అమరావతి, విధాత :
రాష్ట్రంలో ఉన్న 85 శాతం మంది బహుజనులను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుంటూ, కేవలం ఉత్సవ విగ్రహాలు వంటి పదవులను ఎర వేస్తున్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల భారత యాదవ మహా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు గుంటూరు నగరంలో నిర్వహించిన యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవానికి రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీలు, దళితులు, అన్ని వర్గాల కోసం రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
బహుజనులకు రాజ్యాధికారం వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, తను పయనించే మార్గంలో ఎలాంటి అడ్డంకులు, కష్టాలనైనా ఎదుర్కుంటానని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు మినహా అన్ని స్థానాల్లో బీసీలు ముందుకొచ్చి పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సంపదను అందినకాడికి దోచుకుని, అన్ని వర్గాలను అణగదొక్కుతున్న వారిని ఎదుర్కొనేందుకు భారత చైతన్య యువజన పార్టీని స్థాపించినట్లు రామచంద్ర యాదవ్ వెల్లడించారు.
దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను ఏకం చేసే దిశగా ప్రయాణం కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మార్పు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మొదలు కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకొని పోవాలంటే సొంత కులం యాదవులకు విలువ ఇవ్వకుండా ఎలా న్యాయం చేయలేననే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చానన్నారు. యాదవులకు సంబంధించిన కార్యక్రమం ఎక్కడ జరిగినా హాజరవుతానని, దానివల్ల రాజకీయంగా నష్టం జరిగినా పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాలు చైతన్యంతో మార్పు కోరుకుంటున్నారని.. ఈ మార్పు కొనసాగితే దశాబ్దాల పోరాటాలు, ఉద్యమాలు, కలలు నెరవేరతాయని రామచంద్ర యాదవ్ అన్నారు.
