Site icon vidhaatha

PM Modi | ప్రధాని మోదీ చివరి పోరాటం!

(విధాత ప్రత్యేకం)

దేశంలో మరో ఆరు నెలల్లో భారీ రాజకీయ భూకంపం రానున్నదని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశపారంపర్య రాజకీయాలతో అభివృద్ధి చెందుతున్న రాజకీయపార్టీలు వాటంతట అవే విచ్ఛిన్నమవుతాయని అన్నారు. ఇటువంటి పార్టీల తిరోగమన రాజకీయాలతో ఆయా పార్టీల్లోని నాయకులే విసిగిపోయి ఉన్నట్లు తెలిపారు. బుధవారం పశ్చిమబెంగాల్‌, ఒడిశా ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరునెలల్లో కుటుంబ పార్టీల విచ్ఛిన్నం ఖాయమంటున్న మోదీ ఇవే వ్యాఖ్యలు కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోకుండా, ఏపీలో టీడీపీతో కలిసి కూటమిలో చేరకుండా, మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్‌పవార్‌) కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా, ఇదే ఎన్సీపీ, ఉద్ధవ్‌ ఠాక్రేను నిలువరించడానికి రాజ్‌ఠాక్రేను కలుపుకోకుండా నిజాయితీతో ఉండి ఉంటే ఇప్పడు ఆయన వ్యాఖ్యలకు అర్థం ఉండేదని అంటున్నారు.

బెంగాల్‌లో బీజేపీ హోరాహోరీ

బెంగాల్‌లోని 42 నియోజకవర్గాల్లో 33 చోట్ల పోలింగ్ పూర్తయ్యింది. బెంగాల్‌లో గత ఎన్నికల్లో 18 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి 30 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చి నాటి నుంచే తృణమూల్‌, బీజేపీల మధ్య తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. బీజేపీ అగ్రనేతలు సందేశ్‌ఖాలీ అంశాన్ని ప్రచారాస్త్రంగా మొదలుపెట్టారు. ఆ తర్వాత స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామక పరీక్ష పత్రం లీకేజీ, ముస్లింలకు ఇచ్చిన ఓబీసీ హోదాను హైకోర్టు కొట్టివేడయంతో వీటిని ప్రచారంలో పెట్టారు. అయినా మొదటి ఆరు దశల పోలింగ్‌ను బట్టి బీజేపీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో గెలుచుకున్న 18 సీట్లనైనా నిలబెట్టుకోవడానికి కాషాయపార్టీ కష్టపడుతున్నది. జూన్‌ 1న జరగనున్న బెంగాల్‌లోని 9 స్థానాలను గత ఎన్నికల్లో తృణమూల్‌ గెలుచుకున్నది.

ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. ఈ తొమ్మిది సీట్లలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు పోటీ చేస్తున్న డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గం, సందేశ్‌ఖాలీ ఘటన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ టీఎంసీపై తీవ్ర విమర్శలు చేస్తున్నది. ఆ ప్రాంతం ఉన్న నియోజకవర్గం బశీర్‌హాట్‌. ఇక్కడ బీజేపీ సందేశ్‌ఖాలీ బాధిత మహిళ రేఖా పాత్రకు టికెట్‌ ఇచ్చింది. మిగిలిన స్థానాల కంటే ఈ రెండు నియోజకవర్గాలపైనే బీజేపీ ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నది. ఎన్నికలకు ముందు నుంచి బెంగాల్‌ ప్రభుత్వంపై, మమతాపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.

ఈ రెండు స్థానాలు గెలుచుకోవడం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా, మమతా ప్రభుత్వంలో శాంతిభద్రతలు బాగాలేవని బీజేపీ తన వాదనను నిజమేనని ఈ ఫలితాలే నిదర్శనం అని చెప్పదలుచుకున్నది. ఇప్పటికే బీజేపీ యేతర రాష్ట్రాల్లో అస్థిర పరిస్థితులను సృష్టించి తద్వారా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలున్నాయి. బెంగాల్‌, కేరళలో గవర్నర్‌ వ్యవస్థల ద్వారా కేంద్రంలోని బీజేపీ ఆ పని చేయాలనుకుంటున్నదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో మళ్లీ గెలిస్తే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో పాటు బెంగాల్‌లోనూ ప్రభుత్వం కూలిపోతుందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రధాని వ్యాఖ్యలు కూడా దానికి బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.

అయోమయంతోనే ఆ వ్యాఖ్యలు

అలాగే బీజేపీ 2014లో 282 (ఎన్డీఏ కూటమి 336) ,2019లో 303 (ఎన్డీఏ కూటమి 352) గెలుచుకున్నది. కానీ ఈసారి మెజారిటీ మార్క్‌ 272 ను బీజేపీ చేరుకోలేదని, ఎన్డీఏ కూటమి కలుపుకున్నా 260-270 మధ్యే ఆగిపోతుందనేది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది సెఫాలజిస్టుల అంచనా. మహారాష్ట్ర, బీహార్‌, యూపీ, కర్ణాటక, తమిళనాడు వంటి చోట్ల నిరాశ కలిగించే ఫలితాలే వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలోని 21 స్థానాల్లో 15 నియోజకవర్గాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. మిగిలిన 6 స్థానాలకు జూన్‌ 1న ఎన్నికలు జరుగనున్నాయి. ఒడిశాలో 17 సీట్లు సాధిస్తామని మోదీ, షా మొన్నటివరకు ధీమా వ్యక్తం చేశారు. అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నది మోదీ వ్యాఖ్యలను చూస్తే అర్థమౌతుంది. అందుకే చివరి దశలో హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, బీహార్‌ చండీగఢ్‌లలో బీజేపీకి కాంగ్రెస్‌, ఆప్‌, ఆర్జేడీ సవాల్ విసురుతున్నాయి.

400 పార్‌ అన్న మోదీకి ఇప్పుడు మెజారిటీ సమస్య కలరపెడుతున్నది. ఓటమి తెలిసే ముజ్రా, మంగళసూత్ర, ఓట్‌ జిహాద్‌, గాంధీ సినిమా వచ్చేదాకా ప్రపంచానికి మహాత్మాగాంధీ గురించి తెలియదంటూ ప్రధాని మాట్లాడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తమకు అవకాశం ఇస్తే మంచిరోజులు వస్తాయని, డిజిటల్‌ ఇండియాను చూపిస్తామని గొప్పలు మోదీ పదేళ్ల క్రితం చెప్పుకొన్నారు. పదేళ్లు గడిచిన తర్వాతకూడా సాధించిందేమిటో చెప్పులేకపోతున్నారు. ప్రధానికి అపజయం అర్థమైందని అందుకే తాను ప్రధానిని అన్న విషయాన్ని కూడా మరిచి చివరి ప్రయత్నంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దానికి సంకేతమని సెటైర్లు వేస్తున్నారు. ఆయన అఖరి పోరాటమంతా మెజారిటీ కోసమే అని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే తెలియజేస్తున్నాయి.

Exit mobile version