రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం!

సార్వత్రిక ఎన్నికల సమరంలో మొదటి దఫా పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారశైలి మారిపోయింది. రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయం నడుస్తున్నది

  • Publish Date - April 27, 2024 / 04:43 PM IST

కులగణనపై పట్టుదలతో ఉన్న రాహుల్‌
మ్యానిఫెస్టోలో రిజర్వేషన్ల పెంపు అంశం
మత అజెండాకు ప్రజల్లో తిరస్కారం?
రెండు విడుతల్లోనూ బీజేపీ ఫ్లాప్‌ షో!
రిజర్వేషన్ల వైపు మళ్లుతున్న బీజేపీ!

(విధాత ప్రత్యేకం)

సార్వత్రిక ఎన్నికల సమరంలో మొదటి దఫా పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారశైలి మారిపోయింది. రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయం నడుస్తున్నది. దీనికి కారణం కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన ‘సామాజిక-ఆర్థిక సర్వే’. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర నుంచి ప్రస్తుత ఎన్నికల ప్రచారం వరకు కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట జరగబోయే ప్రక్రియ కులగణనే అని కుండబద్దలు కొడుతున్నారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరింత కోటా దక్కేలా వారి రిజర్వేషన్లపై ఇప్పుడున్న 50 శాతం పరిమితిని పెంచుతామని కాంగ్రెస్‌లో మ్యానిఫెస్టోలో పెట్టిన సంగతి తెలిసిందే.

ప్రజల్లోనూ ఆలోచన!

కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమిలోని కీలక నేతలు కొన్ని అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ.. గతంలో మోదీ తనను గెలిపిస్తే విదేశాల్లో నల్లధనం తెచ్చి ప్రజల బ్యాంకు ఖాతాల్లో తలా 15 లక్షలు వేస్తానని చెప్పారని పేర్కొంటున్నారు. పదేళ్లు గడిచినా ఆ పనిచేకుండా పెద్దనోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల పేరు నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు సంపన్నవర్గాలకు సాధనంగా మారిందని ఆరోపిస్తున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ నల్ల రైతు చట్టాలను తెచ్చారని, దీనికి వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు చేసిన పోరాటం, వారి బలాన్ని గుర్తించిన తర్వాత వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ తన అనుయాయులకు 16 లక్షల కోట్లు ధారాదత్తం చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ పైసలతో 25 సార్లు రైతుల రుణమాఫీ చేసే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. బీజేపీ హయాంలో గత పదేళ్లలో 90 శాతం జనాభాకు అన్యాయం జరుగుతుండటాన్ని తట్టుకోలేక కులగణన చేయాలనుకుంటున్నట్టు, తద్వారా వాళ్లందరికీ న్యాయం చేయడమే దీని లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ హామీ ఇస్తున్నారు. బీజేపీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రస్తావిస్తున్న అంశాలను ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. అందుకే బీజేపీ ఎన్నికల సమయంలో కచ్చితంగా ప్రవచించే మతం, రామమందిరం, చైనా, పాకిస్తాన్‌ వంటి భావోద్వేగ అంశాలను గత ఎన్నికల సమయంలో మాదిరిగా సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఓబీసీల కష్టాలు తెలుసంటున్న మోదీ

దీంతో కలవరానికి గురైన కషాయ పార్టీ నేతలు తాము నమ్ముకున్న అంశాల ఓట్లు రాల్చవని ఇప్పుడు మాట మారుస్తున్నారని, రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదికి తెస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రధాని మోదీ రాజస్థాన్‌ సభలో చేసిన వ్యాఖ్యలనే బీహార్‌ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావించారు. ‘ఓబీసీగా వెనుకబడిన తరగతుల కష్టాలు నాకు తెలుసు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండి కొట్టాలని వారు (కాంగ్రెస్‌) చూస్తారు. నాటి మన్మోహన్‌ ప్రభుత్వం కూడా ముస్లిం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలకు మళ్లించే ప్రయత్నాన్ని నేను అంగీకరించను.

ఇది మోదీ గ్యారెంటీ. అందుకే కాంగ్రెస్‌ నేతలు నన్ను బెదిరించాలని విఫల యత్నం చేస్తున్నారు.’ అని మోదీ చెబుతున్నారు. జైపూర్‌లో ఆ పార్టీ మరో అగ్రనేత అమిత్‌ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఓబీసీ వ్యతిరేకి అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీనే అన్యాయం చేసిందని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడానికి కృషి చేసిందని, కేంద్రంలోని అన్ని నియామకాల్లో ఓబీసీ వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని రిజర్వేషన్‌ చుట్టూ రాజకీయం తిప్పారు.

మైనార్టీ రిజర్వేషన్లపై

ఇక మత ప్రాతిపదికన కాంగ్రెస్‌ రిజర్వేషన్లు కల్పిస్తూ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నదని మధ్యప్రదేశ్‌, యూపీ, బీహార్‌, కర్ణాటక ప్రచారసభల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో నుంచే మైనార్టీలకు ఇస్తారని విమర్శిస్తున్నారు. మత ప్రాతిపదిక ఓట్లు అడుగుతున్నారన్న అభియోగాలపై ఆ పార్టీ బెంగళూరు సౌత అభ్యర్థి తేజస్వీ సూర్యకు ఈసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జై బజరంగ్‌బలి, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో హనుమాన్‌ చాలీసా వంటివి ఏ మత ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసినవో చెప్పనక్కరలేదని పరిశీలకులు అంటున్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈడబ్ల్యూఎస్‌ కోటా తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు జరుగుతున్న నష్టాన్ని సవరించడానికే కాంగ్రెస్‌ పార్టీ 50 శాతం పరిమితిని పెంచి అందరికీ న్యాయం చేస్తామంటున్నది. నిజానికి ఈడబ్ల్యూఎస్‌ కోటా తర్వాత గతంలో మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుపై ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌ దాటింది. ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’ అని నినదించిన బీజేపీ.. నిజానికి తన పాలనలో కొంతమంది కార్పొరేట్‌ శక్తులకే మేలు చేసేలా విధాన నిర్ణయాలు తీసుకున్నదని, అందుకే వారి పాలనలో అన్యాయానికి గురైన 90 శాతం మందికి న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్నది.

ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన కులగణన, రిజర్వేషన్ల పరిమితి పెంపు వంటి అంశాలతో పాటు కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని విమర్శిస్తున్నది. దీనికితోడు బీజేపీ ఆశిస్తున్న 400 సీట్ల సాధ్యమయ్యేలా లేవని మొదటి, రెండు దఫాల పోలింగ్‌తో తేలిపోవడంతో ఈ రిజర్వేషన్ల అంశమూ తమ పార్టీకి మొదటికే మోసం తెచ్చేలా ఉన్నదని, బీజేపీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నదని, ఓబీసీగా తాను వెనుకబడిన వర్గాలవాడినేనని, వారి కష్టాలు తనకు తెలుసునంటూ మోదీ చెప్పుకునే దాకా పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

Latest News