టీడీపీ అభ్యర్థులకు బీ ఫారంలు అందించిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు టీడీపీ అధినేత ఎన్‌. చంద్రబాబు నాయుడు బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు

  • Publish Date - April 21, 2024 / 04:06 PM IST

రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం ప్రమాణం
ఐదు స్థానాల్లో మారిన అభ్యర్థులు

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు టీడీపీ అధినేత ఎన్‌. చంద్రబాబు నాయుడు బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. బీ ఫారం తీసుకునే సమయంలో తండ్రి కాళ్లకు నారా లోకేశ్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బావమరిది బాలకృష్ణ కూడా చంద్రబాబు చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నారు. ముందుగా ఎంపీ అభ్యర్థులకు బీపారాలు అందించాకా ఎమ్మెల్యే అభ్యర్థులకు అందచేశారు.

ఐదు స్థానాల్లో మారిన అభ్యర్థులు
టీడీపి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు అనూహ్యంగా ఐదు చోట్ల అభ్యర్థిత్వాలను మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల అభ్యర్థుల్లో మార్పు చేశారు. ఉండి అభ్యర్ధిగా మంతెన రామరాజు స్థానంలో రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. పాడేరులో రమేశ్‌నానాయుడుకు బదులుగా గిడ్డి ఈశ్వరికి బీ ఫారం కేటాయించారు. మాడుగులలో పైలా ప్రసాద్ స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పించారు. మడకశిరలో సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు బీఫారాం ఇచ్చారు. వెంకటగిరిలో తొలుత ప్రకటించిన లక్ష్మిప్రియ స్థానంలో ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకే తిరిగి అవకాశం కల్పించారు. టీడీపీ ఈ ఎన్నికల్లో 144అసెంబ్లీ స్థానాల్లో, 17ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగతా స్థానాల్లో జనసేన, బీజేపీలు పోటీ చేస్తున్నాయి.

Latest News