన మెనిఫెస్టో అంశాలు ప్రచారంలో చెప్పకుండా ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో పై విరుచుకపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై మాట్లాడుతూ రాహుల్‌ వాడే భాష మావోయిస్టుల భాషలా ఉందిని విమర్శించారు. కాంగ్రెస్‌కు, జేఎంఎం లకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదని, పరిరిశ్రమలు, వ్యాపారవేత్తలను రాహూల్ వ్యతిరేకిస్తున్నారంటూ జార్ఖండ్‌ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని విమర్శించారు.

కాంగ్రెస్, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే వారు, పారిశ్రామికవేత్తలు 50 సార్లు ఆలోచిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్‌కు, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)లకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదని ప్రతిచోటా అబద్ధాలు మాట్లాడటమే తెలుసునని విమర్శించారు. ప్రజల సంపదను ఎక్సరే తీసి దోచుకోవడమే వారి లక్ష్యమని మోడీ ఆరోపించారు. రాజకీయ విమర్శల స్థానంలో దూషణలకు దిగుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.

ప్రచారం ప్రారంభంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ స్ర్తీ మెడలోని పుస్తెలను కూడా లాక్కొని ముస్లీంలకు పంచుతారని ఆరోపించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. హిందువుల ఆస్తులు ముస్లీంలకు కట్టబెడుతారంటూ చేసిన ఆరోపణలపై తెలంగాణ సీఎం తీవ్రంగా ప్రతిస్పందించారు. చట్టాన్ని కాదని ఎవరి ఆస్తైనా మరొకరికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు లాక్కోవాలని ఇండియా కూటమి భావిస్తున్నదని ఆరోపించారు. ముస్లీంలకు వెనుకబడిన తరగతుల కింద ఇస్తున్న రిజర్వేషన్లను చూపి విమర్శలు చేస్తున్నారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం వీపీ సింగ్ బీసీల రిజర్వేషన్లు పెంచితే అడ్డుకున్నది బీజేపీ కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

400 సీట్లూ… నాలుగు దశల్లో 270 సీట్లు

మూడవ దశ ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ సారి తమకు 400 స్థానాలొస్తాయంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో ఎన్నడూలేని విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ ప్రచారం కొనసాగించారు. 400 స్థానాలొస్తాయా? రాదా? అనేది పక్కన పెడితే బీజేపీ స్థానంలో మోదీ, మోదీ గ్యారంటీ, 400 స్థానాలే ప్రచారంగా చేపట్టారు. ప్రచార సరళిపై బీజేపీ సమిష్టి నాయకత్వాన్ని ఆశించే నాయకులు సైతం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ స్థానంలో వ్యక్తిని ప్రమోట్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ప్రస్తుతం నాలుగు విడుతల పోలింగ్‌ మాత్రమే జరిగింది. ఇందులో బీజేపీ 270 సీట్ల మైలురాయి దాటేసిందని, 400 దాటడానికి పరుగులు తీస్తున్నదని శుక్రవారం ఒడిషా ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రచారంలో సైతం 150 స్థానాలకు చేరుకున్నామని ప్రకటించారు. నాలుగు దశల్లో 102+89+93+95 కలిపి మొత్తం 379 స్థానాలకు ఇప్పటివరకు పోలింగ్‌ పూర్తయ్యింది. వీటిలోనే బీజేపీకి 270 సీట్లు దాటుతాయని చెప్పడం విడ్డూరంగా ఉన్నది.

ప్రధాని రెచ్చగొట్టే విమర్శలు?

అధికార బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నందున మోదీ తప్పుడు విమర్శలు చేస్తున్నారంటున్నారు. ప్రధాని మోడీ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీపార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డొజర్లు పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్‌లెకి వెళ్లాల్సి వస్తుందని హిందూ ఓటర్లలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మరికొన్ని నెలల్లో భారత్‌లో విలీనమౌతుందని ప్రకటించడం గమనార్హం. 500 సంవత్సరాల రాముని గుడి నిర్మాణం తామే చేపట్టామంటూ ఈ గుడి ప్రారంభానికి ఇండికూటమి నేతలు దూరంగా ఉన్నారంటూ విమర్శించడం గమనార్హం.

బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను టార్గెట్ చేసి వారిపై తీవ్ర ఆరోపణలు, అవినీతి పార్టీలు, వ్యక్తులంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. కేజ్రీవాల్, ఉద్ధవ్‌, పవార్‌, రేవంత్, మమత లను ప్రధాని టార్గెట్‌ చేసి విమర్శించారు. ప్రధాని తీరుపై ఇప్పటికే పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని, రామాలయం కూల్చివేత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇదిలా ఉండడగా 400సీట్ల ప్రచారంతో బీజేపీ మైండ్ గేమ్‌ ఆదుతోందని సీపీఐ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి మోదీ ప్రభుత్వ పతనం ఖాయమంటూ జోస్యం చెప్పారు.

Latest News