విధాత : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన స్థలం కబ్జాకు గురికావడంతో తన బాధను చెప్పుకునేందుకు అమరావతిలోని పవన్ క్యాంప్ ఆఫీసుకు మహిళ వచ్చింది. కానీ పోలీసులు పవన్‌ను కలవకుండా అడ్డుకోవడంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
రాజమండ్రిలో తన 1200 గజాల స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారని సదరు మహిళ తెలిపింది. ఓ మహిళా కార్పొరేటర్, బ్రోకర్‌ను అడ్డం పెట్టుకుని తన స్థలాన్ని లాక్కున్నారని ఆరోపించింది. అధికారులను, వైసీపీ నేతలను కలిసినా లాభం లేకుండాపోయిందని తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో నిన్న ఏపీ సీఎం చంద్రబాబును కలవాలని తన భర్తతో కలిసి ప్రయత్నించానని చెప్పింది. కానీ ముఖ్యమంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతించలేదని ఆ మహిళ వాపోయింది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవాలని వచ్చినట్లు పేర్కొంది. ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొంది.
పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు.… pic.twitter.com/4ezFP3Q3WX
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2024
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన శాఖలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. సూచనలు తెలియజేయడానికి క్యూఆర్‌కోడ్, గూగుల్ ఫామ్‌ను విడుదల చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీకి సంబంధించిన సూచనలు ఇవ్వాలని ప్రజలను కోరారు.