Site icon vidhaatha

AI-assisted Robotic Surgery | ఆపరేషన్‌ థియేటర్లలో నూతన విప్లవం.. రోబోటిక్‌ సర్జరీకి ఏఐ సహకారం!

AI-assisted Robotic Surgery |  ఆరోగ్య రంగంలో రోబోటిక్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శస్త్రచికిత్సలు ఇప్పటికే చేస్తున్నారు. దీనిని మరింత ఆధునీకరించే క్రమంలో దానికి AI పరిజ్ఞానాన్ని జోడించేందుకు కృషి చేస్తున్నారు. ఏఐ అసిస్టెడ్‌ రోబోటిక్‌ సర్జరీల వల్ల కచ్చితత్వం అత్యధిక స్థాయిలో ఉండటమే కాకుండా.. తక్కువ సమస్యలు, పేషెంట్‌ అతి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సర్జికల్‌ కేర్‌ విషయంలో సమూల మార్పులకు ఈ కొత్త పరిజ్ఞానం పునాది వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రోబోటిక్‌ సర్జరీలకు ఏఐ పరిజ్ఞానాన్ని జోడించే విషయంలో 2024–2025 మధ్య కాలంలో 25 అధ్యయనాలను కలిపి సిస్టమాటిక్‌ రివ్యూ చేశారు. ఈ అత్యాధునిక వ్యవస్థల శస్త్రచికిత్సల సందర్భంగా తలెత్తే కాంప్లికేషన్లను 30 శాతం వరకూ తగ్గించివేస్తాయని సిస్టమాటిక్‌ రివ్యూలో తేలింది. అంతేకాకుండా కచ్చితత్వాన్ని కూడా పెంచుతుందని, పేషెంట్‌ అతి త్వరగా కోలుకునే అవకాశం ఉందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా హాస్పిటళ్లు వేగవంతమైన, భద్రమైన, తక్కువ ఖర్చుతో కూడిన సర్జికల్‌ ప్రొసీజర్స్‌ కోసం చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్‌ సర్జరీలకు కృత్రిమ మేధ సహకారం తోడవడం అత్యంత సమీపంలో ఉందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను రోబోటిక్‌ సర్జరీ జనరల్‌లో పబ్లిష్‌ చేశారు.

ఇప్పటికే రోబో ఆధారిత శస్త్రచికిత్సలు వేగంగా అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా ముందస్తు విశ్లేషణ, తక్షణ నిర్ణయ సహకారం సాధ్యమవుతున్నాయి. డిజిటల్ ట్విన్స్ వంటి AI ఆధారిత వ్యవస్థలు శస్త్రచికిత్సలో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తున్నాయి. వయసు మీదపడుతున్నవారి జనాభా పెరుగుదల, వైద్య నిపుణుల కొరత, ఆరోగ్య సేవల వ్యయం పెరుగుతుండటం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా హాస్పిటళ్లపై మునుపెన్నడూ లేనంత ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ సహకారక రోబోటిక్‌ సర్జరీలు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్నాయి.

సిస్టమాటిక్‌ రివ్యూ సందర్భంగా పరిశోధకులు ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సవాళ్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రధానమైనది డాటా నాణ్యత. ఎక్కువ శాతం మషీన్‌ లెర్నింగ్‌ మోడల్స్‌కు భిన్నంగా ఉండే, వివరణలతో కూడిన శస్త్రచికిత్స డాటా సెట్‌లు అవసరమని, ప్రస్తుత వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా, విస్తృతంగా ఉపయోగపడేంత స్థాయిలో లేవని అధ్యయనం పేర్కొంటున్నది. నైతిక సమస్యలు, చట్టపరమైన ఆందోళనలు కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలేనని నిపుణులు చెబుతున్నారు. AI ఇచ్చే ప్రాంప్ట్‌ ఆధారంగా చేసిన శస్త్రచికిత్సలో తప్పిదాలు చోటు చేసుకుంటే ఆ బాధ్యత ఎవరన్నది ప్రధాన ప్రశ్న. అసలు ఏఐ నిర్ణయాలు ఎంత మేరకు పారదర్శకం అనేది మరో కీలక అంశంగా ముందుకు వస్తున్నది. సాఫ్ట్‌వేర్‌ అనుకూలత, సైబర్‌ భద్రత వంటి అంశాలపైనా ఆందోళనలు ఉన్నాయి.

Exit mobile version