- ఏపీలో పోలీసుల విస్తృత దాడులు
- 31 మంది మావోయిస్టుల అరెస్టు
- ఇందులో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ టీం
- అదుపులో 22 మంది హిడ్మా టీం
- తాజా సంఘటనతో అనుమానాలు!
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడున్నారనే చర్చసాగుతోంది. ఆంధ్రపదేశ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతమైన మారేడుమిల్లి టైగర్ ఫారెస్టులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు పార్టీ నేత హిడ్మాతో పాటు ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో దేవ్ జీ ఎక్కడున్నారనే చర్చ ప్రారంభమైంది. దేవ్ జీ ఈ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక షెల్టర్ లో హిడ్మా చిక్కగా దేవ్ జీ ఏమైనా తప్పించుకున్నారా? అనే రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు అనుమానాలతో పాటు ఆరోపణలు చేస్తున్నాయి.
ఏపీలో 31 మంది మావోయిస్టుల అరెస్టు
మావోయిస్టు పార్టీ నేత, పీఎల్జీఎ మొదటి బెటాలియన్ కమాండర్ హిడ్మా, ఆయన భార్య హేమ, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ నాయకుడితోపాటు ఆరుగురు.. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో మంగళవారం ఉదయం చనిపోయినట్లు ఏపీ ఇంటెలీజెన్సీ చీఫ్ లడ్డా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని ఐదు జిల్లాల్లో మావోయిస్టుల కోసం వేట సాగుతోందన్నారు. ఇందులో విజయవాడ ఆటోనగర్, కాకినాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు, టాస్క్‌ఫోర్సు బృందాలు దాడిచేసి 31 మందిని అరెస్టు చేసినట్లు, వారి నుంచి డంప్ లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అరెస్టైన వారిలో 9 మంది మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ దేవ్ జీ సెక్యూరిటీ టీం మెంబర్లు ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారంతా హిడ్మా టీమ్ మెంబర్లు అని తెలిపారు. ఈ మేరకు విజయవాడ ఎస్పీ విద్యాసాగర్ కూడా విజయవాడ ఆటోనగర్ లోని ఒక ఇంట్లో నుంచి 27 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని ఇందులో 23 మంది మహిళలు, మిగిలిన వారు పురుషులని వెల్లడించారు.
దేవ్ జీ సెక్యూరిటీ టీం అరెస్టు
ఏపీలోని కాకినాడ, విజయవాడల్లో అరెస్టు చేసిన 31 మంది మావోయిస్టుల్లో 9 మందిని దేవ్ జీ సెక్యూరిటీ టీం సభ్యులుగా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో దేవ్ జీ ఎక్కడున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా సెక్యూరిటీ టీం లేకుండా మావోయిస్టు పార్టీ చీఫ్ ఉండరనేది చెబుతున్నారు. ఆయన సెక్యూరిటీ టీం సభ్యులు అరెస్టు అయితే దేవ్ జీ ఈ అరెస్టు నుంచి తప్పించుకున్నారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆయన టీం సభ్యులు మాత్రమే షెల్టర్ లో ఉంటే దేవ్ జీ మరో చోట భద్రంగా ఉన్నారా? అనే చర్చసాగుతోంది. హిడ్మా టీం సభ్యులు విజయవాడలో అరెస్టు కాగా, హిడ్మా మాత్రం మారేడుమిల్లిలో ఎన్ కౌంటర్‌లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేవ్ జీ సేఫ్‌గానే ఉన్నారా? లేక ఆయన కూడా పోలీసు వలలో చిక్కుకున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మావోయిస్టు పార్టీ చరిత్రలో పలువురు ముఖ్యనాయకులు పోలీసు వలలో చిక్కుకుని తృటిలో తప్పించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పోలీసులు అరెస్టు చేశారనే అనుమానంతో ముందు ప్రకటనలు విడుదల చేసి తర్వాత క్షేమంగా ఉన్నట్లు ప్రకటించిన సంఘటనలున్నాయి. మారెడుమిల్లి ఎన్ కౌంటర్, ఏపీలో హిడ్మా, దేవ్ జీ సెక్యూరిటీ టీం సభ్యుల అరెస్టు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఏం జరిగిందనే అనుమానాలు వీడవంటున్నారు.
ఇక టార్గెట్ దేవ్ జీ..
హిడ్మా ఎన్‌కౌంటర్ లో మృతిచెందడం, 31 మంది ఆయన టీంతో పాటు, దేవ్ జీ సెక్యూరిటీ సభ్యుల అరెస్టు నేపథ్యంలో ఇప్పుడు భద్రతాబలగాలు, పోలీసుల టార్గెట్ దేవ్ జీ వైపు మళ్లింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ చీఫ్ గా దేవ్ జీ లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. చత్తీస్ గడ్ లో కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీ నాయకులు దేవ్ జీ అలియాస్ తిరుపతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని పోలీసులకు ఆయధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపల్లి వాసుదేవరావులు వ్యతిరేకించినట్లు ప్రచారం సాగింది. ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయిన కేంద్ర కమిటీ నాయకుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ ని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఆయన నేతృత్వంలో పార్టీ పనిచేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Hidma Encounter | ఎన్‌కౌంటరేనా?.. హిడ్మా మరణంపై పలు అనుమానాలు!
SC Classification | జస్టిస్ గవాయ్ ప్రసంగంతో మళ్లీ చర్చనీయాంశంగా ఎస్సీ క్రీమీలేయర్!
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి.. ప్రభుత్వానికి ఔట్‌సోర్సింగ్ జేఏసీ విజ్ఞప్తి
