MLA Pinnelli | ఎమ్మెల్యే పిన్నెల్లి కేసులలో ఏపీ హైకోర్టు తీర్పు రేప‌టికి వాయిదా

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు, తర్వాత నమోదైన అల్లర్లకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన మూడు కేసులలో బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి

  • Publish Date - May 27, 2024 / 06:05 PM IST

జూన్ 6 వరకు ముందస్తు బెయిల్‌

విధాత, హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు, తర్వాత నమోదైన అల్లర్లకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన మూడు కేసులలో బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మూడు కేసుల్లో విచారణ ముగించిన ఏపీ హైకోర్టు ఇరువర్గల వాదనలు విన్న తర్వాత తీర్పును మంగళవారంకు వాయిదా వేసింది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి జూన్ 6వరకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరీ చేసింది.

పిన్నెల్లిపై రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌స్టేషన్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నం చేశారని రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడి వెళ్లిన సమయంలో తలెత్తిన గొడవల్ని అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారనే ఫిర్యాదుపై పిన్నెల్లి, ఆయన తమ్ముడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పీఎస్‌లో మరో కేసు నమోదైంది.

మరోవైపు పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లిని మరో మహిళ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే తీవ్రంగా దుర్భాషలాడినట్లు ఆ మహిళ ఫిర్యాదుతో రెంటచింతల పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. పీపీ పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందని కూడా కోర్టుకు చెప్పారు. బాధిత సీఐ తరఫున కూడా లాయర్ వాదించారు.

Latest News