ఏదైనా కేసు నమోదు చేసిన సమయంలో తరచుగా ఎఫ్ఐఆర్ గురించి వింటుంటాం. పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో వాదనలు జరిగే సమయంలో ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావన ఉంటుంది. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు? దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం.
ఎఫ్ఐఆర్ అంటే ఏంటి?
ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించేందుకు ఈ నివేదికను తయారు చేస్తారు. ఏదైనా ఘటన లేదా నేరానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు స్వీకరించిన తర్వాత దానిని ఎఫ్ఐఆర్ అంటారు. అధికారిక ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి గతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్ పీసీ సెక్షన్ 154 ఉండేది. సీఆర్ పీ సీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టంలోని సెక్షన్ 13 నుంచి 173 వరకు ఎఫ్ఐఆర్ కు సంబంధించినవే. నేరం లేదా ఏదైనా సంఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ఎఫ్ఐఆర్ లో ఉంటాయి. నేరం జరిగిన సమయం, తేదీ, నిందితతుడి గురించిన వివరాలను ఎఫ్ఐఆర్ లో పొందుపరుస్తారు. ఇది చట్టపరమైన ప్రక్రియకు తొలి అడుగు. ఎఫ్ఐఆర్ కోర్టులో సాక్ష్యంగా కూడా ఉపయోగపడుతుంది. కాగ్నిజబుల్ నేరాన్ని వివరించే అధికారిక రాత పూర్వక పత్రమే ఎఫ్ఐఆర్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే కోర్టు జోక్యం లేకుండా పోలీసులు అరెస్టులు, నిర్బంధించవచ్చు లేదా దర్యాప్తు చేయవచ్చు.
ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఏం జరుగుతుంది?
పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన తర్వాత దర్యాప్తును ప్రారంభిస్తారు. సాక్షుల వాంగ్మూలాలు లేదా ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడి ఆరోపణలను ధృవీకరించే ఆధారాలు ఉంటే చార్జీషీట్ దాఖలు చేస్తారు. లేకపోతే ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని లేదా లేవని తుది నివేదికను కోర్టులో దాఖలు చేస్తారు. ఎటువంటి నేరం జరగలేదని తేలితే రద్దు నివేదికను దాఖలు చేస్తారు. నిందితుల జాడ కనిపించకపోతే గుర్తించబడని నివేదికను దాఖలు చేస్తారు. దర్యాప్తు నివేదికతో కోర్టు ఏకీభవించకపోతే తదుపరి దర్యాప్తునకు ఆదేశించవచ్చు.
ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే ఏమి చేయాలి?
ఏదైనా ఫిర్యాదుకు సంబంధించి పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేయవచ్చు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే బాధితులు జిల్లా ఎస్పీ నగరాల్లో డీసీపీకి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం లేదా ఫిర్యాదుపై ఉన్నతాధికారి సంతృప్తి చెందితే కేసు దర్యాప్తు చేస్తారు. లేదా కిందిస్థాయి అధికారిని దర్యాప్తు చేయాలని ఆదేశిస్తారు.
ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కు తేడా ఏంటి?
తెలిసిన లేదా తెలియని వ్యక్తి నేరం చేశారని మేజిస్ట్రేట్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు కింద నమోదైన కేసును వివరిస్తారు. ఇందులో పోలీస్ నివేదిక ఉండదు. ఇక ఎఫ్ఐఆర్ అంటే వాస్తవాలను నిర్ధారించిన తర్వాత పోలీసులు సృష్టించే రికార్డ్. ఎఫ్ఐఆర్ లో నేరం, నిందితుడి గురించి సమాచారం ఉండవచ్చు. ఎఫ్ఐఆర్ లోని ప్రథమ సమాచార నివేదిక దాఖలు చేసిన తర్వాత నేరం చేసినట్టు సూచనలు కన్పిస్తే పోలీస్ దర్యాప్తు ప్రారంభం అవుతుంది. ఎలాంటి నేరం కనుగొనకపోతే విచారణను ముగిస్తారు.
తప్పుడు ఎఫ్ఐఆర్
తప్పుడు ఎఫ్‌ఐఆర్ అంటే ఒకరిని దురుద్దేశపూర్వకంగా క్రిమినల్ కేసులో ఇరికించే ఉద్దేశ్యంతో తెలిసి తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ఆరోపణలతో పోలీసులకు ఇచ్చే ఫిర్యాదు. ఇటువంటి ఫిర్యాదులు వ్యక్తికి పేరు, ఆర్థిక, మానసిక నష్టాన్ని కలిగిస్తాయి. తప్పుడు ఎప్ఐఆర్ కేసులో చిక్కుకుంటే మీరు ఉన్నత అధికారులను మేజిస్ట్రేట్‌ను లేదా హైకోర్టును సంప్రదించవచ్చు. లేదా సెక్షన్ 482 కింద హైకోర్టులో ఎఫ్ఐఆర్ ను రద్దు చేయమని పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇక రెండో ఎఫ్ఐఆర్ అంటే ఒకే సంఘటనకు సంబంధించి వేరే నేరం కోసం నమోదు చేసే రెండో ప్రథమ సమాచార నివేదిక. సుప్రీంకోర్టు ప్రకారం ఒకే నేరానికి రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. కానీ వేర్వేరు నేరాలకు ఇది అనుమతిస్తారు. ఒక సంఘటనలో వేర్వేరు వ్యక్తులు పాల్గొన్నప్పుడు లేదా ఒకే సంఘటనలో వివిధ రకాల నేరాలు జరిగినప్పుడు రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ఒక సంఘటన నుంచి ఉత్పన్నమయ్యే వేరే నేరాలను గుర్తించినప్పుడు రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు.
జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి?
మరొక పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగినట్లు ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదును అందుకుంటే… దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ఘటన వస్తోందో రాదో పక్కన పెట్టి తమకు అందిన ఫిర్యాదును జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారికి లేదా పోలీస్ స్టేషన్ కు ఈ జీరో ఎఫ్ఐఆర్ ను పంపుతారు.
