BC Ordinance Legal Hurdles | బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చినా.. కోర్టు కనికరించేనా?

  • Publish Date - July 12, 2025 / 07:51 AM IST

BC Ordinance Legal Hurdles | హైద‌రాబాద్‌, జూలై 11 (విధాత‌): రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతానికి పెంచుతూ ప్ర‌త్యేక ఆర్డినెన్స్ తీసుకు వ‌చ్చినా… అమ‌లు చేయ‌డం సాధ్యం అవుతుందా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం అన్ని ర‌కాల రిజ‌ర్వేష‌న్లు క‌లిపి 50 శాతం దాట‌కూడ‌ద‌ని ఆదేశాలు ఇచ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ ప‌రిశీల‌కులు గుర్తు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో రేవంత్ స‌ర్కారు స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. బీసీ సంఘాలు, రాజ‌కీయ పార్టీలు బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచిన త‌రువాత‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశాయి. వాస్త‌వంగా బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని భావించిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం త‌రువాత రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి పంపించారు. మూడు నెల‌లుగా బీసీ బిల్లు కేంద్రం ద‌గ్గ‌రే మూల‌కు ప‌డింది. మ‌రో వైపు ఎన్నిక‌లు త‌ర్వ‌గా నిర్వ‌హించాల‌న్న హైకోర్టు ఆదేశాలు… రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌న్న బీసీల డిమాండ్ నేప‌థ్యంలో గురువారం స‌మావేశ‌మైన రాష్ట్ర మంత్రి వ‌ర్గం పంచాయ‌తీ రాజ్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేస్తూ ఆర్డినెన్స్ చేసి, రిజ‌ర్వేష‌న్లు పెంచి ఎన్నికలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం అమలు సాధ్యమేనా? న్యాయ పరమైన ఇబ్బందులు ఏంటి? పార్లమెంట్ లో చట్టం చేయకున్నా రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా? రిజర్వేషన్ల అమలుపై ఏ పార్టీ వాదన ఎలా ఉంది? ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై తెచ్చిన జీవోలు కోర్టుల్లో నిలబడ్డాయా? అన్న చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతున్న‌ది.

ఆర్డినెన్స్ అవసరం ఎందుకు వచ్చింది?

సెప్టెంబర్ 30 లోపుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెల రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. మార్చిలో తెలంగాణ అసెంబ్లీ పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ, సెప్టెంబర్ నెలాఖరునాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయితీరాజ్ చట్టం-2018ని సవరించి ఆర్డినెన్స్ తెస్తారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఇప్పటికే బీసీ డెడికేటేడ్ కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టారు. వీటి ఆధారంగానే అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. సర్పంచి, ఎంపీటీసీ పదవులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుకు మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలని, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లాను యూనిట్ గా తీసుకోవాలి నిర్ణయించారు. జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం పంచాయితీరాజ్ చట్టం 2018 ను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తారు. తద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన.

న్యాయపరమైన ఇబ్బందులున్నాయా?

రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లు అమలుకావడానికి పార్లమెంట్ ప్రత్యేక చట్టం చేసి 9వ షెడ్యూల్ లో చేర్చింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు కావాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. అది కోర్టుల్లో నిలబడాలి. 9వ షెడ్యూల్ లో చేర్చాలి. జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. విద్య, ఉద్యోగాలతో పాటు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలంగాణ పంపిన బిల్లులలను ఈ పార్లమెంట్ పెట్టి ఆమోదం పొందేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. జూలై 24 లోపుగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడానికి హైకోర్టు గడువు విధించింది. పార్లమెంట్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే ఈ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడం అయితే అదంతా సులభంగా సాధ్యమయ్యే పనికాదు. ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే కేంద్రంలోని అన్ని పార్టీలతో పాటు మోదీ సపోర్ట్ కూడా అవసరం. ప్రస్తుతం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచితే రిజర్వేషన్లు 70 శాతానికి చేరుతాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే రిజర్వేషన్ల అమలు జరిగే అవకాశం ఉందా అనే చర్చ కూడా ఉంది. మరో వైపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేమనే వాదన కూడా ఉంది. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనా తర్వాత కూడా కొన్ని సమయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకొన్న సందర్భాలను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. బీసీలకు 22.78 శాతం, మండల పరిషత్ లో 18.77 శాతం, జిల్లా పరిషత్ లో 17.11 శాతం రిజర్వేషన్లు దక్కాయి. అప్పటి ప్రభుత్వం బీసీ డెడికేటేడ్ కమిషన్ ను కమిటీ సిఫారసుల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు దక్కాయి. రేవంత్ సర్కార్ నిర్వహించిన కులగణనలో బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. బీసీల రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్ ను కూడా ప్రభుత్వం నియమించింది. కుల గణన జనాభా ఆధారంగా బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ల సిఫారసులను ఆరు కేటగిరిలుగా విభజించారు.వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లను డెడికేషన్ కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలంటే పార్లమెంట్ ఆమోదం పొందాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసినా న్యాయపరమైన ఇబ్బందులు దక్కకుండా ఉండాలంటే వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. ఈ డేటా సైంటిఫిక్ గా సేకరించిందేనని కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలి. ఈ డేటా సైంటిఫిక్ గా సేకరించలేదని కోర్టు భావిస్తే రిజర్వేషన్ల అమలుకు ఇబ్బంది ఏర్పడుతోంది. 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ వెసులుబాటు ఉంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో తన వాదనను వినిపిస్తే ప్రయోజనం ఉంటుంది.

బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీల మద్దతు.. కానీ….

తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికిపైగా బీసీ జనాభా ఉంది. అన్ని పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నిలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించింది. ఈ సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, బీసీ సబ్ ప్లాన్ ను తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని బీజేపీ కోరుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై కమలం పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో చట్టం చేయాలనేది ఆ పార్టీ వాదన. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఆ పార్టీ సందేహపడుతోంది. ఇప్పుడు తేవాలని భావిస్తున్న ఆర్డినెన్స్ ను మూడు నెలలల క్రితమే తెస్తే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవనేది ఆ పార్టీ వెర్షన్. అంతేకాదు ఆర్డినెన్స్ విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరుతోంది కమలం పార్టీ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై గవర్నర్ ద్వారా కేంద్రానికి బిల్లు పంపి.. దాన్ని బైపాస్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలనే ప్రయత్నాలపై గులాబీ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే తరహాలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ లలో తీసుకువచ్చిన జీఓలు కోర్టుల్లో నిలబడలేదని కారు పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు.