Tesla Robot Optimus | కుంగ్‌ ఫూ యుద్ధ కళ ప్రదర్శిస్తున్న రోబో ఆప్టిమస్‌! వీడియో అదుర్స్‌!

టెస్లాకు చెందిన హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్‌.. కుంగ్‌ ఫూ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోను చూసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.. మీరూ చూడండి..

Tesla Robot Optimus | చిట్టి ద రోబో గుర్తున్నాడా? సినీ దర్శకుడు శంకర్ సృష్టించిన హ్యూమనాయిడ్‌ రోబో.. నడుస్తుంది.. పరిగెడుతుంది.. డ్యాన్స్‌ చేస్తుంది.. కరాటే కూడా చేస్తుంది. ఇది రీల్‌! కానీ.. రియాల్టీలో కూడా ఒక హ్యూమనాయిడ్‌ రోబో కుంగ్‌ఫూ నేర్చుకోవడం ఆసక్తి రేపుతున్నది. అది టెస్లా తయారు చేసిన రోబో ఆప్టమస్‌! మానవ సహాయం లేకుండానే ఆప్టిమస్‌ కుంగ్‌ఫూ నేర్చకుంటున్న వీడియోను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన శిక్షకుడితో స్నేహపూర్వకంగా మార్షల్‌ ఆర్ట్‌ సెషన్‌లో పాల్గొన్న ఆప్టిమస్‌.. అద్భుతమైన చురుకుదనాన్ని, నియంత్రణను ప్రదర్శించడం విశేషం.

ఆప్టమిస్‌ రోబో, దాని శిక్షకుడు ఒకరినొకరు అభివాదం చేసుకోవడంతో ఈ వీడియో క్లిప్‌ మొదలవుతుంది. శిక్షకుడు దాడి చేస్తుంటే.. దానిని తగిన పద్ధతిలో సమర్థంగా తిప్పి కొడుతుంది. శిక్షకుడిని నియంత్రించడమే కాదు.. శిక్షకుడు తనను నెట్టివేసినా.. పట్టు కోల్పోకుండా తనను తాను నియంత్రించుకుంటుంది. అవసరమైన సమయంలో భంగిమలు మార్చుతూ.. నిజంగానే ఎదుట ఒక వ్యక్తి రోబో డ్రస్‌ వేసుకుని ఫైట్‌ చేశాడా? అనిపించేంతగా ఉంది. ఫైట్‌ ముగిసన సమయంలో ప్రశాంతంగా తటస్థ భంగిమకు తిరిగి రావడం అద్భుతంగా ఉన్నది.

టెస్లా రోబోటిక్స్‌ ప్రోగ్రామ్‌లో ఆప్టిమస్‌ను ఒక కీలక పురోగతిగా మస్క్‌ గతంలో అభివర్ణించారు. మానవులు పదే పదే చేయాల్సిన పనులు లేదా.. ప్రమాదకరమైన పనులను యంత్రాలు చేపట్టే దీర్ఘకాలిక టాస్క్‌తో ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. మానవ కదలికలను తనంతట తానుగా నేర్చుకోగల, స్వయంగా ప్రాసెస్‌ చేసి, తిరిగి ప్రదర్శించగల సంక్లిష్ట సామర్థ్యాలను తాజా ప్రదర్శన కళ్లకు కట్టింది. రోబో సినిమాలో చిట్టిపైన జరిగిన చర్చే ఇప్పుడు ఆప్టిమస్‌ విషయంలోనూ జరుగుతున్నది. హ్యూమనాయిడ్స్‌ సాధిస్తున్న ప్రగతిని కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇటువంటి యంత్రాలు పోరాట నైపుణ్యాలు నేర్చుకుంటే.. దానిని ఆపరేట్‌ చేసేవారి కారణంగా కలిగే చిక్కుల గురించి మరికొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆప్టిమస్‌ తొలిసారి 2021లో విడుదలైంది. అప్పటి నుంచి తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ వస్తున్నది. దాని కదలికలు, చలాకీతనం, నిర్ణయం తీసుకోవడం వంటి విషయాల్లో ఆప్టిమస్‌ను మరింతగా తీర్చిదిద్దే విషయంలో టెస్లా ఇంజినీర్లు ఫోకస్‌ పెట్టారు. అయితే.. కొందరు యూజర్లు రోబోలు ఫైటింగ్‌ నేర్చుకోవడం వల్ల ప్రాక్టికల్‌గా లాభమేంటని నిలదీస్తున్నారు. మరో యూజర్‌ భిన్నంగా స్పందిస్తూ.. ‘వెరీ కూల్‌. కానీ.. అది చెత్త ఊడ్చడం, బట్టలు ఉతకడం, ఉతికిన బట్టలను చక్కగా మడత పెట్టడం, బాత్రూంలు మెరిసిపోయేలా కడగటం… ఈ పనులు ఎప్పుడు చేస్తుందా? అని చూస్తున్నాను’ అని రాశారు. మరొకరు రోబోలకు ఇటువంటి యుద్ధ నైపుణ్యాలు నేర్పడం మంచిదేనా? కాదా? నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.

 

ఇవి అస్సలు మిస్‌ కావొద్దు…

sex robots:నిజ‌మైన లైంగిక భాగ‌స్వామిలా వ్య‌వ‌హ‌రించేలా ఏఐ ఆధారిత రోబోలు.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ స్ట‌న్నింగ్ కామెంట్స్
Robo Boxing | ప్రపంచంలో.. తొలిసారి రోబోల మధ్య బాక్సింగ్
AI-assisted Robotic Surgery | ఆపరేషన్‌ థియేటర్లలో నూతన విప్లవం.. రోబోటిక్‌ సర్జరీకి ఏఐ సహకారం!