Site icon vidhaatha

Secretariat Housing Ssociety | సెక్రటేరియ‌ట్ హౌసింగ్ సొసైటీలో అరాచకం.. డెత్ స‌ర్టిఫికెట్‌తో మాయాజాలం!

హైద‌రాబాద్‌, మే 24 (విధాత‌) :
Secretariat Housing Ssociety | ఆయ‌న గతంలో ఏపీ స‌చివాల‌యంలో అధికారిగా పనిచేసేవారు. రిటైర్‌ అయి కూడా రెండు ద‌శాబ్దాలు అవుతున్న‌ది. వృద్ధాప్యంలో ఉన్న పెద్దాయ‌న గుండెకు నాలుగు స్టెంట్లు వేశారు. ఒక కిడ్నీ తొల‌గించారు. వ‌య‌స్సు పైబ‌డిన ఈ రిటైర్డ్‌ అధికారికి నెక్నాంపూర్ ఏపీ సెక్రటేరియ‌ట్ మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్.. సెక్రటేరియ‌ట్ హిల్స్‌లో ఇంటి ప్లాట్ కేటాయించిన‌ట్లు కేటాయించారు. ఇదే ప్లాట్‌ను న‌కిలీ డెత్ స‌ర్టిఫికెట్‌తో మ‌రో ఇద్ద‌రికి కేటాయించి ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు సొసైటీ పెద్ద‌లు. ‘నేను చ‌నిపోలేదు, బ‌తికే ఉన్నాను అంటూ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా సొసైటీ కార్య‌వ‌ర్గం ఏమాత్రం ఖాత‌ర్ చేయ‌డం లేదు. త‌న పేరుతో ఉన్న‌ డెత్ స‌ర్టిఫికెట్‌ను ఆధారం చేసుకుని ఇద్ద‌రు ఉద్యోగులకు అక్ర‌మంగా కేటాయించార‌ని, అక్ర‌మ నిర్మాణాలు నిలిపివేసి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నార్సింగ్ పోలీసు స్టేష‌న్‌లో ఆయన మార్చి నెల‌లో ఫిర్యాదు చేశారు. ఈ గోల్‌మాల్‌ దందా గురించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. మ‌ణికొండ మునిసిపాలిటీ ప‌రిధి నెక్నాంపూర్‌లోని స‌ర్వే నంబ‌ర్ 31లో ఏపీ సెక్రటేరియ‌ట్ మ్యుచువ‌ల్లీ ఎయిడెడ్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్.. సెక్రటేరియ‌ట్ హిల్స్ పేరుతో భారీ లే అవుట్ వేసింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భూమి కేటాయించ‌గా, ఈ లేవుట్‌లో సుమారు 800 వ‌ర‌కు ఇళ్ల స్థ‌లాలు ఉన్నాయి. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ఇక్క‌డ ప్లాట్ల కేటాయింపు, మార్పిడి దందా అప్ర‌తిహ‌తంగా జ‌రుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ప్లాట్‌ ఎవ‌రికి కేటాయించారు? ఎవ‌రు ఇల్లు నిర్మిస్తున్నారు? అస‌లు అనుమ‌తి ఇస్తున్నది ఎవరు? అనేది తెలియ‌కుండా తతంగం సాగిపోతున్నదని అంటున్నారు. మొత్తం ప్లాట్లలో అస‌లైన స‌భ్యులు యాభై శాతానికి మించి లేరని తెలుస్తున్నది. సుప్రీంకోర్టులో కేసు న‌డుస్తుండ‌టంతో ఇక్క‌డ స‌భ్యులు కాని వారు స్థ‌లం కొనుగోలు చేసిన‌ట్ల‌యితే అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. స‌భ్యుల నుంచి కొనుగోలు చేసిన వారు అనుమ‌తులు లేకుండా నిర్మాణాలు చేప‌డుతున్నారని తెలుస్తున్నది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండదండ‌ల‌తో ఇష్టానుసారంగా దందాలు నిర్వ‌హించారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చినా ఇప్ప‌టికీ ఏమాత్రం భ‌యం లేకుండా అక్ర‌మాలు కొనసాగుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాట్ కేటాయింపు ఇలానా!

ఎస్‌ చంద్రశేఖర్‌రావును అనే అధికారికి హోదాను బ‌ట్టి గ‌చ్చిబౌలిలోని లే అవుట్‌లో ప్లాట్‌ ఇవ్వాల్సి ఉండ‌గా ఇవ్వ‌లేదు. నెక్నాంపూర్ లేవుట్‌లో తొలిసారి 177వ నంబర్‌ ప్లాట్‌ కేటాయించారు. త‌న‌కు కేటాయించిన ప్లాట్‌ను ప‌రిశీలించ‌డానికి వెళ్ల‌గా, ప‌క్క‌నే ముస్లింల స‌మాధులు ఉన్నాయి. అక్క‌డున్న ముస్లింలు ఇది త‌మ‌కు చెందిన స్థ‌లమని, అది మీకెలా కేటాయించారని ప్రశ్నించడంతో ఈ విష‌యాన్ని సొసైటీ పెద్దలకు ఎస్‌ చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌లుమార్లు వివ‌రించారు. అయినా విన్పించుకోకుండా, ప్ర‌త్యామ్నాయంగా ఇంటి జాగా చూపించ‌కుండా సొసైటీ పెద్దలు సతాయించారు. గ‌త్యంత‌రం లేక ఆయ‌న బ‌షీర్ బాగ్‌లోని లోకాయుక్త‌ను ఆశ్ర‌యించి, హ‌సింగ్ సొసైటీపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న లోకాయుక్త.. స‌హ‌కార శాఖాధికారి ఇచ్చిన నివేదిక‌పై విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌ని చెప్ప‌డంతో సొసైటీ కార్య‌వ‌ర్గం దారికి వ‌చ్చింది. చంద్ర‌శేఖ‌ర్ రావుకు మ‌రో ప్లాట్‌ కేటాయిస్తామ‌ని చెప్పి, విచార‌ణ గండం నుంచి బ‌య‌ట‌ప‌డింది. మ‌ళ్లి కొన్ని నెల‌లు ఇబ్బందులు పెట్టి, చివ‌ర‌కు డ్రైనేజీ ప‌క్క‌న ఉన్న 122 నంబ‌ర్ ప్లాట్‌ కేటాయించారు. అప్ప‌టికే ఈ ఫ్లాట్ ను ఏ చంద్ర‌శేఖ‌ర్ అనే ఆయ‌న‌కు కేటాయించారు. ఎలాగైతే ఏంటి త‌న‌కు 122 నంబ‌ర్ ప్లాట్‌ ద‌క్క‌డంతో ఎస్‌ చంద్రశేఖర్‌ ఇంటి నిర్మాణ పనులు 2017లో ప్రారంభించారు. మ‌ణికొండ మున్సిపాల్టీ నుంచి అనుమ‌తులు తీసుకుని, ప‌నులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో డ్రైనేజీ నీరు ప్ర‌వ‌హిస్తుంటంతో కొద్ది సంవ‌త్స‌రాలు ఆగాల‌ని నిర్ణ‌యించారు. అదే ఆయ‌న‌ పాలిట శాపంగా ప‌రిణ‌మించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎస్‌ చంద్ర‌శేఖ‌ర్ రావు అక్క‌డ‌కు వెళ్లి త‌న ప్లాట్‌ను ప‌రిశీలించగా, అది రెండుగా విభ‌జించి ఉంది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఎస్‌ చంద్రశేఖర్‌రావు.. సొసైటీ పెద్దలకు వెంట‌నే ఫిర్యాదు చేశారు. అయినా ప‌ట్టించుకోలేదు, త‌ప్పును స‌రిదిద్దే ప్రయత్నమూ జరుగలేదు. దీంతో గ‌త్యంత‌రం లేని ఆయ‌న స‌చివాల‌యం వెళ్లి రెవెన్యూ శాఖ డిప్యూటీ సెక్రట‌రీ తుల‌సీ కుమారిని సంప్ర‌దించారు. త‌న‌కు ఇచ్చిన ప్లాట్‌ను మీకు ఎవ‌రు కేటాయించారు? ఎలా తీసుకున్నారు? అని అడిగే క్రమంలో ఇద్ద‌రి మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వాదం కూడా జ‌రిగింద‌ని అక్క‌డున్న ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె వెంట‌నే సైఫాబాద్ పోలీసు స్టేష‌న్‌లో ఎస్‌ చంద్ర‌శేఖ‌ర్ రావుపై ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫిర్యాదు చేసే ముందు ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. ఇరువురూ, ఎవ‌రికి వారుగా త‌మ వాద‌న‌లు పోలీసుల ముందు విన్పించారు.

డెత్ స‌ర్టిఫికెట్ మాయాజాలం

హైద‌రాబాద్‌లో ఇంటి జాగాల విలువ‌లు అమాంతం పెర‌గ‌డంతో, హౌసింగ్ సొసైటీల్లో జోరుగా దో నంబ‌ర్‌ దందాలు న‌డుస్తున్నాయి. తొలుత ఒక‌రికి కేటాయించ‌డం, ఆ త‌రువాత మ‌రొక‌రికి కేటాయిస్తూ ఎన్వోసీలు ఇవ్వడం పరిపాటిగా మారిందని అంటున్నారు. నెక్నాంపూర్ హౌసింగ్ సొసైటీలో కూడా ఇదే జ‌రుగుతోందని సమాచారం. ఎస్‌ చంద్ర‌శేఖ‌ర్ రావుకు కేటాయించిన 122 నంబర్‌ ప్లాట్‌ను గ‌తంలో ఏ చంద్ర‌శేఖ‌ర్ అనే వ్యక్తికి కేటాయించారు. లోకాయుక్త ఆదేశాల మేర‌కు సొసైటీ 122 నెంబ‌ర్ ప్లాట్‌ను ఎస్‌ చంద్రశేఖర్‌రావుకు కేటాయించింది. ఏ చంద్ర‌శేఖ‌ర్‌ గ‌చ్చిబౌలిలోని హౌసింగ్ సొసైటీలో స్థ‌లం కేటాయించ‌డంతో ఆయ‌న నెక్నాంపూర్‌లో తీసుకోలేదు. ఆ మేర‌కు నెక్నాంపూర్ రికార్డులు స‌వ‌రించ‌లేదు. ఇటీవ‌లే ఏ చంద్ర‌శేఖ‌ర్ చ‌నిపోవ‌డంతో ఆ డెత్ స‌ర్టిఫికెట్‌ను ఆధారం చేసుకుని మ‌రో ఇద్ద‌రికి సొసైటీ ఆ భూమిని కేటాయించింది. ఏ చంద్ర‌శేఖ‌ర్ చ‌నిపోతే, ఎస్‌ చంద్ర‌శేఖ‌ర్ రావు చ‌నిపోయారంటూ ఇద్ద‌రికి కేటాయించడం వివాదం రేపింది. రెవెన్యూ శాఖ‌లో డిప్యూటీ సెక్రట‌రీగా ప‌నిచేస్తున్న తుల‌సి కుమారి, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ శాఖ‌లో నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగిగా ప‌నిచేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్‌కు 122 స్థలం కేటాయించారు. ఇద్ద‌రూ ఎవ‌రికి వారుగా ప్ర‌హ‌రీ గోడ నిర్మాణం చేసుకున్నారు. త‌న ప్లాట్ చూసుకునేందుకు వెళ్లిన ఎస్‌ చంద్ర‌శేఖ‌ర్ రావుకు ప్ర‌హ‌రీ గోడ‌లు క‌న్పించ‌డంతో గుండె ఆగినంత ప‌నైంది.

నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు

త‌న ప్లాట్‌లో అక్ర‌మ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని, వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మార్చి 21వ తేదీన నార్సింగి పోలీసు స్టేష‌న్‌లో ఎస్‌ చంద్ర‌శేఖ‌ర్ రావు (122 ప్లాట్ య‌జ‌మాని) ఫిర్యాదు చేశారు. త‌న వ‌య‌స్సు 77 సంవ‌త్స‌రాలని, గుండెకు ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని, ఒక మూత్ర‌పిండాన్ని తొల‌గించార‌ని, వ‌య‌స్సు పైబ‌డిన స‌మ‌స్య‌ల‌తో అనారోగ్యంతో ఉన్నాన‌ని ఫిర్యాదులో మొరపెట్టుకున్నారు. ఇటీవ‌ల త‌న ప్లాట్ వ‌ద్ద‌కు ప‌రిశీల‌న‌కు వెళ్ల‌గా, 122 ఏ, 122 బీ బై నంబ‌ర్‌తో రెండుగా విభ‌జించార‌ని వివ‌రించారు. ఈ రెండు తుల‌సీ కుమారి, ఏ.జ‌గ‌న్ మోహ‌న్ పేరిట ఉన్నాయని తెలిపారు. ఈ స్థ‌లంలో అక్ర‌మ నిర్మాణాల‌పై స్థానికంగా ఉన్న మేస్త్రీ రెడ్డ‌ప్పను విచారించ‌గా, కొన్ని విష‌యాలు తెలిశాయ‌న్నారు. సెక్రటేరియ‌ట్ హౌసింగ్ సొసైటీ ప‌ర్స‌న్ ఇన్‌చార్జ్‌ యూసుఫ్ షేక్ 122వ నంబర్‌ ప్లాట్‌ను రెండుగా విభ‌జించి, అక్ర‌మంగా కేటాయించిన‌ట్లు ఫిర్యాదు చేశారు. త‌న అనుమ‌తి లేకుండా త‌న స్థ‌లంలో ప్ర‌వేశించి, నిర్మాణాలు చేసిన వారిపై, కేటాయింపు చేసిన సొసైటీపై కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రిపాల‌న్నారు. త‌న ప్లాట్ త‌న‌కు ద‌క్కేలా కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను కోరుతూ, ప్లాట్ కేటాయింపుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను కూడా అంద‌చేశారు. అయితే నార్సింగి పోలీసులు సొసైటీకి నోటీసులు పంపించి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తున్నది.

ఇవి కూడా చదవండి..

Secretariat | స‌ర్కారులోనే లీకు వీరులు.. గేటు దాటుతున్న కీల‌క విష‌యాలు?
Medigadda Barrage Case: మేడిగడ్డ కుంగుబాటు కేసు సీబీఐకీ..సర్కార్ యోచన

Exit mobile version