TDR Policy | టీడీఆర్‌పై రేవంత్‌ సర్కార్‌ యూటర్న్‌? మహారాష్ట్ర విధానం అమలు దిశగా కసరత్తు!

టీడీఆర్‌ల విషయంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పునరాలోచనలో పడిందా? బిల్డర్ల నిరసనలు, సన్నిహిత రియల్టర్ల సూచనలతో దీనిని మార్చే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నారా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి రేవంత్‌ రెడ్డి సన్నిహిత వర్గాలు. ప్రస్తుత టీడీఆర్‌ విధానాన్ని మార్చి, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అనుసరిస్తున్న పాలసీల తరహాలో కొత్త విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆ వర్గాల కథనం.

TDR Policy | టీడీఆర్‌పై రేవంత్‌ సర్కార్‌ యూటర్న్‌? మహారాష్ట్ర విధానం అమలు దిశగా కసరత్తు!

విధాత, హైదరాబాద్ :

TDR Policy | ఖజానాకు ఆదాయం తీసుకువచ్చే ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి సర్కారు టీడీఆర్‌ విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం.. పది అంతస్తులకు పైన నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకు పది శాతం టీడీఆర్‌ను తప్పనిసరి చేశారు. అదికూడా భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడే టీడీఆర్‌ కొని, అప్‌లోడ్‌ చేయాలని షరతు విధించారు. ఈ నిర్ణ‌యం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైరైజ్ నిర్మాణాలు భారీగా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ ప్రాంతాల‌కు చెందిన బిల్డ‌ర్ల‌కు శ‌రాఘాతంగా మారింది. ఇప్ప‌టికే నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాలు, నిర్మాణం పూర్త‌యిన భ‌వ‌నాల‌లో ఫ్లాట్లు అమ్ముడుపోక ఆర్థికంగా ఒడిదుడుకుల‌కు గుర‌వుతున్న బిల్డ‌ర్ల‌కు ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రో వైపు ప్ర‌భుత్వంలోని కీల‌క‌మైన నేత‌కు చెందిన ‘త్రిమూర్తులు’ భారీ ఎత్తున టీడీఆర్‌ల‌ను బ్లాక్ చేసి, అధిక ధ‌ర‌కు అమ్ముకోవ‌డానికే ఈ విధానం తీసుకు వ‌చ్చార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వెల్లువెత్తాయి.

బిల్డర్ల నిరసన

రాష్ట్ర ప్ర‌భుత్వం 10 అంత‌స్తుల పైన నిర్మించే భ‌వ‌నాల‌కు టీడీఆర్ త‌ప్ప‌ని స‌రి చేసిన త‌రువాత కొంతమంది బిల్డ‌ర్లు నేరుగా రేవంత్ రెడ్డిని క‌లిసి త‌మ‌ నిర‌స‌న వ్య‌క్తం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితులుగా ఉన్న ఒక‌రిద్ద‌రు బిల్డ‌ర్లు కూడా ‘ఇదేం పద్ధతి? ఇదే కొనసాగితే బిల్డ‌ర్లు అంతా హైద‌రాబాద్ వ‌ద‌లి పెట్టి వెళ్లేలా ఉన్నారు’ అని కరాఖండిగా చెప్పినట్టు నిర్మాణ రంగ వ్యాపార వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. కొత్త టీడీఆర్ పాల‌సీ వ‌చ్చిన త‌రువాత బ‌హుళ అంత‌స్థుల నిర్మాణాల‌కు బిల్డ‌ర్లు ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌ని తెలుస్తోంది. పాత ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌నే కానీ కొత్త‌వి లేవ‌ని ఒక బిల్డ‌ర్ తెలిపారు.

మహారాష్ట్ర, కర్ణాటక విధానాల అధ్యయనం?

భ‌వన నిర్మాణ సంస్థ‌ల నుంచి, ప్ర‌ముఖ బిల్డ‌ర్ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌తో రేవంత్ స‌ర్కారు పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. టీడీఆర్ పాల‌సీలో మార్పులు చేయాల‌న్న ఆ లోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల‌లో ఉన్న టీడీఆర్ పాల‌సీపై అధ్యయ‌నం చేసిన‌ట్లు తెలిసింది. ముఖ్యంగా మ‌హారాష్ట్రలో బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌న నిర్మాణంల‌లో 10 నుంచి 20 అంత‌స్థుల‌ వ‌ర‌కు చేసే నిర్మాణాల‌కు 2.5 శాతం, 20 నుంచి 30 అంత‌స్థుల వ‌ర‌కు చేసే నిర్మాణాల‌కు అద‌నంగా మ‌రో 2.5 శాతం… 30 నుంచి ఆ పైన నిర్మించే అంత‌స్థుల‌కు అద‌నంగా 5 శాతం వ‌ర‌కు అద‌న‌పు చార్జీలు కానీ, ఈ మేర‌కు టీడీఆర్ కానీ బిల్డ‌ర్‌కు ఏది అనుకూల‌మైతే దానిని వినిగించుకునే విధానం అమ‌లులో ఉంద‌ని, ఈ విధానం మంచిద‌న్న అభిప్రాయాన్ని కూడా రేవంత్‌కు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే బ్లాక్ అయిన టీడీఆర్‌లు

రాష్ట్రంలో కీల‌క‌ నేత‌కు చెందిన త్రిమూర్తులు ఇప్ప‌టికే భారీ ఎత్తున టీడీఆర్‌లను బ్లాక్ చేసిన‌ట్లు స‌మాచారం. వీరి వ‌ద్ద వేల కోట్ల రూపాయ‌ల టీడీఆర్‌లు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సాధార‌ణ రోజుల‌లో నిత్యం మార్కెట్‌లో 20 ప్ల‌స్ కే దొరికే టీడీఆర్‌లు బ్లాక్ చేయ‌డంతో అమాంతం ఒకేసారి డిమాండ్ పెరిగి 50 ప్ల‌స్ కు చేరుకుందని అంటున్నారు. ఇది చిన్న బిల్డ‌ర్ల‌కు అశ‌నిపాతంలా మారింది. అస‌లు మార్కెట్‌లో టీడీఆర్ దొర‌క కుండా చేశార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే 10 అంత‌స్తుల పైన నిర్మాణాల‌కు టీడీఆర్ త‌ప్ప‌ని స‌రి చేయ‌డాన్నిబిల్డ‌ర్లు త‌ప్పు ప‌ట్ట‌డంతో బ్లాక్ చేసిన టీడీఆర్‌లు అమ్ముడు పోయే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఆ త్రిమూర్తులు కూడా అంతర్మథనంలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ బ‌డా బాబులు టీడీఆర్‌లు భారీ ఎత్తున విక్ర‌యించ‌డం కోసం మ‌ధ్య‌వ‌ర్తుల‌ను కూడా ఏర్పాటు చేసుకున్న‌ట్లు భ‌వ‌న నిర్మాణ దారుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Read Also |

AI Chat Safety | ఏఐతో మీ చాట్‌లో ప్రైవసీ ఎంత? స్టాన్‌ఫోర్డ్‌ అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్‌ అంశాలు..
Odisha Young Farmer | కింద చేప‌ల చెరువు.. పైన సొర‌కాయ‌ల సాగు.. ఏడాదికి రూ. 8 ల‌క్ష‌ల ఆదాయం
Kakatiya Vishnu Idol| వెయ్యేళ్ల శిల్పం కిరీటం…కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!