Telangana | అందెశ్రీ గేయంపై రచ్చ రాజకీయాలు

ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఎంపిక చేయగా, ఆ గీతానికి సంగీత బాణీ కట్టే బాధ్యత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగింత వివాదం హాట్‌టాపిక్‌గా మారింది

  • Publish Date - May 29, 2024 / 07:30 PM IST

కీరవాణికి బాణీ బాధ్యతపై రగడ
తెలంగాణ సంగీత దర్శకులు లేరా?
తెలంగాణ మ్యూజిషియన్స్‌ లేఖ
గీత స్వర కల్పనకు ఇప్పుడేం అవసరమొచ్చింది?
బీఆరెస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
కీరవాణికి బాధ్యతలు అప్పగిస్తే తప్పేంటి?
జాగృతి బతుకమ్మ పాట రెహమాన్‌కు ఇవ్వలేదా
దానికి డైరెక్టర్‌ మలయాళీ మీనన్‌ కాదా?
అప్పుడెటుపాయే బీఆరెస్‌ చెబుతున్న ఆత్మగౌరవం?
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

(విధాత ప్రత్యేకం)

ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఎంపిక చేయగా, ఆ గీతానికి సంగీత బాణీ కట్టే బాధ్యత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగింత వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాంతీయ వాదం.. ఆత్మగౌరవం కోణంలో ప్రతిపక్ష బీఆరెస్, తెలంగాణ మ్యూజిషియన్ అసోసియేషన్స్ దీనిపై అభ్యంతరాలు లేవనెత్తాయి. తెలంగాణ రాష్ట్ర గీతం బాణీల బాధ్యత ఏపీ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడమంటే తెలంగాణ ప్రజలను అవ‌మానప‌ర్చడ‌మేనని వాదించాయి.

తెలంగాణ ఆత్మగౌరవమైన జ‌య‌జ‌య‌హే తెలంగాణ‌ పాట‌ను కంపోజ్ చేసేందుకు తెలంగాణ సంగీత దర్శకులు ఎవరు లేరా? అని ప్రశ్నిస్తూ అసోసియేషన్‌ లేఖ రాసింది. బీఆరెస్ నేత, మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌ కుమార్ సైతం తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై అభ్యంతరం తెలిపారు. గీత స్వర కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిందని ప్రవీణ్‌ ట్వీట్ చేశారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమన్న ఆయన.. కీరవాణి స్వరకల్పన చేయడానికి నాటు నాటు పాట కాదని ఎద్దేవా చేశారు.

ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ చిట్ చాట్‌లో స్పందిస్తూ రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి ఇచ్చామని, అందెశ్రీ ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని, ఏ సంగీత దర్శకుడిని పెట్టి చేయాలనేది తన పని కాదని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రేవంత్ సర్కార్‌ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పాలనకు గుర్తులని, వాటిని తొలగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ చిహ్నం రూపకల్పన బాధ్యతను నిజామాబాద్ వ్యక్తికి అప్పగించారు. ఇదంతా పక్కన పడితే కీరవాణికి తెలంగాణ రాష్ట్ర గీతం సంగీత బాధ్యతలు అప్పగిస్తే తప్పేమిటన్న చర్చ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నది. అధికారంలో లేనప్పుడే బీఆరెస్ వర్గాలకు ఆత్మగౌరవం, ప్రాంతీయ వాదం గుర్తొస్తాయంటూ పలువురు బీఆరెస్ ప్రభుత్వ పదేళ్ల పాలనా కాలంలో ఆత్మగౌరవం.. ప్రాంతీయవాదానికి సంబంధించి చేసిన ఉల్లంఘనలు ఏకరువు పెడుతూ చాకిరేవు పెడుతున్నారు.

అప్పుడెటు పాయే ఆత్మగౌరవం?

కీరవాణికి తెలంగాణ రాష్ట్ర గీతం బాణీల కూర్పు అప్పగిస్తే తెలంగాణ ఆత్మగౌరవం పోతుందన్న వారు మ‌రి.. కవితక్క సారథ్యంలో తెలంగాణ జాగృతి నిర్మించిన బతుకమ్మ పాటకు తమిళ వ్యక్తి ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందించినప్పుడు, మలయాళీ డైరెక్టర్‌ గౌతమ్ మీనన్‌ దర్శకత్వం వహించినప్పుడు, పరభాష నటులంతా నటించినప్పుడు మన ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మౌనరాగం పట్టిన వారు ఇప్పుడు మన తెలుగు.. తెలంగాణ పాటకు మన తెలుగోడు కీరవాణి మాత్రం సంగీతం చేయొద్దనడంలో ఔచిత్యం ఏమిటో వారికే తెలియాలంటూ చురకలు వేశారు.

ఆరెస్ ప్రవీన్‌ ఐపీఎస్ పేరుతో వ‌చ్చిన సినిమాకు శ్రీ‌కాకుళానికి చెందిన ఎన్‌. ఎస్‌.ప్ర‌సూ అనే సంగీత ద‌ర్శ‌కుడిని ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ‌లో సంగీతం తెలిసిన మొన‌గాడే మీకు క‌నిపించ‌లేదా? అప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ సార్ బూట్ల‌కింద దాచిపెట్టారా? మీరు చేస్తే సంసారం.. ఎదుటివాళ్లు చేస్తే వ్య‌భిచార‌మా? అంటూ పలువురు నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. భారతదేశ కీర్తిని ప్రపంచ వేదికపై సగర్వంగా ఎగురవేసి, ఆస్కార్ అవార్డు సాధించి తెలుగుజాతి కీర్తి పతాక ఎగురవేసిన కీరవాణి రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చుతుంటే అది తప్పనడం అర్ధరహితమని తలంటుతున్నారు.

కీరవాణి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టారని, చెన్నైలో పెరిగారని, గత 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారని ఆ మాటకు వస్తే బీహార్ మూలాలు ఉన్న కేసీఆర్ (ఈ మాట మేం అనడం లేదని, 2009 టీవీ5 లో వైసీపీ పార్టీ కి చెందిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు ఇంటర్వ్యూలో కేసీఆరే చెప్పిండు) తెలంగాణను ఏలితే తప్పు లేదా? అని ప్రశ్నాస్త్రం వేస్తున్నారు. కళలకు హద్దులు, సరిహద్దులు లేవంటారని, బుద్ధులు సంకుచితం ఐనప్పుడు హద్దులు పుట్టుకు వస్తాయని చురకలేస్తున్నారు. తెలంగాణ గీతం రాసినవాడు నికార్సైన తెలంగాణ బిడ్డ అని, ఆయనకు కేసీఆర్ పాలన పదేళ్లలో కనీస గుర్తింపు లేదని, రాష్ట్ర గీతాన్ని పక్కన పడేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పాటను అధికారిక అంబారీని ఎక్కించి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టాభిషేకం కడుతుంటే, ఆయనే స్వయంగా కీర‌వాణికి ట్యూన్ చేయ‌మంటే మీకు ఏడుపులెందుకని నిలదీస్తున్నారు.

వారు ఆంధ్రులే కదా!

తెలంగాణ భవన్ కట్టే కాంట్రాక్టును శ్రీకాకుళం మేస్త్రీలకు ఇవ్వడం మీకు తప్పు కానప్పుడు, రాష్ట్ర సచివాలయం కట్టే కాంట్రాక్టును మధ్య ప్రదేశ్ కాంట్రాక్టర్‌కు ఇవ్వడం మీకు తప్పుగా కనిపించనప్పుడు కీరవాణి పట్ల వివాదం ఎందుకన్న చర్చ సాగుతున్నది. గోదావరి జిల్లాలకు చెందిన చిన జీయర్‌ను తీసుకువచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిననప్పుడు మీకు తప్పు కనిపించలేదా? యాదగిరి గుట్ట గుడి పునరుద్ధరణకు ఆంధ్రా వ్య‌క్తి ఆనంద‌ సాయితో డిజైన్ రూపొందించినప్పుడు, లక్ష కోట్ల కాళేశ్వరం కాంట్రాక్టును ఆంధ్రాకు చెందిన మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టి, బరాజ్‌ సైట్ దగ్గర శాలువాలు కప్పి కృష్ణారెడ్డిని సన్మానించినప్పుడు మీకు తప్పు కనిపించలేదా? అప్పుడెక్కడ పోయింది తెలంగాణ ఆత్మగౌరవం? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ స్పెషల్ ఫ్లైట్ లో ఆంధ్రాకు పోయి జబర్దస్త్ రోజా ఇంట్లో చేపల పులుసు తిని, కృష్ణా నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానన్నప్పుడు మీకు తప్పు కనిపించలేదా? ఆంధ్రాకు చెందిన రైతులను తన ఫాంహౌస్ కు పిలిపించుకుని రోజుల తరబడి వాళ్లతో వ్యవసాయం ఎలా చేయాలనే చర్చలు పెట్టినప్పుడు మీకు ఆత్మగౌరవం సమస్య తలెత్తలేదా? అని నిగ్గదీస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం ఒంటికి నిప్పు అంటించుకున్న కుటుంబాలకు సెంటు భూమి ఇవ్వలేదు కానీ, విశాఖకు చెందిన స్వామికి హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం భూమి ధారాదత్తం చేయడం మీకు తప్పుగా కనిపించలేదా? అని నిలదీస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత కేసీఆర్‌, కేటీఆర్‌ తెలంగాణ ప్ర‌జ‌లు అత్యాశ‌ప‌రుల‌ని, ఆలోచ‌న‌లేనివార‌ని, ఆంధ్రా ప్ర‌జ‌లు తెలివైన‌వారు కాబట్టే జీహెచ్ఎంసీ ప‌రిధిలో బీఆరెస్‌కు ప‌ట్టం క‌ట్టార‌ని టీవీ చర్చ‌ల్లో మాట్లాడినప్పుడు మన ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తిన‌లేదా అని ప్రశ్నల తూటాలే పేలుస్తున్నారు. మెట్రోతోపాటు, జీహెచ్ ఎంసీ పార్కులు, ఖాళీ స్థ‌లాల నిర్వ‌హ‌ణ‌, సుంద‌రీక‌ర‌ణ కాంట్రాక్టుప‌నుల్లో అడ్డ‌గోలుగా దోచుకోమ‌ని నెల్లూరుకు చెందిన నితిన్‌రెడ్డికి అప్ప‌గించిన‌ప్పుడు మీకు ఆత్మ‌గౌర‌వం క‌నిపించ‌లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడెందుకీ ఆత్మగౌరవ రగడ?

కీరవాణికి సంగీత బాధ్యతలపై “జయ జయహే” గీత రచయిత అందెశ్రీకి లేని అభ్యంతరం తెలంగాణ బీఆరెస్ వర్గాల వారికి ఎందుకొచ్చిందన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప‌దేళ్లు రాష్ట్ర గీతాన్ని గుర్తించ‌ని కేసీఆర్ సర్కార్‌పై ప‌ల్లెత్త‌నివారు…కీర‌వాణి ట్యూన్ చేయ‌డంపై గోల చేయ‌డం వెనుక రాజ‌కీయం ఏమిటన్నదానిపై రచ్చబండ చర్చలు సాగుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండి “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికం చేయనందుకు కేసీఆర్ తలవంచుకుని సిగ్గు పడాలంటున్నారు నెటిజన్లు.

ఫోన్‌ట్యాపింగ్… లిక్కర్ కేసు.. కాళేశ్వరం అవినీతి అంశాలను తెరమరుగు చేసే ప్రచార కుట్రలో భాగంగానే అందెశ్రీ పాటకు కీరవాణి సంగీతంపై బీఆరెస్ వర్గాలు రచ్చ చేస్తున్నాయన్న వాదన వినిపిస్తున్నారు. చిత్రంగా బీఆరెస్ రాజకీయ ట్రాప్‌లో కొంద‌రు క‌వులు, ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు, జ‌ర్న‌లిస్టులు ప‌డ‌ట‌మే ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నారు. తెలంగాణ‌తో పాటు దేశాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పురోగ‌తి సాధించారు. ప్ర‌వీణ్‌రావు, తిరుప‌త‌న్న‌, భుజంగరావు, రాధాకిషన్‌రావుల నేర అంగీకార వాంగ్మూలంలో స్ప‌ష్టంగా కేసీఆర్ స‌ల‌హాలు, ఆదేశాల మేర‌కే ఫోన్లు ట్యాప్ చేసిన‌ట్లు ఒప్పుకున్నారు.

రేవంత్‌రెడ్డి కుటుంబ‌ స‌భ్యుల‌తోపాటు, విప‌క్ష నేత‌లు, మీడియా అధిప‌తులు, జ‌ర్న‌లిస్టులు, ఉద్మ‌కారుల ఫోన్ల‌ను ఎవ‌రెవ‌రివి ట్యాప్ చేసింది.. ఎక్కడెక్కడ ప్రతిపక్ష నేతల డబ్బులు పట్టుకున్నది పూస‌గుచ్చిన‌ట్లు నేర అంగీకార ప‌త్రం (క‌న్ఫెష‌న్ స్టేట్‌మెంట్‌)లో రికార్డు చేశారు. ఇది బీఆరెస్‌కు చాలా నష్టదాయకమైన పరిణామం. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టు, వ‌రుస అప‌జయాల‌తో కుంగిపోయిన బీఆరెస్‌కు ఈ వార్త‌లు మ‌రింత భ‌య‌పెట్టాయ‌ని చెబుతున్నారు.

ఈ అంశాన్ని వీలైనంత వ‌ర‌కు జ‌నం దృష్టి మ‌ర‌ల్చేందుకే అందెశ్రీ పాటపై వివాదాన్ని రాజేసిన‌ట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. కొంత‌మంది త‌మ అనుకూల వ్య‌క్తుల ద్వారా దీనిపై ట్రోల్స్‌, సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులుపెట్టి తెలంగాణ ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య‌గా చిత్రీక‌రించే కుట్ర‌కు తెర‌లేపిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనేకాదు, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ బీఆరెస్‌ను తెలంగాణ ప్ర‌జ‌లు చావు దెబ్బ‌కొట్ట‌బోతున్నారని, ఈ దుస్థితి నుంచి గ‌ట్టెక్క‌డానికి బీఆరెస్ మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంటు ర‌గిలించేందుకు అందెశ్రీ పాట వివాదాన్ని తెలివిగా మార్కెట్లోకి తెచ్చింద‌న్నది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

Latest News