అమరావతి : ఏపీ(AP)లో ఇటీవల కర్నూల్ జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది సజీవ దహనమైన దుర్ఘటన మరువకముందే..పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మరో బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. ఆంధ్ర-ఒరిస్సా ఘాట్ రోడ్డులో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒరిస్సా ఆర్టీసీ బస్సు(Odisha RTC bus fire) పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు అగ్ని ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌లో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సాలూరు ఫైర్ స్టేషన్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పారు. ప్రమాద సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే ఉన్నారు.
బస్సు ప్రమాదంపై అధికారులను మంత్రి సంధ్యారాణి వెంటనే వివరాలు తెలుసుకుని సహాయక చర్యలకు అధికారులను పురమాయించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రికి అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సు దగ్ధం ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు.
