Site icon vidhaatha

Telangana Chief Secretary Race | కౌన్ బ‌నేగా.. న‌యా సీఎస్‌! ఆగ‌స్ట్ నెలాఖ‌రుకు ప్రస్తుతం సీఎస్‌ రామ‌కృష్ణారావు రిటైర్‌మెంట్‌

Telangana Chief Secretary Race |  హైద‌రాబాద్‌, జూలై 19 (విధాత‌): తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సీఎస్‌ ఎవరన్న అంశం మళ్లీ చర్చల్లోకి వస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కే రామ‌కృష్ణారావు ఆగ‌స్ట్ 31వ తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆయన పదవీకాలం పొడిగిస్తారా? లేక కొత్త సీఎస్‌ ఎంట్రీ ఉంటుందా? అనే చర్చ నడుస్తున్నది. రామకృష్ణారావు 2025 ఏప్రిల్ 30వ తేదీన సీఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయన ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీకరించడానికి ముందే కనీసం రెండేళ్లు పదవిలో ఉండేవాళ్లను ఎంపిక చేసుకుంటే బాగుంటుందనే చర్చ నడిచింది. అప్పుడే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు గ్రౌండింగ్ చేయ‌డానికి, పాల‌నలో త‌న‌దైన ముద్ర వేయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌న్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అప్ప‌ట్లో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి త‌న‌కు న‌చ్చిన అధికారి రామ‌కృష్ణారావును సీఎస్‌గా నియ‌మించార‌న్న వాదనలు అధికారవర్గాల్లో వినిపించాయి. మరి ఇప్పుడు ఆయనకు పదవీకాలం పొడిగిస్తారా? లేక కొత్త సీఎస్‌ను నియమించుకుంటారనే అనేది తేలాల్సి ఉన్నది.

రేసులో ఆ ముగ్గురు..

రాష్ట్ర ఏఐఎస్ క్యాడర్‌ అధికారుల‌లో 1992 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారులు సీఎస్ రేస్‌లో ముందు వ‌రుస‌లో ఉన్నారు. వీరు కాకుండా 1990 బ్యాచ్‌కు చెందిన శ‌శాంక్ గోయ‌ల్‌, 1991 బ్యాచ్‌కు చెందిన అర‌వింద్ కుమార్ కూడా ఉన్నారు. అర‌వింద్ కుమార్‌ ఇప్ప‌టికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచార‌ణ‌ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనను పక్క‌న బెట్టింది. మ‌రో సీనియ‌ర్ అధికారి శంశాంక్ గోయ‌ల్‌పై రేవంత్ స‌ర్కార్‌కు పెద్ద‌గా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏమీ లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా ఆయ‌న ఎక్కువ‌గా ఢిల్లీలోనే ఉండ‌టానికి ప్ర‌య‌త్నం చేస్తార‌న్న వాదన కూడా ఉంది. దీంతో రేవంత్ స‌ర్కారు శ‌శాంక్ గోయ‌ల్‌కు సీనియార్టీ ఉన్న‌ప్ప‌టికీ ఢిల్లీ రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌గానే నియ‌మించింది. ఆయన కూడా సీఎస్‌ బాధ్యతలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని అంటున్నారు. అయితే ద‌శాబ్ద కాలంగా కేంద్ర స‌ర్వీసులలో ఉన్న తెలంగాణ క్యాడర్‌ ఐఏఎస్ అధికారి సంజ‌య్ జాజు రాష్ట్రానికి రావాల‌ని ఆసక్తి చూపిస్తే సీఎస్ రేస్‌లో ఉంటార‌న్న అభిప్రాయం స‌చివాల‌య ఉద్యోగ వ‌ర్గాల‌లో వ్య‌క్తం అవుతున్న‌ది. 1992 బ్యాచ్ అధికారుల‌లో అంద‌రి కంటే ఎక్కువ‌గా సంజ‌య్ జాజుకు 5 సంవ‌త్స‌రాల స‌ర్వీస్ ఉన్న‌ది. అదే సమయంలో కేంద్ర స‌ర్వీసులలోనే కొన‌సాగ‌గ‌లిగితే ఆయనకు క్యాబినెట్‌ సెక్ర‌టరీ అయ్యే అవ‌కాశాలుంటాయ‌ని ఒక సీనియ‌ర్ అధికారి అన్నారు. ఇక జయేశ్‌ రంజన్‌, వికాస్‌రాజ్‌ ఇద్దరూ రాష్ట్ర సర్వీసులలో పనిచేస్తున్నారు. జ‌యేశ్ రంజ‌న్ తెలివివైన అధికారి అని, ఎక్క‌డి నుంచైనా పెట్టుబ‌డులు రాబ‌ట్టగ‌ల‌గ‌డంలో దిట్ట అన్న పేరున్న‌ది. వివాద రహితుడన్న అభిప్రాయమూ ఉన్నది. వికాస్‌రాజ్ జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేశారు. ఈ ఇద్ద‌రు అధికారులు ప్ర‌స్తుతం సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌లుక్స్‌లో ఉన్నార‌న్న చ‌ర్చ అధికార వ‌ర్గాల‌లో వినిపిస్తున్నది. వీరిలో ఎవ‌రికి సీఎస్‌గా తీసుకుంటే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉందన్న అంశం గీటురాయిగానే నియామ‌కం ఉంటుంద‌ని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల వేళ కొత్త సీఎస్‌ వస్తారా?

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. బీసీల‌ను త‌న వైపు తిప్పుకొనే ప‌నిలో కాంగ్రెస్ ఉన్న‌ది. దాన్ని క్రయిటీరియాగా తీసుకుంటే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయేశ్‌ రంజన్‌ నియామకం తమకు సానుకూలంగా ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స‌ర్వీస్ కూడా 2027 సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ఉన్న‌ది. సీఎస్ నియామ‌కంలో రాజ‌కీయ కోణాన్ని కూడా విస్మ‌రించ‌లేమ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు.

ఎక్స్‌టెన్ష‌న్‌పై రామకృష్ణారావు ఆశ‌లు!

పదవీకాలం పొడిగింపు కోసం సీఎస్‌ రామకృష్ణారావు ఆశలు ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఎక్స్‌టెన్షన్‌ ఇస్తారా? లేక కొత్త వారిని ఎంపిక చేస్తారా? అనే విషయంలో సచివాలయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా సుదీర్ఘకాలం ప‌నిచేసిన రామ‌కృష్ణారావుకు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, అది పనిచేస్తే ఎక్స్‌టెన్ష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌చివాల‌యానికి చెందిన ఒక ఉన్న‌తాధికారి అభిప్రాయప‌డ్డారు. నాలుగు నెల‌లు మాత్ర‌మే సీఎస్‌గా ప‌ని చేస్తే ప్ర‌త్యేక ముద్ర వేయ‌లేమ‌ని, ఆర్థిక శాఖ‌పై అనుభ‌వం ఉన్న రామ‌కృష్ణారావు ఆర్థిక క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కిస్తాడ‌ని, అందుకే మ‌రో రెండు ట‌ర్మ్‌లు ఎక్స్‌టెన్ష‌న్ చేసే అవ‌కాశం ఉంద‌ని మరొక అధికారి అభిప్రాయప‌డ్డారు. తెలంగాణ మొద‌టి సీఎస్ రాజీవ్ శ‌ర్మ‌కు అప్ప‌టి సీఎం కేసీఆర్ రెండుసార్లు ఎక్స్‌టెన్ష‌న్ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత సీఎస్‌గా వచ్చిన ప్ర‌దీప్ చంద్ర‌ను నెల రోజులకే ఇంటికి పంపించిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తున్నారు. ప్రదీప్ చంద్ర ఎక్స్‌టెన్ష‌న్ కోసం అప్ప‌టి సీఎం కేసీఆర్ కేవ‌లం లెట‌ర్ రాసి చేతులు దులుపుకొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. నాడు ప్ర‌ధానితో మాట్లాడి ఉంటే ఎక్స్‌టెన్ష‌న్ వ‌చ్చేద‌ని అప్ప‌ట్లో అధికార వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రిగింది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. రామకృష్ణారావు పదవీకాలం పొడిగింపుపై లేఖ రాసినంత మాత్రాన సరిపోదని, ప్రధానితో ముఖ్యమంత్రి మాట్లాడి ఒప్పించుకుంటేనే పని అవుతుందని అంటున్నారు.

Exit mobile version