Site icon vidhaatha

Hyderabad Metro Rail | మేడిగడ్డ కుంగుబాటుతో మెట్రో ఎగ్జిట్ కు లింకు?

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనుల్లో ఎల్అండ్ టీ ద్వంద్వ వైఖరి, ప్రభుత్వం వల్లే మెట్రో రైలుకు నష్టాలు వస్తున్నాయన్న వ్యాఖ్యలు మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీని తప్పించడానికి కారణమయ్యాయా?

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విధాత):

Hyderabad Metro Rail | కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులో మేడిగడ్డ బారాజ్ లో కుంగిన పిల్లర్లు, మరమ్మతు పనులపై ఎల్ అండ్ టీ కంపెనీ మాట మార్చడం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ జీర్ణించుకోలేకపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తామే పునరుద్ధరణ పనులు చేపడతామని ప్రభుత్వానికి లేఖ ఇచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మడత పేచి పెట్టింది. పనిలో పనిగా మెట్రో రైలు నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానన్న సాఫ్ట్ లోన్, బెయిల్ అవుట్ అందలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాసింది. నష్టాలు ఇక భరించలేమని, రెండో దశ విస్తరణలో పాలుపంచుకోలేమని చెప్పడంతో ఎల్ అండ్ టీ, కాంగ్రెస్ ప్రభుత్వ మధ్య అంతరాలు పెరిగాయి. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఎల్ అండ్ టీ ని రాష్ట్రం నుంచి సాగనంపేందుకే నిర్ణయం తీసుకున్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మేడిగడ్డలో తప్పు జరిగినట్లు నిర్థారణ అయినా, మెట్రో రైలు నిర్వహణ విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

బీఆర్ఎస్ ఏలుబడిలో ఏడవ బ్లాక్ కుంగుబాటు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బారాజ్ లోని 7వ బ్లాక్ కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికంగా పనిచేస్తున్న ఏఈఈ రవికాంత్ తో మహదేవ్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం బరాజ్ నుంచి పెద్ద శబ్ధాలు వచ్చాయని, ఎల్ అండ్ టీ ఫోర్ మెన్ బిద్యుత్ దేబనాథ్ తనిఖీ చేయగా బ్లాక్ 7 లో 19, 20, 21 పిల్లర్లలో క్రాక్ వచ్చినట్లు తేలినందన్నారు. ఈ ఘటన తరువాత నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ తన ఆరుగురు సభ్యుల బృందంతో తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిల్లర్ల కుంగుబాటు, పగుళ్లు రావడం బీఆర్ఎస్ పార్టీ గెలుపు పై తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, కుంగుబాటు పై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

పిల్లర్ల కుంగుబాటు, పగుళ్ల ఘటన తరువాత తమ సొంత ఖర్చుతోనే బరాజ్ పునరుద్ధరణ పనులు చేపడతామని మరుసటి రోజు ఎల్ అండ్ టీ పీఈఎస్ సంయుక్త కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన తరువాత ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. ఎన్నికల ఫలితాలు రావడం, బీఆర్ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎల్ అండ్ టీ మాట మార్చింది. మేడిగడ్డ బరాజ్ కు సంబంధించిన డిఫెక్టు లయబిలిటీ సమయం 2022 జూన్ 29తో ముగిసిందని డిసెంబర్ 17, 2023లో తెలంగాణ ప్రభుత్వానికి స్ఫష్టం చేసింది. బరాజ్ పునరుద్ధరణ పనులు కోసం కొత్త ఒప్పందం చేసుకోవాలని సూచిస్తూ, డిసెంబర్ 5వ తేదీన నీటి పారుదల శాఖకు లేఖ పంపించింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి మళ్లింపు కోసం రూ.55కోట్లతో కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలని అందులో వివరించింది. ఈ నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇస్తే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. బరాజ్ పునరుద్ధరణ పనులకు మరో రూ.500 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఎల్ అండ్ టీ రాసిన లేఖల ను నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ లు రహస్యంగా ఉంచడం పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకు ముందు సహచర మంత్రులతో నిర్వహించిన సమీక్షలో ఎప్పుడూ ఈ లేఖల విషయాన్ని వెల్లడించలేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా మేడిగడ్డ పూర్తయినట్లు ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇచ్చిన తరువాత 1500 రోజులకు ఏకపక్షంగా రద్దు చేయడాన్ని అంగీకరించడం లేదని ఎల్ అండ్ టీ నీటి పారుదల శాఖకు అక్టోబర్ 2024లో లేఖ రాసింది. పని పూర్తయిన తరువాత ఇప్పుడు పెండింగ్ పనులు ఉన్నాయని అనడాన్ని తప్పు పట్టింది.

2025 జనవరిలో కాళేశ్వరం కమిషన్ విచారణ

మేడిగడ్డ బారాజ్ ఏడవ బ్లాక్ లో పిల్లర్ల కుంగుబాటు, పగుళ్లకు సంబంధించి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులను కాళేశ్వరం జ్యూడిషియల్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, బ్లాక్ సెవెన్ కుంగుబాటు పై కమిషన్ 2025 జనవరిలో ఎల్ అండ్ టీ ప్రాజెక్టు డైరెక్టర్ రామ‌కృష్ణ రాజు, వైస్ చైర్మన్ సురేశ్ లను పలు ప్రశ్నలు వేసింది. బరాజ్ నిర్మాణంలో నాణ్యత పాటించరా అని అడగ్గా, పూర్తి నాణ్యతతో నిర్మాణం చేశామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. నీటి పారుదల శాఖ అందచేసిన డిజైన్లు, డ్రాయింగ్ ప్రకారమే నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. డిజైన్ లో అంచనా వేసిన ప్రవాహ వేగంకంటే ఎక్కువగా ఉన్నందునే ఆనకట్ట దిగువన ఆఫ్రాన్, సీసీ బ్లాక్ లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇవి దెబ్బతినడంతోనే బ్లాకులు కుంగాయని సమర్థించుకున్నారు. మొదటి సీజన్‌లో నీటి నిల్వ చేసిన తరువాతే సమస్యలు తలెత్తాయని ఎల్ అండ్ టీ వివరించింది. ఈ సమస్యల పరిష్కారం కోసం డిజైన్లు ఇవ్వాలని నీటి పారుదల శాఖ ను ఎన్నిసార్లు కోరినా, నాలుగేళ్ల నుంచి కనీస స్పందన రాలేదన్నారు. 2019లోనే లోపాలను పరిష్కరించి ఉంటే మేడిగడ్డకు ఇంతటి ప్రమాదం వాటిల్లేది కాదని కమిషన్ కు వివరించారు. దాని ప్రభావం ఏడో బ్లాక్ పై పడి ఉండవచ్చనే అనుమానం వ్యక్తపరిచారు. తాము ఎలాంటి సబ్ కాంట్రాక్టులు ఇవ్వలేదని, పనులు పూర్తయినట్లు ధృవీక‌ర‌ణ ప‌త్రం కూడా ఇచ్చారని వాటిని సమర్పించారు. డిఫెక్ట్ లయబిలిటి ఇప్పటికీ గడువు పూర్తయిందని చెప్పగా, కుంగిన బ్లాక్ ను రిపేర్ చేయవచ్చా అని ప్రశ్నించగా, ఎల్ అండ్ టీ పొంతన లేని సమాధానాలు చెప్పిన విషయం తెలిసిందే.

ఎల్ అండ్ టీ నుంచి రికవరీ చేయించాల్సిందే

నిర్మాణ వైఫల్యానికి కారణమైన ఎల్ అండ్ టీ నుంచి ఏడో బ్లాక్ నిర్మాణ వ్యయాన్ని వసూలు చేయాలని తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2025 మార్చి నెలలో ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించింది. మేడిగడ్డ బరాజ్ ను 8 బ్లాకులు గా, 85 పిల్లర్లతో నిర్మాణం చేశారని, రూ.4,613 కోట్లతో కాంట్రాక్టు అగ్రిమెంటు కుదుర్చుకున్నారని తెలిపింది. ఏడో బ్లాక్ లో మొత్తం 11 పిల్లర్లు ఉండగా, వాటి పునర్ నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని ఎల్ అండ్ టీ నుంచి రికవరీ చేయాలని స్పష్టం చేసింది.

కాళేశ్వరం కమిషన్ కూడా

తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఎల్ అండ్ టీ పై తీవ్ర ఆరోపణలు చేసింది. మేడిగడ్డ బరాజ్ లో ఏడో బ్లాక్ పూర్తిగా దెబ్బతిన్నదని, ఈ బ్లాక్ మరమ్మతుకు అయ్యే వ్యయాన్ని ఎల్ అండ్ టీ నుంచి రికవరీ చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రాజెక్టులో నాణ్యత అనేది లేదని, ప్రీ మాన్ సూన్, పోస్టు మాన్ సూన్ తనిఖీలను కూడా పూర్తిగా విస్మరించారని తేల్చింది.

ఇవన్నీ గమనించే ఎల్ అండ్ టీ కి రాం రాం

ఈ పరిణామాలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో తప్పులను కప్పి పుచ్చుకునేందుకు మెట్రో రైలు నష్టాల బారిన పడిందని, నడపలేకపోతున్నామని లేఖలు రాయడాన్ని కూడా ప్రభుత్వం సహించలేక పోయిందంటున్నారు. రెండో దశలో భాగస్వామ్యం కావాలన్నప్పుడు కూడా లేనిపోని పేచీలు పెట్టిందంటున్నారు. లేఖలు రాయడం, మీడియాకు లీకులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చికాకు పెట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ గమనించి, లోతుగా విచారణ జరిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పినట్లు నడుచుకుంటున్నారని, అందుకే మెట్రో రైలు విస్తరణకు అనుమతులు రావడం లేదని బహిరంగంగా విమర్శించిన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వెళ్తామని అదే పనిగా చెబుతున్న ఎల్ అండ్ టీ ను ఇక కొనసాగించడం కష్టమనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారంటున్నారు. ఇలాంటి సంస్థతో సంప్రదింపులు అనవసరం అనే నిర్ణయానికి వచ్చి తెగతెంపులు చేసుకున్నారని సచివాలయ వర్గాలు అనుకుంటున్నాయి.

Exit mobile version