హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విధాత ప్రతినిధి)
Hyderabad Metro Rmail | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ నిర్వహణలోనే అష్టకష్టాలు పడుతోంది. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఇప్పట్లో పూర్తిగా కోలుకునే స్థితి లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ ప్రభుత్వానికి కత్తిమీద సాము లాంటిదని, ఏమాత్రం తేడా వచ్చినా నిందలు మోయాల్సి ఉంటుందని రవాణా రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేయబోతున్నదనేది బయటకు చెప్పకపోయినా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదనేది మాత్రం వాస్తవం. ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థ సాంకేతిక సహకారంతో మెట్రో ను నడిపించే అవకాశాలున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, ఆ నమ్మకంతోనే ఎల్ అండ్ టీ తో తెగతెంపులకు సిద్దమయ్యారంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినందున ప్రతి స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలని, పార్కింగ్ సౌకర్యం పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్టేషన్ లో దిగగానే తమ గమస్థానానికి దగ్గరగా బస్సులు అందుబాటులో ఉంటే ఆదరణ పెరుగుతుందంటున్నారు. ఆర్టీసీ ని నిర్వహిస్తున్న సర్కార్‌కు మెట్రో ను నడపడం పెద్ద పని కాదని, నిపుణులను నియమిస్తే సాఫీగా ఉంటుందని రవాణా రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైలు మాదిరి సామాజిక కోణంలో చూడాలంటున్నారు.
ఇదీ ఆర్టీసీ నేపథ్యం
ఆర్టీసీ రెండు భారీ నష్టాలను చవిచూసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 2011 సెప్టెంబర్ నెలలో సకల జనుల సమ్మె సందర్భంగా 42 రోజుల పాటు బస్సులు నడవ లేదు. ఎక్కడికక్కడే డిపోలలో నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత 2019 సంవత్సరం అక్టోబర్ నెలలో తమ న్యాయమైన డిమాండ్లు, ప్రభుత్వ సర్వీసులో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. త్రిసభ్య ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించడంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చెప్పినట్లుగా ఉద్యోగులు డిపోలలో రిపోర్టు చేయనట్లయితే తమంతట తామే ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లినట్లుగా గుర్తించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తిరిగి విధుల్లోకి వస్తే చేర్పించుకోవద్దని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె 42 రోజులు జరగ్గా, కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు సుమారు 55 రోజుల పాటు సమ్మె కొనసాగించి రికార్డు బ్రేక్ చేశారు. అక్టోబర్ 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 48వేల మంది ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి వంటా వార్పులో పాల్గొన్నారు.
రాష్ట్రంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయని, వాటన్నింటిని ప్రభుత్వంలో కలపమంటే కుదురుతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. అసలు విలీనం అనేదే తెలివి తక్కువ, అసంభవమైన నినాదమని కేసీఆర్ అన్నారు. ఆర్టీసి బతికి బట్టకట్టదని, సంస్థను ఎవరూ కాపాడలేరని అన్నారు. ఈ సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డిసెంబర్ 5వ తేదీన ప్రగతి భవన్ లో కేసీఆర్, సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులతో సమావేశమై సమ్మె చేసిన 55 రోజుల జీతం చెల్లిస్తామని ప్రకటించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కేసీఆర్ కు ఫోన్ చేసి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. 55 రోజుల సమ్మె కారణంగా ఆర్టీసీ వందల కోట్ల రూపాయలు నష్టపోయింది. ప్రతి రోజు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య రాబడి ఆగిపోయింది. దీంతో సంస్థ రూ.1,200 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. సమ్మె విరమించిన తరువాత ఆర్టీసీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఏడాది బడ్జెట్ లో రూ.1 వెయ్యి కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్, ఆ తరువాత ఒక్క పైసా ఇవ్వలేదు.
ప్రతి రోజు 62 లక్షల ప్రయాణికులు
ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ సమర్థ నిర్వహణ ద్వారా ప్రతి రోజు 62 లక్షల మందికి తగ్గకుండా గమ్యానికి సురక్షితంగా చేరుస్తున్నది. స్కూలు, కాలేజీ విద్యార్థులు చాలా తక్కువ రేటుతో బస్ పాస్ లతో ప్రయాణిస్తున్నారు. వికలాంగులు, జర్నలిస్టులు, డయాలసిస్ పేషెంట్లు కూడా సబ్సిడీ వాడుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో లక్షల మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోతే ఎలా ఉండేది? ఒక్క ప్రైవేటు బస్సులు మాత్రమే ఉంటే ఆర్టీసీ లేకపోతే ఎలా ఉంటుందో ఊహించలేము. ఆర్టీసీ ఉండబట్టే ప్రైవేటు ఆపరేటర్లు దందా కంట్రోల్ లో ఉంది. ఈ రెండు వ్యవస్థలు ఇప్పుడు ఉన్నాయి. కరోనా కాలంలో నష్టం వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎల్ అండ్ టీ కంపెనీకి, మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.1500 కోట్లు కేటాయించింది. కానీ కరోనా వల్ల ప్రభుత్వరంగ ఆర్టీసీ ఇంకా ఎక్కువ నష్టాల్లోకి వెళితే రూపాయి కూడా ఇవ్వలేదు. అయినా అది ప్రజల కోసం మనుగడ సాగిస్తూనే ఉంది. ఇది పబ్లిక్ సెక్టార్ సామాజికన్యాయ దృష్టి కోణం. దాని నిబద్ధత. ఇలాంటి సంస్థలు లేకపోతే పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి దుర్భరంగా అవుతుంది.
ఆర్టీసీ కన్నా మెట్రో రైలు పెద్దది కాదు
మెట్రో రైలు ప్రారంభమైన తరువాత ఆ రూట్లలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రయాణ సమయం ఆదా అయ్యింది. ఉదయం పూట విజయవాడ, సూర్యాపేట నుంచి వచ్చేవారు ఎల్బీనగర్ లో దిగి మెట్రో రైలు ఎక్కి తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ప్రతి నిత్యం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇంత మంది ప్రయాణిస్తున్నా నష్టాల్లో ఉన్నదంటూ గత ఆరు నెలలుగా ఎల్ అండ్ టీ కంపెనీ మొత్తుకుంటున్నది. కారణం ఏమంటే ఇప్పుడున్న దాన్ని విస్తరించకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రారంభంలో వేసిన మూడు లైన్లనే కొనసాగించడం మూలంగా ఎక్కువ మంది ప్రయాణించలేని పరిస్థితి దాపురించింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ 75 శాతం మంది వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. లాస్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం, స్టేషన్ నుంచి కాలనీలకు బస్సు సౌకర్యం లేకపోవడం, రెండింటికి కామన్ పాస్ లేకపోవడం కూడా సమస్యగా చెబుతున్నారు. ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చినందున సామాజిక కోణంలో ఆలోచించాలని, లాభాపేక్ష ను వదిలేయాలని రవాణా రంగ నిపుణులు, సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. కొత్తగా విస్తరించడంతో పాటు, పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, త్వరితగతిన పనులు పూర్తి చేస్తే మెట్రో రైలు ప్రయాణం మెరుగవుతుందంటున్నారు. అయితే తమ ఆధీనంలోకి తీసుకున్న సర్కార్ తన వ్యూహం ఏమిటనేది బయటకు చెప్పడం లేదు. ప్రస్తుత మూడు మార్గాల్లో సాంకేతికంగా సాయం ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కొత్తగా ప్రతిపాదించిన మార్గాల్లో పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌లో వెళ్తుందా, ప్రభుత్వమే స్వయంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయిస్తుందా అనేది తెలియడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తే టికెట్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉండదు. ప్రతి రోజు 62 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ నే నిర్వహిస్తున్నప్పుడు, మెట్రో రైలు నిర్వహించడం ప్రభుత్వానికి అంత పెద్ద సమస్య కాదని రవాణా రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.