Hyderabad Rain Traffic Problem | విధాత, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాకాలంలో రోడ్లపై వరదనీరు ప్రవహించకుండా ఉండేందుకు రోడ్డు కింద బావులు (వరదనీటి సంపులు) నిర్మాణం చేయాలని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. వరదనీటి ముప్పు అధికంగా ఉన్న 23 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వీటిని నిర్మించాలని ప్రతిపాదించారు. 11 చోట్ల రూ.13.99 కోట్లతో పనులు ప్రారంభించి 10 ప్రాంతాల్లో పూర్తి చేశారు. మిగిలిన 12 ప్రాంతాల్లో కేబుళ్ళు, డ్రైనేజీ లైన్లు అడ్డుగా ఉండటంతో బావుల నిర్మాణం సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చారు. అయితే గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వర్షపునీటితో నిండిపోయి ఎప్పటిమాదిరే మోకాలు లోతు నీటితో రోడ్లు కమ్ముకునిపోయాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు, ఏం ప్రయోజనం అని నగర పౌరులు పెదవి విరుస్తున్నారు.
10 ప్రాంతాల్లో రోడ్డు కింద బావులు పూర్తి
మహా నగరంలో అందమైన రోడ్ల నిర్మాణం, హోర్డింగులను ఏర్పాటు చేస్తూ, వర్షపు నీటి పైపులైన్ల ఆధునీకరణ, నిర్మాణం పూర్తిగా మర్చిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రతి వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం కావడం, మోకాలు లోతు నీటితో నిండిపోవడం, గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ తో నగర జనజీవనం పూర్తిగా స్థంభించిపోతున్నది. గత పది రోజులుగా కురురుస్తున్న వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో రెండు గంటలకు పైగా వాహనదారులు రోడ్లపైనే నిల్చుండిపోయారు. రాష్ట్ర మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి మంత్రి ఎవరూ లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), ట్రాఫిక్ పోలీసులు, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (టీజీఎస్పీడీసీఎల్) కు వరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తప్ప గ్రేటర్ ఉన్నతాధికారులు స్పందించే పరిస్థితిలో లేరని అంటున్నారు. నగర ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తన స్వంత పనులను, పైరవీలను గ్రేటర్ అధికారులతో చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారని నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకుడొకరు విమర్శించారు. కరీంనగర్‌కు చెందిన ఆయనకు నగరంపై ఏం మమకారం ఉంటుందని నిలదీశారు. నగరంలో వర్షాలు పడిన ప్రతి సందర్భంలో రోడ్లు జలమయం అయి జనజీవనం అతలాకుతలం అవుతోంది. సెంటిమీటర్ వర్షం కురిస్తే కోర్ ఏరియాలో వాహనదారులు అడుగు ముందుకు వేయడం కష్టంగా మారింది. ఈ దుస్థితిని గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది రోడ్డు కిందకు వర్షపునీరు త్వరగా ఇంకిపోయేందుకు బావులు (సంపులు) నిర్మాణం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రయోగాత్మంగా గ్రేటర్ పరిధిలో సుమారు 144 రోడ్డు కింద బావులను రూ.150 కోట్లతో నిర్మాణం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలి విడత కింద ఖైరతాబాద్ జోన్ పరిధిలో 10, మిగతా ప్రాంతాల్లో మరో 13 నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. నిర్మాణానికి అనువుగా 11 మాత్రమే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి టెండర్లు పిలిచారు. ఇందులో 10 రోడ్డు కింద బావులు మాత్రమే పూర్తయ్యాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదురు సర్కిల్‌లో రెండు వైపులా రెండు, సచివాలయం, ఖైరతాబాద్‌లో ఒకటి అందులో కొన్ని. కనిష్ఠంగా రెండున్నర లక్షల లీటర్లు, గరిష్ఠంగా పది లక్షల లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించి, వర్షాకాలానికి ముందే అందుబాటులోకి తెచ్చారు. అందుబాటులో ఉన్న స్థలం బట్టి ఇరవై అడుగుల లోతు వరకు బావులు నిర్మాణం చేశారు. దీనిపైన స్లాబ్ వేసి నీరు లోపలికి వెళ్ళేందుకు వీలుగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు.
రెండు సెంటిమీటర్ల వర్షానికే సరిపోతాయి
వర్షాలు కురిసినప్పుడు వరదనీటిని అంచనా వేసి, సగటు అంచనా ప్రకారంగా నిల్వ సామర్థ్యం ఖరారు చేశామంటున్నారు ఇంజినీర్లు. ఇక్కడి వరకు బాగానే ఉంది. గత పది రోజులుగా నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. కనిష్ఠంగా ఐదు సెంటిమీటర్లు, గరిష్ఠంగా 13 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతున్నది. ఈ మూల.. ఆ మూల అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ గంటల కొద్దీ వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేశాయి. ముందుకు వెళ్దామంటే దారి ఉండదు, వెనక్కి వెళ్దామంటే ఖాళీ లేదు అనే విధంగా వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. రాజ్ భవన్‌కు సమీపంలోని ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ఒక రోజు రాత్రి గంటన్నరకు పైగా వాహనాలు ఎక్కడికక్కడి ఆగిపోయాయి. ఈ నరకాన్ని చూసిన పలువురు బయటకు ఎందుకొచ్చామా అని లోలోపల తిట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఆటోలో వెళ్దామంటే ఒక్క ఆటో కన్పించదు. క్యాబ్ బుక్ చేస్తే స్పందన రాదు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ఇరువైపులా రోడ్డు కింద రెండు బావులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. రెండూ నిండిపోవడంతో రోడ్డుపై ఎప్పటి మాదిరే మోకాలు లోతు నీరు నిల్వ ఉందని వాహనదారులు వాపోయారు. ఏ ఉద్ధేశంతో వాటిని కట్టారో, ఆ లక్ష్యం నెరవేరడం లేదంటున్నారు. భారీ వర్షాలు వస్తే రోడ్డు కింద బావులు నిండిపోతాయని, ఏం చేయలేమని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. రెండు సెంటిమీటర్లు మించి వర్షం కురిస్తే రోడ్డు కింది బావులు నిమిషాల వ్యవధిలో నిండి, పొంగిపొర్లుతాయంటున్నారు. ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని నిర్మాణం చేశాం, శాశ్వత పరిష్కారం కాదని అంగీకరించారు. ఇప్పటికైనా వర్షపునీరు రోడ్లపై నిలువ ఉండకుండా వరదనీటి పైపులైన్లు నిర్మించడంతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.
కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనా!
వర్షపునీటి అధిక ముప్పు ఉన్న 144 ప్రాంతాలను గుర్తించిన గ్రేటర్ హైదరాబాద్ ఇప్పటికే 10 రోడ్డు కింది బావులు నిర్మించగా, మరోటి నిర్మాణ దిశలో ఉంది. మిగిలిన 134 రోడ్డు కింది బావుల నిర్మాణానికి గ్రేటర్ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. గత పది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు, ప్రజల ఇబ్బందులు పరిగణనలోకి తీసుకుని 134 ప్రాంతాలను త్వరలో ఎంపిక చేసి టెండర్లు ఆహ్వానించారు. అయితే ఇప్పటి వరకు నిర్మించిన రోడ్డు కింది బావులు ఏ మేర పనిచేస్తున్నాయి?; లోపాలు ఏంటి? అనేది గ్రేటర్ ఉన్నతాధికారులు శాస్త్రీయంగా నిర్థారణకు రావడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇంజినీరింగ్, వర్షపునీటి వరదపై అవగాహన ఉన్న వారితో కమిటీ వేసి 10 బావులపై అధ్యయనం చేసి, లోపాలను సరి చేసుకుని మిగతా వాటిని నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. లేదంటే కాంట్రాక్టర్లను పోషించేందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేయడం తప్ప మరోటి కాదని అంటున్నారు. పది సెంటిమీటర్ల వరకు వర్షం కురిసినా నీరు రోడ్డు పై నిలువ ఉండకుండా, ఆగకుండా నిర్మాణాలు ఉండాలని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.