Site icon vidhaatha

వైసీపీ ఫ్యాన్ ముక్కలవ్వడం ఖాయం: చంద్రబాబు

జగన్ మీ బిడ్డ కాదు…రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ
ఓటేసిన వారినే కాటేశాడు
టీడీపీ అధినేత చంద్రబాబు

విధాత: టీడీపీ కూటమికి లభిస్తున్న ప్రజాదరణతో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్యాన్‌ రెక్కలు విరిగి ముక్కలవ్వడం ఖాయమని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగిపోయాయని, తాము అధికారంలోకి రాగానే దాడులను అరికడతామన్నారు. జగన్ ప్రభుత్వం ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేసిందని, లేటరైట్ ముసుగులో బాక్సైట్ గనులను దోచుకున్నారని ఆరోపించారు.

విజయవాడలో నరేంద్ర మోదీ రోడ్‌ షో ను చూసి అధికార వైసీపీ కాడి ఎత్తివేసిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమన్నారు. రెండు వందల రూపాయలున్న పింఛన్లను రెండువేలకు టీడీపీ పెంచిందని, రాబోయే రోజుల్లో ఏప్రిల్‌ నుంచే రూ.4 వేలు పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు. ఒక్కచాన్స్‌ ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ఓటేసిన వారిని కాటేసారని ఆరోపించారు. మోసపు వాగ్ధానాలతో జగన్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దళిత, గిరిజనులకు మోసం చేసిన వ్యక్తికి ఓటు వేయవద్దని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించి స్థానికులకే ఉద్యోగాలిస్తామని పునరుద్ఘాటించారు. రైతుల పాస్‌ పుస్తకంపై జగన్‌ ఫొటో ఎందుకు వేశారో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం ద్వారా భూములను లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల్లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, జగన్ మీ బిడ్డ కాదు. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు పేర్కోన్నారు. వైసీపీ నవరత్నాలు కాదు.. నవమోసాలని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ కూటమి జనం ముందుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు.విద్యుత్తు చార్జీలతో పాటు అన్ని ధరలనూ పెంచేశారని దుయ్యబట్టారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల్లేవని, ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు పోతుందని ఆరోపించారు. దుర్మార్గపు జగన్ పాలనకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడాలని కోరారు.

Exit mobile version