రెండో విడుతలోనూ బీజేపీకి అగ్నిపరీక్షే!

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడుత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు

  • Publish Date - April 25, 2024 / 06:04 PM IST

  • తొలి విడుత వి‘పక్షమే’నన్న వాదన
  • 13 రాష్ట్రాల్లోని 88 సీట్లకు నేడు పోలింగ్‌
  • వీటిలో 55 ఎన్డీఏ సిటింగ్‌ స్థానాలు
  • మరో 24 సీట్లు అప్పటి యూపీఏవి
  • ఈసారి ఫలితాలు తారుమారయ్యే చాన్స్‌!
  • షెడ్యూల్‌కు ముందు వికసిత్‌ భారత్‌
  • తొలి దఫాలో కాంగ్రెస్‌ టార్గెట్‌గా మోదీ
  • రెండోదఫాలో ముస్లిం వ్యతిరేకతపైనే ఆశ
  • ఆసక్తికరంగా శుక్రవారంనాటి పోలింగ్‌

విధాత ప్రత్యేకం: సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడుత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందులో కేరళలోని 20 స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర 8, యూపీ 8, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం, బీహార్‌లలో ఐదేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌లలో చెరో మూడు స్థానాలు, మణిపూర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ నిర్వహించనున్నారు. వాస్తవానికి 89 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాలి. కానీ మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో అక్కడ మూడో దఫా మే 7న నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, హేమామాలిని, హెచ్‌డీ కుమారస్వామి, నటుడు సరేశ్‌గోపీ సహా పలువురు ప్రముఖులు ఈ ఫేజ్‌లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో ఈ 88 సీట్లలో ఎన్డీఏ 55 సీట్లు, యూపీఏ 24 సీట్లలో విజయం సాధించాయి. కానీ ఈసారి ఆ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మొదటి దఫా ఎన్నికల తర్వాత మోదీ అన్నీ పక్కనపెట్టి కాంగ్రెస్‌ పార్టీనే టార్గెట్‌ చేయడం, భావోద్వేగాల ఆధారంగా ఓట్లు దక్కించుకోడానికి చేసిన ప్రసంగాలతో ఈ దఫా పోలింగ్‌పై ఆసక్తి నెలకొన్నది.

ఇండియావైపే తొలి విడుత?
మొదటి విడుతలో 102 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమివైపే ఓటర్లు మొగ్గుచూపారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ రాజస్థాన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో ప్రధానికి ముస్లిం అంశం తప్ప మరో ముచ్చట చెప్పి ఓట్లు అడిగే ధైర్యం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీ ఆస్తులను లాక్కుని కొందరు చొరబాటుదారులకు పంచాలనే కుట్ర పన్నుతుందని, వారి హయాంలో హనుమాన్‌ చాలీసా వినడమూ నేరమే అని, ప్రపంచాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయని, ఈ సమయంలో కేంద్రంలో బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి అమిత్‌ షా కూడా బెంగాల్‌లో ‘బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే మీకు వచ్చిన సమస్య ఏమిటి? అని ప్రశ్నించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు తాము చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా.. మళ్లీ అవకాశం ఇస్తే ఏం చేస్తామో చెప్పకుండా కులం, మతం పేరుతోనే ఓట్లు దండుకోవాలనుకోవడంపై ప్రతిపక్ష నేతలు ఘాటుగానే స్పందించారు. దేశంలో ఎన్నికల బాండ్ల పథకం అతి పెద్ద దోపిడీ పథకమని, ప్రధాని అవినీతి చాంపియన్‌ అని కాంగ్రెస్‌ అగ్రనేత ఎన్నికల ప్రచార సభల్లో విరుచుకుపడుతున్నారు.

యూపీలోనూ అదే పరిస్థితి. మొదటి విడుతలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 8 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. రెండో దఫాలోనూ 8 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. మొదటి దఫాలో ఇక్కడ బీజేపీ, బీఎస్పీల కంటే ఎస్పీ+కాంగ్రెస్‌ కూటమికే అనుకూలంగా ఉంటుందంటున్నారు. అందుకే ప్రధాని, యూపీ సీఎం ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్‌.. ప్రధాని, యూపీ సీఎంల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా ఢిల్లీ (మోదీ), లఖ్‌నవూ (యోగీ) వాళ్లను మొదటి దఫా పోలింగ్‌ ఎంత అసంతృప్తికి గురిచేసిందో వారి మాటలను బట్టే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘజియాబాద్‌ నుంచి ఘాజీపూర్‌ వరకు తుడిచి పెట్టుకుపోతుంది అన్నారు. యూపీలోని ఘజియాబాద్‌లో శుక్రవారం, ఘాజీపూర్‌లో జూన్‌ 1న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు ఫలితాలే కేరళలోనూ!
మొదటి ఫేజ్‌లో తమిళనాడులో వలె రెండో ఫేజ్‌లో కేరళలో మొత్తం స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ (కాంగ్రెస్‌ 15, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ 2, కేరళ కాంగ్రెస్‌ (ఎం) 1, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ 1) కూటమి 19 స్థానాలు గెలుచుకున్నది. ఎల్‌డీఎఫ్‌ (సీపీఐ (ఎం) 1, సీపీఐ 0) ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈసారి అక్కడ యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌తో పాటు ఎన్డీఏ పోటీ చేస్తున్నది. అక్కడ బీజేపీ ఒక్క సీటు అయినా గెలువాలని కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శబరిమలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా మలుచుకుని తద్వారా ఓట్ల లబ్ధి పొందాలని ఆ పార్టీ ప్రయత్నం చేసింది. అది ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఆర్‌ఎస్‌ఎస్‌, లెఫ్ట్‌ పార్టీల మధ్య కేరళలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. అవి హత్యల దాకా వెళ్తుంటాయి. అయినా తమిళనాడులో వలె ఇక్కడ కూడా బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కర్ణాటకలో గత ఫలితాల పునరావృతం కష్టమే!
కర్ణాటకలో రెండో ఫేజ్‌లో 14 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో క్లీన్‌ స్వీప్‌ (28\25) చేసిన కమలనాథులకు 2022 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. దీంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ను కుటుంబపార్టీ అని, వారిది అవినీతి పాలన అని విమర్శలు చేసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నది. బీజేపీ 25, జేడీఎస్‌ 3చోట్ల పోటీ చేస్తున్నాయి. కుమారస్వామి నాయకత్వానికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. జేడీఎస్‌ మూడు స్థానాలను గెలుచుకుంటేనే ఆయన, వాళ్ల పార్టీ నిలబడుతుంది. జేడీఎస్‌ను గట్టెక్కించే బాధ్యతను మాజీ ప్రధాని దేవెగౌడ కూడా తీసుకున్నారంటేనే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అలాగే యడ్యూరప్పను పక్కనపెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, ప్రధాని సహా ఆ పార్టీ నేతలంతా జై బజరంగ్‌బలి నినాదంతో ఓట్లు సంపాదించాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో గత్యంతరం లేక యడ్యూరప్పతో సంధి చేసుకొని ఆయన కొడుకు విజయేంద్రకే పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. ఆయనకు స్వపక్షంలో ఒకరిద్దరు సీనియర్లు తప్ప మిగిలిన వారంతా సహాయ నిరాకరణ చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయడం అంత ఈజీ కాదు. ఇక కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అంతా తానై నడిపిస్తున్నారు. సీఎం సీటు కోసం చివరిదాకా ప్రయత్నించిన ఆయన అధిష్ఠానం సూచనతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 15 పైగా సీట్లు అందించి సీఎం సీటును చేజిక్కించుకోవాలనుకుంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

రాజస్థాన్‌లో బీజేపీ హవాకు హస్తం చెక్‌
రాజస్థాన్‌లో 19న 12 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అందులో సగం స్థానాలు తమవేనన్న ధీమాతో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నది. రెండో దఫాలో శుక్రవాం 13 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. 2014, 2019లో ఆ రాష్ట్రంలో మొత్తం సీట్లను తన ఖాతాలో వేసుకున్న కమలనాథులకు మొదటి ఫేజ్‌లో ఓటర్లు షాక్‌ ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈసారి కూడా స్వీప్‌ చేయాలనే బీజేపీ ఆశలు ఫలించవని అంటున్నది. ఆ రాష్ట్ర మాజీ సీఎంలు వసుంధర రాజె, అశోక్‌ గెహ్లాట్‌ వాళ్ల తనయులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రాజెను బీజేపీ పట్టించుకోవడం లేదు. ఆమె పార్టీ పట్ల అంటీముంటనట్లే ఉంటున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్‌ సీనియన్‌ నేత సచిన్‌ పైలట్‌ రాష్ట్రమంతటా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపెట్టే ఆ రాష్ట్రంలోని గుజ్జర్లు, మీనాల మద్దతు కూడగడుతున్నారు. ఇవి ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో మేలు చేసే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ ఆశలు పెట్టుకున్న అనేక రాష్ట్రాల్లో ఈసారి ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. అందులో రాజస్థాన్‌ ఒకటి.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, మణిపూర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లలో 33 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ (ఇండియా), మహాయుతి (ఎన్డీయే)కు గట్టి సవాల్ విసురుతున్నది. ఈ నెల 26న ఆ రాష్ట్రంలో 8 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, అస్సాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కంటే ఇండియా కూటమికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి దఫాలో 102, రెండో దఫాలో 88 స్థానాలు మొత్తం 190 స్థానాల్లో పోలింగ్‌ పూర్తవుతుంది. గత ఎన్నికల కంటే ఈసారి కమనాథుల్లో ఎక్కువగా కలవరం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ప్రవచించిన వికసిత్‌ భారత్‌ ఇప్పుడు వినిపించడం లేదు. ఒకవర్గంపై విద్వేష పూరిత ప్రసంగాలతోనే మళ్లీ గట్టెక్కాలనుకుంటున్నారు. బీజేపీ నేతలకు కౌంటర్‌ ఇస్తూనే.. ఇండియా కూటమి నేతలు అంశాల వారీగా మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ ఫేజ్‌ పోరు ఆసక్తికరంగా మారింది.

Latest News