Site icon vidhaatha

Icchampally Waste of Money  | అక్కరలేని ఇచ్చంపల్లి! దానికి ఎగువన, దిగువన ఇప్పటికే బరాజ్‌లు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 25 (విధాత‌) :

Icchampally Waste of Money  | ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నామ‌ని సంబ‌రప‌డుతున్న రాజ‌కీయ నేత‌లు.. ఆ ఎత్తుగ‌డ‌ల ఉచ్చులో చిక్కుకొని మోయ‌లేని ఆర్థిక భారాన్ని ప్ర‌జ‌ల‌పై రుద్దుతున్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణం పేరుతో రాజ‌కీయ క్రీడ‌లు ఆడుతున్నార‌న్న విమ‌ర్శ‌లు బ‌హిరంగంగానే వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట‌ర్లు ఇచ్చే క‌మీష‌న్ల కోస‌మే పాల‌కులు ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో క‌ట్టిన ప్రాజెక్టుల నుంచి పొలాలకు ఏ విధంగా సాగునీళ్లు ఇవ్వాల‌న్న దానిపై ఆలోచ‌న చేసి, ప‌క‌డ్భందీ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన స‌ర్కారు.. దాన్ని వదిలేసి.. కొత్త ప్రాజెక్ట్‌ల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డాన్ని సాగునీటి రంగ నిపుణులు త‌ప్పు ప‌డుతున్నారు. ఆంధ్ర ప్ర‌జ‌ల‌కు అక్క‌ర‌లేని బ‌న‌క‌చ‌ర్ల‌ను టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తెర‌పైకి తీసుకు వ‌స్తే.. దానికి కౌంట‌ర్‌గా తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చంప‌ల్లి ప్రాజెక్ట్‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చింది. ఈ పంచాయ‌తీ కేంద్రం వ‌ద్ద‌కు వెళితే వాళ్లు అడిగితే మేము ఇస్తే త‌ప్పేంట‌న్న తీరుగా ఎలాంటి ప‌రిశీల‌న చేయ‌కుండానే ఒకే అని చెప్పింది. దీంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం అయోమ‌యంలో ప‌డింది.

నిజాం కాలంలో ఆగిన ఇచ్చపల్లి

గోదావ‌రి న‌దిపై ఇచ్చంప‌ల్లి ప్రాజెక్ట్ ప్ర‌తిపాద‌న నిజాం ప్ర‌భుత్వం కాలం నుంచే ఉన్న‌ది. నిర్మాణానికి కొన్ని ప్రయత్నాలు కూడా సాగాయి. అయితే.. నిర్మాణం కొనసాగుతున్న సమయంలో ఫ్రెంచ్ ఇంజినీర్లు, నిర్మాణ కార్మికులు చాలా మంది క‌ల‌రా, మ‌సూచి వ్యాధులు వ‌చ్చి చనిపోయారు. దీంతో ఇంజినీర్లు, కార్మికులు అక్క‌డకు వెళ్లి ప‌ని చేయ‌డానికి నిరాక‌రించడంతో ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇప్ప‌టికీ ఆ ఆన‌వాళ్లు మ‌న‌కు ఇచ్చంప‌ల్లిలో క‌నిపిస్తాయి. నిజాం ప్రాంతం భార‌త్‌లో విలీనం అయిన త‌రువాత కూడా ఏనాడూ ఇచ్చంప‌ల్లి నిర్మాణంపై పాల‌కులు దృష్టి కేంద్రీక‌రించ‌లేదు. కానీ ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌ల‌య‌జ్ఞం ప్రాజెక్ట్ కింద ప్రాణ‌హిత న‌దిపై త‌మ్మిడిహెట్టి వ‌ద్ద బరాజ్‌ నిర్మించి, ఆ నీటిని చేవెళ్ల‌కు వ‌ర‌కు తీసుకు రావ‌డం కోసం ప్రాణ‌హిత‌–చేవెళ్ల ప్రాజెక్ట్‌ను తీసుకువ‌చ్చారు. ఈ ప్రాజెక్ట్ ఉమ్మ‌డి రాష్ట్రంలో 60 శాతం వ‌ర‌కు పూర్త‌యింది. నేడు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లింక్‌లో భాగంగా ఎల్లంప‌ల్లి నుంచి ఎత్తిపోస్తున్న నందిమేడారం మోట‌ర్ల‌తో స‌హా అన్ని అవేన‌ని సాగునీటి పారుద‌ల అంశంపై లోతైన అధ్య‌య‌నం చేసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు చెప్పారు.

ఇచ్చంప‌ల్లికి పైన కింద ప్రాజెక్టులే

గోదావ‌రి న‌దిపై ఇచ్చంప‌ల్లి కింద 12 కిలోమీట‌ర్ల దూరంలో తుపాల‌కుల గూడెం వ‌ద్ద స‌మ్మ‌క్క బరాజ్‌ నిర్మించారు. దీని కెపాసిటీ 6.94 టీఎంసీలు. అలాగే ఇచ్చంప‌ల్లికి పైన 34 కిలోమీట‌ర్ల దూరంలో మేడిగ‌డ్డ వ‌ద్ద 16.17 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్‌ నిర్మించారు. దీంతో ఇచ్చంప‌ల్లికి పైన కింద రెండు చోట్ల ఇప్పటికే బరాజ్‌లు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్‌కు 15, 20 కిలోమీట‌ర్ల దూరంలో ఎవ్వ‌రూ కొత్త ప్రాజెక్టులు నిర్మించబోరని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ఈ రెండు బరాజ్‌ల మ‌ధ్య గోదావ‌రి–కావేరి లింక్‌లో భాగంగా ఇచ్చంప‌ల్లి నిర్మాణానికి అంగీకారం చెప్ప‌డ‌మే విడ్డూరంగా ఉంద‌ని సాగునీటి రంగ నిపుణుడొక‌రు అన్నారు. ఇచ్చంప‌ల్లి ప్రాజెక్టుతోపాటు దీనికి సంబంధించిన కాలువ‌లు కూడా నిర్మించాల‌న్నా త‌క్కువ‌లో త‌క్కువ‌ దాదాపు 25 వేల ఎక‌రాల భూమి అవ‌స‌రం అవుతుంద‌ని అంచనా. దీని ప్రకారం.. ఒక్కో రైతు నుంచి స‌రాస‌రిన రెండున్నర ఎక‌రాల భూమిని సేక‌రించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డినా దాదాపు 10 వేల మంది రైతులు భూ నిర్వాసితులుగా మారే ప్ర‌మాదం ఉంది.

ఇచ్చపల్లి నీటి అవసరమేంటి?

ప్ర‌స్తుత స్థితిలో ఇచ్చంప‌ల్లి నీళ్లు తెలంగాణ రైతాంగానికి ఎక్క‌డ అవ‌స‌రం ప‌డ‌తాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తుపాకుల గూడెం వ‌ద్ద నిర్మించిన స‌మ్మ‌క్క బరాజ్‌కు ఆరు కిలోమీటర్ల ఎగువన దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడేళ్ల‌లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్ట్‌ను 25 ఏళ్లుగా కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఏ పాల‌కుడికీ దీనిపై చిత్త‌శుద్ది లేద‌ని అర్థం అవుతోంద‌ని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఒక జ‌ర్న‌లిస్ట్ అభిప్రాయప‌డ్డారు. అయితే దేవాదుల నీళ్లు కూడా ఎస్సారెస్పీ కెనాల్ మీదుగా జ‌న‌గామ వ‌ర‌కు తీసుకు వ‌చ్చారు. కానీ దీనిని వ‌రంగ‌ల్ వ‌ద్ద ఎస్సారెస్పీ కెనాల్‌కు మాత్రం లింక్ చేయ‌లేదు. పాల‌కుల‌ది ఇదొక విచిత్ర‌మైన వైఖ‌రి అని సాగునీటి రంగ నిపుణుడొక‌రు అన్నారు. మ‌రో వైపు దేవాదుల ప్రాజెక్టులో మ‌రో రెండు పంపులు అద‌నంగా ఏర్పాటు చేసి ఎస్సారెస్పీ ఫేజ్‌–2కు నీళ్లు ఇస్తే స‌రిపోయేది క‌దా! అని అంటున్నారు సాగునీటి రంగ నిపుణులు.

ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు

ఇచ్చంప‌ల్లి పైన బీఆరెస్ హయాంలో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు నిర్మించారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. మేడిగడ్డ బరాజ్‌ కుంగుబాటు త‌రువాత ఈ నీటిని ఎత్తిపోసిందీ లేదు. కేవ‌లం ఎల్లంప‌ల్లి ప్రాజెక్ట్ నుంచి తీసుకున్న నీటినే ఎత్తిపోసి పంట పొలాల‌కు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల కాకుండా కేవ‌లం ఎల్లంప‌ల్లి ప్రాజెక్ట్ నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇవి కొండ పోచ‌మ్మ సాగ‌ర్ వ‌ర‌కు వెళుతున్నాయి. ఈ మూడు బరాజ్‌ల నీరు అవ‌స‌రం లేకుండానే ఎల్లంప‌ల్లి నుంచే సాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిప‌డా నీటిని ఎత్తిపోస్తున్న‌ట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే అర్థం అవుతున్న‌ది. బీఆరెఎస్ హ‌యాంలో కూడా పెద్ద‌గా నీటిని ఎత్తిపోసింది లేదు. నాలుగేళ్ల‌లో162 టీఎంసీల నీటిని ఎత్తిపోసి దాదాపు 60 టీఎంసీల నీటిని కింద‌కు గోదావ‌రిలోకే వ‌ద‌ల‌డం గ‌మ‌నార్హం.

ఒకే ఆయ‌క‌ట్టుకు రెండు మూడు ర‌కాల ప్రాజెక్టులా?

ఒకే ఆయ‌క‌ట్టుకు రెండు మూడు ర‌కాల ప్రాజెక్టులు క‌ట్ట‌డం త‌ప్పు అనే అభిప్రాయం స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్న‌ది. ఎస్సారెస్సీ కాలువ‌ల‌న్నింటినీ ప్రాణ‌హిత–చేవెళ్ల ప్రాజెక్ట్ కింద లింక్ చేశారు. అలా ఎస్సారెస్పీ కింద అదే ఆయ‌క‌ట్టు, కాళేశ్వ‌రం కింద అదే ఆయ‌క‌ట్టును చూపించారు. ఇదే ఆయ‌క‌ట్టును దేవాదుల కింద చూపించార‌న్న అభిప్రాయం సాగునీటి రంగ నిపుణుల్లో వ్య‌క్తం అవుతున్న‌ది. కేసీఆర్ చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లింక్‌లు కూడా వీటికే అనుసంధానం చేశారు. అంతేకాక‌ గోదావ‌రి నీళ్లను బ‌స్వాపూర్ ద్వారా మూసీకి వ‌చ్చే విధంగా నిర్మాణం చేశారు. అలాగే ఎస్సారెస్పీ లింక్ ద్వారా సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ఈటూరు వ‌ద్ద మూసీలోకి లింక్ చేశారు. దీని ద్వారా ఇప్ప‌టికే గోదావ‌రి నుంచి కృష్ణాకు అనుసంధానం జ‌రిగిన‌ట్లేన‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్న‌ది.

ఏపీలో ఇప్పటికే అనుసంధానం

ఏపీలో ఇప్ప‌టికే ప‌ట్టిసీమ ద్వారా గోదావ‌రి నీటిని కృష్ణా బేసిన్‌కు మ‌ళ్లించారు. ఈ ప్రాజెక్ట్ దిగ్విజ‌యంగా న‌డుస్తున్న‌ది. కృష్ణా నీటిని హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా త‌మిళ‌నాడులోని పాలార్ న‌దికి అనుసంధానం చేశారు. శ్రీ‌శైలం నుంచి తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా చెన్నై న‌గ‌రానికి తాగునీరు అందిస్తున్నారు. ఇప్ప‌టికే గోదావ‌రి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నాకు, పెన్నా నుంచి పాలార్‌కు న‌దుల అనుసంధానం జ‌రిగింది. ఇంకాస్త దూరం ఆ నీటిని తీసుకువెళితే కావేరీలోకి వెళ‌తాయ‌ని చెపుతున్నారు. ఇప్ప‌టికే అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ‌గానే న‌దుల అనుసంధానం జ‌రిగింద‌న్న అభిప్రాయం సాగునీటి రంగ ఇంజినీర్ల‌లో వ్య‌క్తం అవుతున్న‌ది. మ‌రో మారు న‌దుల అనుసంధానం పేరిట ఇచ్చంప‌ల్లి, బ‌న‌కచ‌ర్ల ప్రాజెక్ట్‌ల‌ను తెర‌పైకి తీసుకురావ‌డాన్ని సాగునీటి రంగ నిపుణులు త‌ప్పు ప‌డుతున్నారు. కొత్త‌గా తెర‌పైకి తీసుకువ‌స్తున్న అనుసంధానం ప్రాజెక్ట్‌ల వ‌ల్ల వేల కోట్ల ప్ర‌జాధ‌నం వృథా చేయ‌డం త‌ప్ప మ‌రేమీ ఉండ‌ద‌ని తేల్చి చెబుతున్నారు.

Exit mobile version