జెడ్పీ పీఠాల కోసం వారసుల పోటీ! లోకల్‌ పోల్స్‌తో రాజకీయ అరంగేట్రం

స్థానిక సంస్థలపై కోర్టు కేసులు ఎలా ఉన్నప్పటికీ.. కొందరు రాజకీయ నాయకులు తమ వారసులతో ఈ ఎన్నికల సందర్భంగా రాజకీయ అరంగేట్రం చేయించేందుకు సిద్ధమవుతున్నారని చర్చలు జరుగుతున్నాయి.

హైదరాబాద్, అక్టోబర్‌ 5 (విధాత ప్రతినిధి) :

Political Successors Local Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల కారణంగా ప్రముఖ అభ్యర్థుల పోటీపై కొంత స్తంబ్దత నెలకొంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఔత్సాహిక అభ్యర్థుల పేర్లను రాష్ట్ర పార్టీ నాయకత్వం .. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రుల ద్వారా తెప్పించుకుంటున్నదని సమాచారం. ఒక్కో సీటుకు ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలని సూచించారని తెలిసింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత కసరత్తు జరుగుతున్నది. రాజకీయంగా తమ వారసులను స్థానిక ఎన్నికల ద్వారా ప్రవేశింప చేసేందుకు పలువురు సీనియర్ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తమ వారసులను బరిలో దింపేందుకు సన్నద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు వచ్చిన తరువాత ఎవరెవరు రంగంలో ఉంటారనేది మరింత స్పష్టత రానున్నది.

పెద్దపల్లి, జగిత్యాల, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు జనరల్ కోటాలో ఉన్నాయి. మొత్తం 33 జిల్లాలకు గాను 31 జిల్లాల చైర్మన్ పదవులకు మాత్రమే రిజర్వేషన్లు ఖరారు చేసి, జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జిల్లా పట్టణ ప్రాంతం కావడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఉండదు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం లేదు. మహబూబాబాద్ నుంచి తన కుమారుడిని రాజకీయ ఆరంగేట్రం చేయించడానికి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పావులు కదుపుతున్నారని సమాచారం. ఇంతకు ముందు ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా 2004 నుంచి 2009 వరకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. నరేందర్ రెడ్డి స్వస్థలం కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామం. కుమారుడు కృష్ణ కీర్త‌న్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. కామారెడ్డి జెడ్పీ చైర్మన్ కూడా జనరల్ కోటాలో ఉండటంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి బరిలో ఉండవచ్చంటున్నారు. బీర్కూర్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయించి చైర్మన్ గా కూర్చోబెట్టాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన శ్రీనివాస్ రెడ్డి, ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

నిజామాబాద్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో ఈ సీటు పై మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కన్నేశారంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా పీఠం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఈ సీటు దక్కించుకునేందుకు ఆరోగ్య శాఖ మంత్రి సీ దామోదర రాజనర్సింహ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తన కుమార్తెను జెడ్పీటీసీగా గెలిపించి ‘చైర్‌’లో కూర్చోబెట్టవచ్చని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం చౌటకూరు నుంచి త్రిషను పోటీ చేయించనున్నారని సమాచారం. మెదక్ కూడా జనరల్ కేటగిరీలో ఉండడంతో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి లేదా ఆయన కుటుంబం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యాదాద్రి – భువనగిరి జిల్లా ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఇక్కడి నుంచి ఆలేరు ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య కుటుంబం నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయిలయ్య అన్న భార్య బీర్ల శివాణి రంగంలో ఉండవచ్చని ప్రచారం ఉంది. రాష్ట్రంలోనే బలమైన జెడ్పీ గా రంగారెడ్డి జిల్లాకు పేరున్నది. అయితే ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తన భార్య లేదా కోడలిని పోటీ చేయించవచ్చని అంటున్నారు. పెద్దపల్లి జెడ్పీ పీఠం కోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్ మఖాన్ సింగ్ ఠాకూర్ తన భార్య మనాలీ ఠాకూర్ పోటీకి దించవచ్చని చెబుతున్నారు. ఇక్కడ జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. అంతర్గాం జెడ్పీటీసీగా గెలిపించుకునేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. గద్వాల జిల్లా చైర్మన్ సీటు ఎస్సీ జనరల్ గా కేటాయించారు. దీని పరిధిలో గద్వాలతో పాటు అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలంపూర్ నియోజకవర్గం లోనే మూడు ఎస్సీ జెడ్పీటీసీలు రిజర్వ్ కావడంతో ఇక్కడి నుంచి చైర్మన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్ కుటుంబం నుంచి ఒకరికి చైర్మన్ పదవి దక్కవచ్చని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

నల్లగొండ ఎస్టీ మహిళకు కేటాయించడంతో ఈసారి ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రాగ్యా నాయక్ భార్య భారతీ నాయక్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆమె తిరస్కరిస్తే, కాంగ్రెస్ నాయకుడు స్కైలాబ్‌ నాయక్ భార్య పేరును ప్రతిపాదించనున్నారు. అయితే ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడంతో పోటీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ములుగు జెడ్పీ సీటు ఎస్టీ కి రిజర్వ్ చేయడంతో మంత్రి ధనసరి సీతక్క కోడలు కుసుమాంజలి పోటీ లో ఉండే అవకాశం ఉందంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీలో
కామారెడ్డి జెడ్పీ చైర్మన్ కోసం ఒక్కరే పోటీపడుతున్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు శశాంక్ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిజామాబాద్ జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ సీటు కోసం నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కోడలిని రంగంలోకి దింపనున్నారు. లేదంటే ఆయన భార్య పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మెదక్ సీటు జనరల్ కోటాలో ఉండడంతో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఈమెకు జిల్లా వ్యాప్తంగా పట్టు ఉండడం, సత్సంబంధాలు ఉండడం కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఒకవేళ ఆమె వద్దనుకుంటే ఆ కుటుంబుంలోనే మరొకరికి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. ఇక యాదాద్రి – భువనగిరి జిల్లా చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో పోటీ అంతగా లేదు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ తన భార్య సువర్ణను పోటీలో పెట్టేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.

Exit mobile version