నియామకాల్లో గత సర్కార్ అలసత్వం
మరోవైపు ఆకట్టుకున్న కాంగ్రెస్ హామీలు
జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలపై ఆశ
అందుకే బీఆరెస్ ఓటమికి నిరుద్యోగుల కృషి
సాంకేతిక కారణాలతో గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచని ప్రభుత్వం
గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 కూ నిరాకరణ
ముందు ఈ విషయంలో అవగాహన లేదా?
ఇది ఎన్నికల జూమ్లాగానే అనుకోవాలా?
7 నెలల్లోనే నిరుద్యోగుల్లో సర్కారుపై ఆగ్రహం
కొన్నింటిలోనైనా సానుకూలంగా స్పందించకుంటే
భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదు!
(విధాత ప్రత్యేకం)
తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. నీళ్లు, నిధులు విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంత పురోగతి సాధించినా నియామకాల విషయంలో పూర్తిగా అలసత్వం వహించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగులు ఆ పార్టీని ఓడించాలని గ్రామగ్రామాన తిరిగి మరీ ప్రచారం చేశారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ వంటివి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లేలా చేశాయి.
కానీ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో నియామకాల విషయంలో గత ప్రభుత్వం కంటే తక్కువ కాలంలోనే నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూస్తన్నది. నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్బంధకాండను ప్రయోగిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోరి మరీ ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.
గ్రూప్స్ నోటిఫికేషన్లు, పరీక్ష తేదీలతో సహా ఆ పార్టీ వెల్లడించింది. మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ అన్నది. ఇవి ఏడు నెలల కాలంలో అమల్లోకి రాలేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచకపోవడానికి, గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 చొప్పున అవకాశం కల్పించకపోవడానికి సాంకేతిక కారణాలను చూపెట్టింది. అలాంటప్పుడు ఏ మాత్రం అవగాహన లేకుండా తేదీలతో సహా ఎందుకు ప్రకటించారు? ఇది ఎన్నికల జూమ్లాగానే అనుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే మొన్నటివరకు ఇదే అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన వారినీ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
నిరుద్యోగుల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్స్‌లో పోస్టుల పెంపు వంటివి సాంకేతిక, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి అనుకుందాం. మరి పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల వ్యవధి అన్నది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్రభుత్వం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్ కోచింగ్ సెంటర్ల హస్తం?
ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న కొంతమంది దీని వెనుక ఉన్నారనే ఆరోపణలను నిరుద్యోగులు విశ్వసిస్తున్నారు. సదరు వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నది. ఎందుకంటే మొన్న నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం సీఎస్, టీజీపీఎస్సీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్లపై సాధ్యాసాధ్యాలను చర్చించారు. అధికారులు చెప్పిన సాంకేతిక కారణాలనే పరిగణనలో తీసుకుని గ్రూప్స్‌లో పోస్టుల పెంపు, గ్రూప్-1లో 1:100 సాధ్యం కాదని తేల్చారు. ఈ సమావేశానికి ముందే సీఎం ఢిల్లీలోన దీనిపై ఒక ప్రకటన చేశారు.
అంటే ముందే సీఎం డిసైడ్ అయి ఆ తర్వాత తూతూ మంత్రంగా భేటీ ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కొంతమంది విద్యార్థి నేతలు, డాక్టర్ రియాజ్ ఆ సమావేశంలో పాల్గొన్నట్టు సీఎంవో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ సందర్భంగానే డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలనే నిరుద్యోగుల విజ్ఞప్తిని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగానే విద్యా శాఖ డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది.
అంటే నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు అంటూనే ప్రభుత్వం వారి నిరసనలను, ఆందోళనలను, విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని కొన్నిరోజులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల బట్టి స్పష్టమౌతున్నది. ఇక జాబ్ క్యాలెండర్ అనేది ఈ ఏడాది సాధ్యం కాదు. ఇప్పటికే సగం నెలలు గడిచిపోయాయి. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నా నిరుద్యోగులు విశ్వసించే పరిస్థితి ఉండదు.
రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుని కొన్నింటిపైనా అయినా సానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే రుణమాఫీ, రైతు భరోసా వంటి విషయాలపై ఇప్పటికే విపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు నిరుద్యోగుల అంశం కూడా ఆ పార్టీకి ఆయుధంలా చేతికి వచ్చింది. వీటికి తోడు ఫిరాయింపులపై గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎండగట్టింది.
దానికి ప్రజామోదం కూడా లభించింది. ఇప్పుడు ఆ పార్టీనే ఫిరాయింపు రాజకీయాలు చేస్తుండటం వల్ల అది బీజేపీకి అనుకూలంగా మారవచ్చు. పార్లమెంటు ఈ అంశంపై బీజేపీని నిలదీస్తే తెలంగాణలో మీ పార్టీ చేస్తున్నది ఏమిటి అంటే సమాధానం చెప్పలేని స్థితిని వీళ్లే కల్పిస్తున్నారు. కాబట్టి నిరుద్యోగుల అంశంతో పాటు ఫిరాయింపులు రానున్న రోజుల్లో కాంగ్రెస్‌పార్టీకి లేని తలనొప్పులు తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చికిత్స కంటే నివారణ మంచిది అనే సూత్రాన్ని అనుసరించి ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.