విధాత: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఢిల్లీలో నిరవధిక దీక్ష చేయాలని ఆయన కోరారు. పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లును పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కేటీఆర్ చర్చలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం నాలుగుసార్లు మాట మార్చారని ఆయన విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల గురించి పార్లమెంట్ లో ఎందుకు లేవనెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్ , మండలి ఛైర్మన్ బలహీనవర్గాలకు చెందిన వారేనని ఆయన అన్నారు. బీసీ బిల్లులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కేటీఆర్ చెప్పారు.
బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారని ఆయన తెలిపారు. ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు కేసీఆర్ అప్పట్లోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరిన
విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2021 జనగణనతో పాటు కులగణన చేయాలని బీఆర్ఎస్ కోరిందని ఆయన అన్నారు. కులగణనపై రాహుల్ గాంధీ కంటే ముందు మాట్లాడింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ, మండలి, పార్లమెంట్ లో ఓబీసీ రిజర్వేషన్లు తీసుకోవాలని అప్పట్లోనే తీర్మానించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ విధిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2010లో తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును అతిక్రమించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కేటీఆర్ చెప్పారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయడం వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమని ఆయన అన్నారు. పార్లమెంట్ లో మెజారిటీ బీజేపీ, కాంగ్రెస్ కే ఉంది.. లోక్ సభలో తమకు లేదని కేటీఆర్ తెలిపారు. 9వ షెడ్యూల్ లో చేరిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందన్నారు.
చట్టాల్లో లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయవ్యవస్థ అడ్డురాదని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా మనందరికీ ధ్యేయసారూప్యత ఉందని అందుకే బిల్లుకు మద్దతిస్తున్నామన్నారు. అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ కోరారు. కానీ, ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహణలో ముందుకు రావడం లేదని ఆయన సెటైర్లు వేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో 52 శాతం బీసీలున్నారని తేలిందన్నారు. కానీ కాంగ్రెస్ చేసిన సర్వేలో 6 శాతం బీసీలు ఎలా తగ్గారని ఆయన ప్రశ్నించారు.
బీసీలకు సబ్ ప్లాన్ ను కూడా తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నామని ఆయన అన్నారు. ఈ బిల్లుపై ఎన్ని రోజులు చర్చించినా సమస్య పరిష్కారం కాదన్నారు. రాహుల్ గాంధీ, మోడీ దీనిపై సానుకూలంగా ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమని ఆయన అన్నారు. చట్టాల్లో లొసుగులు ఉంటే ఎవరైనా కోర్టుకు వెళ్తారన్నారు. కోర్టుకు వెళ్లవద్దని కోరడం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.