Banakacharla | పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణలోని అన్ని పార్టీలు అనుమానాలు.. అభ్యంతరాలతో మాట్లాడుతున్నాయని.. వాటిని మంత్రులు, కూటమి నేతలంతా తిప్పికొట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బనకచర్లతో సముద్రంలోకి వెళ్లే మిగులు వరద జలాలే వాడుకుంటున్నామని..ప్రాజెక్టుతోల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్న అంశాన్ని బలంగా వినిపించాలని కోరారు. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 42 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఎజెండా ఆమోదం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా మనం అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత ఏపీ మంత్రులు, నాయకులపై ఉందని స్పష్టం చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌పై మనం దశల వారిగా ముందుకు వెళ్తామని సూచించారు. కేంద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని వివరించారు. సున్నితమైన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌పై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. జులై 1వ తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు. కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు.
కేబినెట్ కీలక నిర్ణయాలు : మంత్రి పార్థసారధి
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం రెండో విడత భూసేకరణ చేయాలని, రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్‌తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీఆర్‌డీఏ సమావేశ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. స్వర్ణాంధ్ర పీ4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి, పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీకి అనుమతిచ్చిందన్నారు. మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపామన్నారు. భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.