Warangal Urban Cooperative Bank | విధాత, ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు (warangal urban cooperative bank)కు తాజాగా రాజకీయ చీడ పట్టింది. రాజకీయ బలాబలాలు, పలుకుబడి (power play) ప్రదర్శనగా మారుస్తున్నారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు బ్యాంకును బలిపశువును చేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకాలం అందరి అండదండలతో అడుగు వేసిన బ్యాంకును ప్రత్యక్ష రాజకీయ జోక్యానికి వేదికగా మారుస్తున్నారు. ఇటీవల నాయకుల మధ్య విభేదాలు పెరిగి పరస్పర విమర్శలతో నువ్వానేనా అనే స్థితిలో వరంగల్ తూర్పు రాజకీయాలు రంగమెక్కాయి. ఈ నీలినీడలిప్పుడు అర్బన్ బ్యాంకు పైన పొడచూపుతున్నాయి. దీంతో బ్యాంకు పురోభివృద్ధికి ఈ రాజకీయ ఆధిపత్యపోటీ అడ్డంకుగా మారుతోందనే అందోళన సభ్యులనుంచి వ్యక్తమవుతోంది. సహకార రంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించిన పరిస్థితుల్లో… కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మూడు దశాబ్దాలుగా ఈ బ్యాంకు అప్రతిహతంగా కొనసాగుతోంది. కాగా, తెరవెనుక రాజకీయాలు ఇప్పుడు వరంగల్ (warangal) అర్బన్ బ్యాంకును బహిరంగ సమస్యల్లోకి నెడుతోంది. తన పైన కక్షతో మంత్రి కొండా సురేఖ నూతన పాలకవర్గం ఎన్నికలను నిలిపివేయించి, బ్యాంకును రాజకీయ వేదికకు వినియోగించుకుంటున్నారని చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు (errabelli pradeep rao) బహిరంగంగానే విమర్శించారు. దీనిపై మంత్రి కొండా సురేఖ (konda surekha) ఏ విధంగా స్పందిస్తారో మరి?
పాలకవర్గ ఎన్నికకు అడ్డంకి
వరంగల్ అర్బన్ బ్యాంకు ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి బుధవారం జూలై 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం బ్యాంకు పాలకవర్గం, సహకారం శాఖ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ సమయంలో ఒకరిద్దరు వ్యక్తులు చేసిన ఫిర్యాదు ఎన్నికల నిర్వహణకు పిడుగుపాటుగా మారింది. బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నాయని, సభ్యుల్లో బినామీలు ఉన్నారని,అప్పులివ్వడంలో తప్పులు జరుతున్నాయని, రివకవరీ సరిగ్గాలేదని, నిర్వహణ పేరుతో బ్యాంకు సొమ్ము వాడుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయించడమే కాకుండా, అధికారులపై మంత్రి సురేఖ ఒత్తిడి చేసిందని ఎర్రబెల్లి ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నిక వాయిదా వేశారంటున్నారు.
ఎర్రబెల్లికి చెక్ పెట్టడమే లక్ష్యమా?
జూలై 30 వరకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎన్నిక కాకుండా అడ్డుకోవడమే ప్రత్యర్థుల లక్ష్యంగా చెబుతున్నారు. ఈ మూడు దశాబ్దాల చరిత్రలో రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికలు జరగగా ప్రదీప్ రావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మిగిలిన సందర్భాల్లో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 25 ఏళ్ళుగా ఈ బ్యాంకు చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బ్యాంకు నూతన పాలకవర్గం ఎన్నిక వాయిదా పడ్డాయి. దీంతో పర్సన్ ఇన్‌ఛార్జ్‌ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుత పాలకవర్గం వెంటనే ఎన్నికయ్యే ఛాన్సు ఇవ్వకుండా కొద్ది కాలం ఎన్నికలు వాయిదావేసి అధికారానికి దూరం చేయడమే ప్రత్యర్ధుల లక్ష్యంగా భావిస్తున్నారు. ఇదిలాఉండగా 1994లో ఏర్పాటైన బ్యాంకు ప్రస్తుతం 10 బ్రాంచ్లకు విస్తరించింది. రూ.400 కోట్లకు పైగా టర్నోవర్తో రూ.220 కోట్ల లావాదేవీలు, రూ.162 కోట్ల అప్పులతో కొనసాగుతోంది.
కుట్రతోనే మంత్రి సురేఖ ఫిర్యాదు: ఎర్రబెల్లి
రాజకీయ కుట్రతో మంత్రి కొండా సురేఖ ఎన్నికలను అడ్డుకుందని బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల బాట పట్టించామన్నారు. వ్యక్తిగత కక్షలతో నన్ను అడ్డుకోవడం తప్పన్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు ఇలా బ్యాంక్ అభివృద్ధిని అడ్డుకోలేదని విమర్శించారు. లాభాల బాటలో ఉన్న బ్యాంక్ ఎన్నికలను మంత్రి వ్యక్తిగత కక్షలతో అడ్డుకోవడం శోచనీయమన్నారు. ధైర్యముంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయంగా ఎదుర్కొవాలి తప్ప బ్యాంకులో కుల్లు రాజకీయాలను తీసుకరావద్దని ఎర్రబెల్లి కోరారు.